ఆర్టీసీ సమ్మె విరమణ.... రేపు ఉదయం విధుల్లోకి- అశ్వత్థామ రెడ్డి
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. రేపు ఉదయం 6గంటలకు విధుల్లో చేరుతామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. అందరు కార్మికులు ఉదయం విధులకు హాజరుకావాలని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మె విరమిస్తున్నట్టు ఆయన తెలిపారు. కార్మికుల శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని… ఈ ముప్పు నుంచి ఆర్టీసీని రక్షించుకోవాలన్న ఉద్దేశంతోనే … ప్రభుత్వం నుంచి స్పందన లేకపోయినా సమ్మె విరమిస్తున్నట్టు అశ్వత్థామరెడ్డి […]
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. రేపు ఉదయం 6గంటలకు విధుల్లో చేరుతామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. అందరు కార్మికులు ఉదయం విధులకు హాజరుకావాలని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మె విరమిస్తున్నట్టు ఆయన తెలిపారు. కార్మికుల శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని… ఈ ముప్పు నుంచి ఆర్టీసీని రక్షించుకోవాలన్న ఉద్దేశంతోనే … ప్రభుత్వం నుంచి స్పందన లేకపోయినా సమ్మె విరమిస్తున్నట్టు అశ్వత్థామరెడ్డి వివరించారు. సమ్మె విరమిస్తున్నప్పటికీ నైతిక విజయం మాత్రం కార్మికులదేనని వ్యాఖ్యానించారు.
కార్మికులు సమ్మె విరమించినప్పటికీ ప్రభుత్వం వారిని విధుల్లోకి తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. విలీనం ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తొలినుంచి స్పష్టం చేస్తూ వచ్చారు. వివిధ మార్గాల్లో కార్మిక సంఘాలు, విపక్షాలు ఆందోళన చేసినా, వ్యవహారం కోర్టుకు చేరినా ఫలితం లేకపోయింది.
నాలుగు రోజుల క్రితం కూడా విధులకు హాజరయ్యేందుకు కార్మికులు సిద్దమయ్యారు. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో డిపోలకు వచ్చిన కార్మికులను అధికారులు వెనక్కు పంపిస్తూ వస్తున్నారు. సమ్మె విరమణపై కార్మిక సంఘాలు ప్రకటన చేసిన నేపథ్యంలో.. కార్మికులను విధుల్లోకి చేర్చుకునే ముందు ప్రభుత్వం కొన్ని కండిషన్లు పెట్టే అవకాశం కనిపిస్తోంది. కార్మిక సంఘాల ప్రమేయం తగ్గించే దిశగా చర్యలు ఉండవచ్చని భావిస్తున్నారు. మొత్తం 52 రోజుల పాటు తెలంగాణ ఆర్టీసీ సమ్మె కొనసాగింది.