చంద్రబాబు కడప టూర్ రిజల్ట్...
కడప జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజులు పర్యటించారు. కానీ ఏం సాధించారు? అంటే ఏం లేదు. కడప జైలుకు వెళ్లి ఓ నేతను పరామర్శించారు. నాలుగు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అంతేగాని నేతల మధ్య విభేదాలు పరిష్కరించలేదు. అలిగిన నేతలను బుజ్జగించలేదు. గత ఎన్నికల్లో టీడీపీ అత్యంత అవమానకర ఓటమిని చూసిన కడప జిల్లాలో…. పదికి పది అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. ఓటమితో కొందరు టీడీపీ నేతలు బీజేపీలోకి […]
కడప జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజులు పర్యటించారు. కానీ ఏం సాధించారు? అంటే ఏం లేదు. కడప జైలుకు వెళ్లి ఓ నేతను పరామర్శించారు. నాలుగు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అంతేగాని నేతల మధ్య విభేదాలు పరిష్కరించలేదు. అలిగిన నేతలను బుజ్జగించలేదు.
గత ఎన్నికల్లో టీడీపీ అత్యంత అవమానకర ఓటమిని చూసిన కడప జిల్లాలో…. పదికి పది అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. ఓటమితో కొందరు టీడీపీ నేతలు బీజేపీలోకి జంప్ అయ్యారు.
గత ఎన్నికలలో అంతా తామే అని చక్రం తిప్పిన ఎంపీ సీఎం రమేష్, మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి కమలం కండువా కప్పుకున్నారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. మరికొందరు ద్వితీయ శ్రేణి నేతలు కూడా బీజేపీ గూటికి చేరారు.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కడపలో అడుగుపెట్టారు. కార్యకర్తలను స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ చేద్దామని బాబు వస్తే ఆయనకు షాక్‌లు ఇచ్చారు. బాబు పర్యటనకు పలువురు నేతలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది.
గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అధినేత పర్యటన కు గైర్హాజరు అయ్యారు. ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇదే రీతిలో రాయచోటి లో మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ రాయుడు ఆయన తనయుడు టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ప్రసాద్ బాబు కూడా బాబు పర్యటన కు దూరంగా ఉన్నారు. వీరిద్దరూ రాజంపేట ఎంపి మిథున్ రెడ్డితో టచ్ లో ఉన్నారని… త్వరలో ఈ కుటుంబం కూడా వైసీపీ కండువా కప్పుకునే చాన్స్ ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
కడప జిల్లాలో వైఎస్ కు వ్యతిరేకంగా రాజకీయాలు నడిపిన మాజీమంత్రి దివంగత వీరారెడ్డి కుమార్తె బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కూడా చంద్రబాబు పర్యటన కు మొహం చాటేశారు..జమ్మలమడుగు లో ఆదినారాయణ రెడ్డి కమలం గూటికి చేరగా ఆయన సోదరుడు ఎమ్మెల్సీ శివనాథ రెడ్డి కూడా టీడీపీ సమావేశానికి దూరంగా ఉండటం పార్టీ నాయకత్వాన్ని కలవరపెడుతోంది.
పార్టీ అధినేత చంద్రబాబు తొలిరోజు పర్యటనలో కనిపించని ఎమ్మెల్సీ బీటెక్ రవి రెండవ, మూడవ రోజు పర్యటనలో కన్పించడం పార్టీ నాయకత్వానికి ఊరట నిచ్చింది. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి, టీటీడీ మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు చెంగలరాయుడు,సతీష్ రెడ్డి… మిగిలిన నియోజకవర్గాల ఇంచార్జ్ లు బాబు పర్యటనలో పాల్గొనడం పార్టీ నాయకత్వానికి సంతృప్తి కలిగించింది.. వలసపక్షులు వీడినా పార్టీ క్యాడర్ చాలా వరకు అలాగే ఉండడం తో జిల్లా పార్టీ భవితవ్యంపై చంద్రబాబులో భరోసా ఏర్పడింది.