Telugu Global
CRIME

వీఆర్‌వో చెవి కొరికిన మరో వీఆర్‌వో

ఇప్పటికే అత్యంత అవినీతి విభాగంగా కావాల్సినంత చెడ్డ పేరును మూటకట్టుకున్న రెవెన్యూ శాఖ… ఉద్యోగుల తీరు వల్ల మరింతగా ప్రజల్లో చులకన అవుతోంది. రెవెన్యూ శాఖలోని మెజారిటీ ఉద్యోగులు లంచాలు తీసుకోనిదే పని చేయరన్న అపవాదు ప్రజల్లో ఉంది. రెవెన్యూ ఉద్యోగుల పట్ల ప్రజల్లో సానుభూతి కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. కర్నూలు తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఇద్దరు వీఆర్‌వోలు కొట్టుకున్న తీరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆదివారం అయినా కార్యాలయానికి వచ్చి మరీ కొట్టుకున్నారు. కర్నూలు […]

వీఆర్‌వో చెవి కొరికిన మరో వీఆర్‌వో
X

ఇప్పటికే అత్యంత అవినీతి విభాగంగా కావాల్సినంత చెడ్డ పేరును మూటకట్టుకున్న రెవెన్యూ శాఖ… ఉద్యోగుల తీరు వల్ల మరింతగా ప్రజల్లో చులకన అవుతోంది. రెవెన్యూ శాఖలోని మెజారిటీ ఉద్యోగులు లంచాలు తీసుకోనిదే పని చేయరన్న అపవాదు ప్రజల్లో ఉంది. రెవెన్యూ ఉద్యోగుల పట్ల ప్రజల్లో సానుభూతి కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది.

కర్నూలు తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఇద్దరు వీఆర్‌వోలు కొట్టుకున్న తీరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆదివారం అయినా కార్యాలయానికి వచ్చి మరీ కొట్టుకున్నారు. కర్నూలు మండలంలోని సుంకేసుల వీఆర్‌వో వేణుగోపాల్ రెడ్డి, జోహరాపురం వీఆర్‌వో కృష్ణదేవరాయులు నెత్తురు వచ్చేలా కొట్టుకున్నారు. వేణుగోపాల్ తహసీల్దార్ కార్యాలయంలో డిజిటల్ కీ సాయంతో వెబ్ ల్యాండ్‌లో వివరాల నమోదు వ్యవహారాలు కూడా చూస్తుంటాడు.

తమ గ్రామ పరిధిలోని పనులు వేణుగోపాల్ రెడ్డి కావాలనే పెండింగ్‌లో ఉంచుతున్నాడంటూ కృష్ణదేవరాయలు గొడవ పెట్టుకున్నాడు. మాటమాట పెరిగి ఇద్దరూ కిందమీద పడి కొట్టుకున్నారు. ఈ సమయంలో వేణుగోపాల్ రెడ్డి చెవిని వీఆర్‌వో కృష్ణదేవరాయలు కొరికేశాడు. దాంతో అతడికి తీవ్ర రక్తస్రావం అయింది. అనంతరం ఇద్దరూ వెళ్లి పరస్పరం కేసు పెట్టుకునే ప్రయత్నం చేశారు.

విషయం తెలుసుకున్న తహసీల్దార్ తిరుపతి సాయి…. పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఇద్దరు వీఆర్‌వోలను రాజీ చేసి కేసులు లేకుండా తీసుకెళ్లారు. కేసులు పెట్టుకుని ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయని… అప్పుడు అందరూ ఇరుక్కుంటారన్న ఉద్దేశంతోనే చెవి తెగేలా కొరుక్కున్నా సరే వీఆర్‌వోలు తహసీల్దార్‌ సూచనతో రాజీ అయినట్టు చెబుతున్నారు.

First Published:  18 Nov 2019 3:17 AM IST
Next Story