Telugu Global
National

పథకాల అమలులో ముందు.... ప్రచారంలో వెనక....

ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైసిపి గడచిన ఆరునెలల పాలన జనరంజకంగా ఉన్నప్పటికీ, చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో బాగా వెనకబడింది. ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లే విషయంలో గానీ, చేసిన అభివృద్దిని చెప్పుకునే విషయంలో గానీ అనుకున్న స్థాయిలో మార్కులు పడటం లేదు. రాజధాని పనులు మినహా చాలా అంశాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజారంజకంగానే పాలన చేస్తోంది. అయితే వీటికి రావాల్సినంత పాజిటివ్ మైలేజీ మాత్రం ప్రభుత్వానికి రాలేదు. […]

పథకాల అమలులో ముందు.... ప్రచారంలో వెనక....
X

ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైసిపి గడచిన ఆరునెలల పాలన జనరంజకంగా ఉన్నప్పటికీ, చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో బాగా వెనకబడింది.

ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లే విషయంలో గానీ, చేసిన అభివృద్దిని చెప్పుకునే విషయంలో గానీ అనుకున్న స్థాయిలో మార్కులు పడటం లేదు. రాజధాని పనులు మినహా చాలా అంశాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజారంజకంగానే పాలన చేస్తోంది.

అయితే వీటికి రావాల్సినంత పాజిటివ్ మైలేజీ మాత్రం ప్రభుత్వానికి రాలేదు. ఇసుక దొరకడంలేదు, రాజధాని పనులు అపేశారని ప్రతిపక్షం చేసే రాద్దాంతానికి మాత్రం ఎక్కువగా మైలేజీ లభించింది. చేసే పనుల్ని చెప్పుకునే విషయంలో వైసిపి ప్రభుత్వం వెనుకబడిందని అందరూ అంగీకరిస్తున్నారు.

ప్రతిపక్షం రాద్దాంతం చేసినపుడు మాత్రం ఒకరిద్దరు మంత్రులు, అధికార ప్రతినిధులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం మినహా… ప్రభుత్వం చేసే మంచి పనుల గురించి ప్రచారం ఉండదు. పైగా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం మాత్రం అధికంగా ఉంటోంది.

ఆరునెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను అని ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పకుండా ఆయన నిరంతరం ప్రజాసంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ఎవరూ ఊహించని రీతిలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాంటి వాటికి కూడా కనీస ప్రచారం లభించడం లేదు.

గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అయితే చేయని వాటికి సైతం అత్యధికంగా ప్రచారం లభించేది. ఏదైనా ఒక పథకం ప్రవేశపెట్టే ముందు నెలనుంచే ప్రచారం చేసే వారు. స్వయంగా ముఖ్యమంత్రే దానికి శ్రీకారం చుడుతూ రోజుల తరబడి మీడియాలో ఊదరగొట్టేవారు. కానీ ఇపుడు ఎన్నో కార్యక్రమాలు జనరంజకంగా ఉంటున్నాయి. కానీ వాటిని చెప్పుకునే విషయంలో వైసిపి ప్రభుత్వం ఘోరంగా విఫలం అయింది.

గత ప్రభుత్వ హయాంలో చేయలేని వాటిని సైతం జగన్ ప్రభుత్వం చేసి చూపుతోంది. కానీ ప్రచారంలోకి రావడం లేదు. ఉదాహరణకు అగ్రిగోల్డ్ బకాయిలు చెల్లింపు చేశారు. 20వేల రూపాయల వరకూ ఉన్నవాటికి నిధులు విడుదల చేశారు. తగిన ప్రచారం లేదు.

ఆటోడ్రైవర్లకు పదివేల రూపాయల పథకం ప్రవేశపెట్టారు. ప్రచారం లేదు. పోలీసులకు వారాంతపు సెలవులు ఇచ్చారు… దీన్ని సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది చారిత్రాత్మక నిర్ణయం దీనికి సరైన ప్రచారం లభించలేదు.

గత ప్రభుత్వ హయాంలో రైతు రుణమాఫీ ఎన్నికల కోసమే పెడితే, ఇపుడు రైతు భరోసా మొత్తాన్ని పెంచి, అందించారు. కానీ ప్రచారం లేదు. స్పందన కార్యక్రమం అపూర్వం. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ప్రభుత్వం బాగా వెనుకబడింది.

ఇంగ్లీషు మీడియం స్కూళ్ల అంశంపై సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు స్వాగతిస్తున్నాయి. దీన్ని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. సామాజిక మార్పు దిశగా జగన్ తీసుకున్న ఈనిర్ణయం చరిత్రలో నిలిచి పోతుంది. కానీ దీనికి కూడా అనుకున్నంత ప్రచారం లభించడం లేదు.

వీటన్నింటి కంటే కూడా భారత దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లక్షల ఉద్యోగాలు ఇచ్చేశారు. 1.5 లక్షల గ్రామ సచివాలయం ఉద్యోగాలు, 4లక్షల మందికి గ్రామ వాలంటీర్ల పోస్టులు ఇచ్చారు. వీటికి కనీస ప్రచారం కూడా లేదు.

గత తెలుగు దేశం ప్రభుత్వహయాంలో ఉపాధ్యా య పోస్టుల కోసం రెండు సార్లు డిఎస్సీ నిర్వహించి, ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. వైఎస్ఆర్ హయాంలో నిర్వహించిన డిఎస్సీ పోస్టులను తెలుగు దేశం హయాంలో పోస్టింగ్స్ ఇచ్చి, విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో పెద్ద ఈవెంట్ గా చేశారు. కానీ లక్షల పోస్టులు ఇచ్చి కూడా కనీసం ప్రచారం లేకుండా పోయింది.

గడచిన ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం లేని పరిస్థితుల్లో ఈయేడాది నవంబరు 1వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్వహించారు. ఆంధ్రుల సెంటిమెంటుగా ఉన్న అవతరణ దినోత్సవాన్ని తెలుగుదేశం ప్రభుత్వం మార్చేసింది. కానీ జగన్ మాత్రం పాత సంప్రదాయాన్ని కొనసాగించారు. కానీ దీనికి కూడా ప్రచారం లేదు.

దేశంలోనే మొదటిసారి ఎస్సీ, ఎస్టీలకు 5 మంత్రి పదవులు ఇచ్చారు. మహిళా ఎస్సీ ప్రతినిధికి రాష్ర్ట హోంశాఖ, ఎస్సీ అభ్యర్థికి విద్యాశాఖను కేటాయించడం చారిత్రాత్మకమే. దీన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం వెనకబడింది.

ఇలాంటివే అనేకం. ప్రజారంజక పాలన చేయడానికి మనసా, వాచా, కర్మణా జగన్ సిద్దం అయ్యారు. ఆయన తన పని తాను చేసుకుపోతున్నారు. కానీ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో సరైన ప్లానింగ్ లేకుండా పోయింది. దీనివల్ల ఎన్ని మంచి పనులు చేసినా, చేయలేదనే ప్రచారాన్ని ప్రతిపక్షం చేస్తోంది.

అధికార పక్షం చేయలేని ప్రచారాన్ని ప్రతిపక్షం చేస్తోంది. కానీ ఇది రాష్ర్టానికి అంత మంచిది కాదు. ఇప్పటికైనా అధికార పక్షం మేల్కొనాలి. ఎంత పనిచేసినా, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా, తగిన రీతిలో ప్రజలకు ఆయా అంశాలు చేరకపోతే వ్యతిరేకతే వస్తుంది.

First Published:  30 Nov 2019 12:35 PM IST
Next Story