Telugu Global
NEWS

ఆర్టీసీలో 50 శాతానికి మించకుండా ప్రైవేటీకరణ.. ఉద్యోగులకు వీఆర్ఎస్..?

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేటికి 49వ రోజుకు చేరుకుంది. అటు కార్మిక సంఘాలు, ఇటు యాజమాన్యం, ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతానికి పైగా బస్సులు డిపోల్లోకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం కూడా మొదటి నుంచి కార్మికులకు డెడ్‌లైన్లు విధించింది తప్ప చర్చలకు పిలువలేదు. దీంతో కార్మిక సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. నెల రోజులకు పైగా పలు పిటిషన్లు, పిల్‌లను పరిశీలించిన కోర్టు.. ప్రభుత్వాన్ని చర్చలకు పిలవమని తాము ఆదేశించలేమని స్పష్టం చేసింది. ఇక శుక్రవారం […]

ఆర్టీసీలో 50 శాతానికి మించకుండా ప్రైవేటీకరణ.. ఉద్యోగులకు వీఆర్ఎస్..?
X

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేటికి 49వ రోజుకు చేరుకుంది. అటు కార్మిక సంఘాలు, ఇటు యాజమాన్యం, ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతానికి పైగా బస్సులు డిపోల్లోకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం కూడా మొదటి నుంచి కార్మికులకు డెడ్‌లైన్లు విధించింది తప్ప చర్చలకు పిలువలేదు. దీంతో కార్మిక సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి.

నెల రోజులకు పైగా పలు పిటిషన్లు, పిల్‌లను పరిశీలించిన కోర్టు.. ప్రభుత్వాన్ని చర్చలకు పిలవమని తాము ఆదేశించలేమని స్పష్టం చేసింది. ఇక శుక్రవారం నాడు.. మంత్రివర్గం తీసుకున్న 50 శాతం రూట్ల ప్రైవేటీకరణ వ్యాజ్యాన్ని కూడా కొట్టివేయడంతో ప్రభుత్వానికి మార్గం సుగమమం అయ్యింది.

ఇక రూట్ల ప్రైవేటీకరణకు మార్గం సుగమమం కావడంతో 5,100 ఆర్టీసీ రూట్లను ప్రైవేటు ఆపరేటర్లకు కట్టబెట్టనున్నారు. ఈ మేరకు ఇప్పటికే క్యాబినెట్ తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 1988 మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 67(3)ని సవరించింది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు వాహనాలకు రూట్లు కట్టబెట్టే అధికారం ఏర్పడింది.

దీంతో చట్టమే ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చిన తర్వాత తాము జోక్యం చేసుకోమని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, అదే చట్టంలో రూట్ల ప్రైవేటీకరణ 50 శాతానికి మించొద్దని కూడా ఉందని.. ప్రభుత్వం దానిని గుర్తుంచుకోవాలని సూచించింది.

రాష్ట్రంలో 50 శాతం రూట్లు ప్రైవేటీకరిస్తే ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను ఏమి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం టీఎస్ఆర్టీసీలో 49వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ప్రతీ ఏడాది 4 వేల మంది రిటైర్ అవుతున్నారు. కొత్త వారిని చేర్చుకోవట్లేదు కాబట్టి.. సగానికి సగం మంది ఉద్యోగులు తగ్గాలంటే కనీసం ఆరేండ్లు పడుతుంది. కాబట్టి 50 ఏండ్లు పైబడిన ఉద్యోగులకు వీఆర్ఎస్ అమలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. దీనికి సంబంధించి ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు.

ఏదేమైనా.. ఆర్టీసీ చరిత్రలో సుదీర్ఘంగా జరిగిన సమ్మె.. చివరకు సంస్థను ప్రైవేటు పరం చేసే దిశగా అడుగులు వేసింది.

First Published:  23 Nov 2019 2:20 AM IST
Next Story