Telugu Global
NEWS

వర్మ ట్రయిలర్ వదిలిన ప్రతిసారీ చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్‌...

రాంగోపాల్ వర్మ తన కొత్త సినిమాకు సంబంధించిన ట్రయిలర్‌ విడుదల చేసిన ప్రతీసారి చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌కు గురై ఏదేదో మాట్లాడుతున్నారని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. లేటెస్ట్‌గా వర్మ మరో ట్రయిలర్ విడుదల చేయడంతో పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా డబ్బు ఆదా చేయడాన్ని కూడా చంద్రబాబు తప్పుపట్టడం విచిత్రంగా ఉందన్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన మేఘా సంస్థకు గతంలో చంద్రబాబే […]

వర్మ ట్రయిలర్ వదిలిన ప్రతిసారీ చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్‌...
X

రాంగోపాల్ వర్మ తన కొత్త సినిమాకు సంబంధించిన ట్రయిలర్‌ విడుదల చేసిన ప్రతీసారి చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌కు గురై ఏదేదో మాట్లాడుతున్నారని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు.

లేటెస్ట్‌గా వర్మ మరో ట్రయిలర్ విడుదల చేయడంతో పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా డబ్బు ఆదా చేయడాన్ని కూడా చంద్రబాబు తప్పుపట్టడం విచిత్రంగా ఉందన్నారు.

ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన మేఘా సంస్థకు గతంలో చంద్రబాబే బెస్ట్‌ కంపెనీ అంటూ అవార్డులు కూడా ఇచ్చారన్నారు. అదే కంపెనీ ఇప్పుడు తక్కువ ధరకే పోలవరం కడతామని ముందుకొస్తే ఆనందించాల్సిందిపోయి చంద్రబాబు విమర్శలు చేస్తున్నారన్నారు.

చంద్రబాబు దిగిపోతూ ఏకంగా 40వేల కోట్ల రూపాయల పెండింగ్‌ బిల్లులు పెట్టిపోయారని.. అప్పుల పాలు చేసి వెళ్లారని… ఇప్పుడేమో తన హయాంలో ఆర్థిక వృద్దిరేటు ఎక్కువగా ఉండేదని చెప్పుకుంటున్నారని విమర్శించారు.

లక్ష కోట్లతో ప్రపంచ స్థాయి రాజధాని చేయవచ్చని చంద్రబాబు ఎలా చెబుతున్నారో అర్థం కావడం లేదన్నారు. లక్ష కోట్లతో ప్రపంచ స్థాయి నగరమే నిర్మాణం అవుతుంటే ఏడాదికి ఒక నగరం వచ్చి ఉండేదన్నారు.

రాజధాని విషయంలో సింగపూర్ ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి ఒప్పందం లేదన్నారు. చంద్రబాబు మాత్రం సింగపూర్‌ ప్రభుత్వం వెనక్కు వెళ్లిపోయిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సింగపూర్‌లోని ప్రైవేట్ కంపెనీలతో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు.

అమరావతి అన్నది చంద్రబాబుకు బంగారుబాతులా పనిచేసిందని… అందుకే చదరపు అడుగు నిర్మాణానికి 10వేల రూపాయలు చెల్లించి దోచిపడేశారన్నారు.

ఇసుకను ప్రైవేట్ వ్యక్తులు దోపిడి చేయకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వమే ఇసుకను విక్రయిస్తుంటే దాంట్లో కూడా దోపిడి ఉందని పచ్చి అబద్దాలు చంద్రబాబు చెబుతున్నారన్నారు. ప్రభుత్వమే ఇసుక అమ్ముతుంటే దాంట్లో దోపిడి ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

టీడీపీ హయాంలో ఏ పాదంతో ఎంటర్‌ అవుతారో గానీ వర్షాలే ఉండేవి కాదన్నారు. ఈ ఏడాది భారీగా వర్షాలు రావడంతో నదుల్లో వరద కారణంగా ఇసుక సరఫరాకు ఇబ్బంది ఏర్పడిందన్నారు. కానీ ఈవారం రోజుల్లోనే ఇసుక కొరతను అధిగమించేశామన్నారు. కావాల్సినంత ఇసుక ఇప్పుడు అందుబాటులోకి తెచ్చామన్నారు.

చంద్రబాబు హయాంలో 4300 మద్యం షాపులుంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 20 శాతం తగ్గించామన్నారు. నడిరోడ్డుపై మద్యం తాగకుండా పర్మిట్‌ రూంలను రద్దు చేశామన్నారు. ఇవి మంచి చర్యలు కాదా అని ప్రశ్నించారు.

గతంతో పోలిస్తే మద్యం వినియోగం 15 శాతం తగ్గిందన్నారు. కానీ ధరలు ఎక్కువగా ఉండడం వల్లే ఆదాయం మాత్రం పెద్దగా తగ్గలేదన్నారు.

ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించడం ద్వారా ప్రతిపక్షాలు పరువు పోగొట్టుకున్నాయన్నారు. మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారని ప్రజలు నిలదీసే సరికి సమాధానం చెప్పలేక.. రకరకాల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు.

అన్న క్యాంటీన్ల నుంచి చివరకు కుర్చీల మీద క్లాత్‌ వరకు పార్టీ రంగు ఉండేలా చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఐదేళ్లలో మొత్తం రాష్ట్రాన్ని అవినీతిమయం చేసి ఇప్పుడు నిజాయితీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

నేను క్రమశిక్షణకు మారుపేరు, నేనో విజనరీని, నన్ను మించిన వారులేరు అని ఈ ప్రపంచంలో చంద్రబాబు తప్ప మరొకరు చెప్పుకోలేరన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, టీఆర్‌ఎస్‌, జనసేన ఇలా అన్ని పార్టీలతోనూ పొత్తులు పెట్టుకుని ఇప్పుడు తిరిగి మరోసారి పాత పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవడం ద్వారా…. చంద్రబాబు తనకు ఎలాంటి రాజకీయ నీతినియమాలు లేవని నిరూపించుకుంటున్నారని బుగ్గన విమర్శించారు.

First Published:  22 Nov 2019 1:01 AM IST
Next Story