Telugu Global
NEWS

భారత మహిళా క్రికెట్లో యువకెరటాలు...

కొత్తనీరు రాకడ…పాతనీరు పోకడ అన్నమాట జీవితానికి మాత్రమే కాదు…క్రికెట్ కు సైతం వర్తిస్తుంది. క్రికెట్ అనే మహాప్రవాహంలోకి కొత్తనీరు వస్తుంటే… పాతనీరు పోతూ ఉంటుందనటానికి భారత మహిళా క్రికెట్ సైతం ఏమాత్రం మినహాయింపు కాదు. మిథాలీరాజ్, జులన్ గోస్వామి లాంటి సూపర్ సీనియర్ క్రికెటర్లకు వారసులుగా పలువురు నవతరం క్రికెటర్లు భారత మహిళా క్రికెట్లోకి దూసుకొస్తున్నారు. మిథాలీ బాటలో…. భారత మహిళా క్రికెట్ అనగానే …మిథాలీరాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రమే అనుకొనే రోజులకు కాలం చెల్లింది. […]

భారత మహిళా క్రికెట్లో యువకెరటాలు...
X

కొత్తనీరు రాకడ…పాతనీరు పోకడ అన్నమాట జీవితానికి మాత్రమే కాదు…క్రికెట్ కు సైతం వర్తిస్తుంది. క్రికెట్ అనే మహాప్రవాహంలోకి కొత్తనీరు వస్తుంటే… పాతనీరు పోతూ ఉంటుందనటానికి భారత మహిళా క్రికెట్ సైతం ఏమాత్రం మినహాయింపు కాదు.

మిథాలీరాజ్, జులన్ గోస్వామి లాంటి సూపర్ సీనియర్ క్రికెటర్లకు వారసులుగా పలువురు నవతరం క్రికెటర్లు భారత మహిళా క్రికెట్లోకి దూసుకొస్తున్నారు.

మిథాలీ బాటలో….

భారత మహిళా క్రికెట్ అనగానే …మిథాలీరాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రమే అనుకొనే రోజులకు కాలం చెల్లింది. ముంబైలో పుట్టి..భారత మహిళా క్రికెట్లోకి దూసుకొచ్చిన మరాఠా మెరుపుతీగలు స్మృతి మందానా, జెమీమా రోడ్రిగేజ్, హర్యానా వండర్ గాళ్ షెఫాలీ వర్మ, రాజస్థాన్ ప్లేయర్ ప్రియా పూనియా అంచనాలకు మించి రాణించి వారేవ్వా అనిపించుకొంటున్నారు. ప్రపంచ మహిళా క్రికెట్లో సుదీర్ఘకాలం రాణించగలమంటూ చెప్పకనే చెబుతున్నారు….

పురుషుల క్రికెట్ కు దీటుగా…

క్రికెట్ అనధికారిక జాతీయక్రీడగా మారిన మనదేశంలో పురుషుల క్రికెట్ తో సమానంగా మహిళా క్రికెట్ ను సైతం బీసీసీఐ ప్రోత్సహించడం ప్రారంభించడంతో నవతరం క్రీడాకారులు ఆసక్తి చూపుతున్నారు.

ఐసీసీ ఆదేశాలతో మహిళా క్రికెట్ ను సైతం బీసీసీఐకి అనుబంధంగా చేర్చుకోడంతో…మహిళా క్రికెట్ కు ప్రోత్సాహం, ఆదరణతో పాటు ప్రచారం కూడా గణనీయంగా పెరిగింది.

గత మూడు దశాబ్దాలుగా పడుతూ లేస్తూ వచ్చిన భారత మహిళా క్రికెట్లో మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ లాంటి ఒకరిద్దరు ప్లేయర్లు మాత్రమే…స్టార్ ప్లేయర్లుగా గుర్తింపు తెచ్చుకొన్నారు. వన్డే క్రికెట్లో 34 ఏళ్ల మిథాలీ, టీ-20 క్రికెట్లో హర్మన్ ప్రీత్ కౌర్ ప్రధాన క్రికెటర్లుగా కొనసాగుతున్నారు.

అయితే…ఈ ఇద్దరినీ మించిన సత్తా తమలో ఉందని మరాఠా మెరుపుతీగలు 22 ఏళ్ల స్మృతి మందానా, 18 ఏళ్ల జెమీమా రోడ్రిగేస్ తమ ఆటతీరుతో చాటుకొంటూ వస్తున్నారు.

మెరుపు ఓపెనర్ స్మతి మందానా…

భారత మహిళా క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ నమ్మదగిన ఓపెనర్ ఎవరంటే…ముంబై ప్లేయర్ స్మృతి మందానా అని మాత్రమే చెప్పాలి. ఎడమచేతి వాటం ఓపెనర్ గా, నిలకడగా రాణించే ప్లేయర్ గా అనతికాలంలోనే గుర్తింపు తెచ్చుకొన్న స్మృతి ..ఐసీసీ అత్యుత్తమ మహిళా క్రికెటర్ అవార్డులను సైతం గెలుచుకొంది.

16 ఏళ్ల వయసులోనే భారత వన్డే జట్టులో చోటు సంపాదించిన స్మృతి మందానా…బంగ్లాదేశ్ ప్రత్యర్థిగా 2013 సిరీస్ లో వన్డే అరంగేట్రం చేసింది.ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి భారత బ్యాటింగ్ కు వెన్నెముకగా నిలిచింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్, టీ-20 ప్రపంచకప్ టోర్నీల్లో మందానా నిలకడగా రాణించడం ద్వారా స్టార్ ప్లేయర్ల జాబితాలో చేరిపోయింది.

వెస్టిండీస్ తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ వరకూ…తన కెరియర్ లో 45కు పైగా మ్యాచ్ లు ఆడిన మందానా 1650కి పైగా పరుగులు సాధించింది. ఇందులో నాలుగు శతకాలు, 14 అర్థశతకాలు సైతం ఉన్నాయి.

దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగా టీ-20 క్యాప్ అందుకొన్న మందానా ఇప్పటి వరకూ ఆడిన 50 మ్యాచ్ ల్లో 83 పరుగులు అత్యధిక స్కోరుతో మొత్తం 1046 పరుగులు సాధించింది. ఆరు హాఫ్ సెంచరీలు సైతం ఉన్నాయి.

ముంబై చిచ్చరపిడుగు జెమీమా….

భారత మహిళా క్రికెట్ కు ముంబై అందించిన అపురూపకానుక 18 ఏళ్ల జెమీమా రోడ్రిగేస్. ఆరేళ్ల వయసు నుంచే క్రికెట్ బ్యాట్ పట్టి.. సబ్ జూనియర్, జూనియర్ స్థాయిలో రికార్డుల మోత మోగిస్తూ వచ్చిన జెమీమాకు ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ గా పేరుంది.

17 ఏళ్ల చిరుప్రాయంలోనే భారత సీనియర్ జట్టులో చేరిన జెమీమా 2018 సిరీస్ లో ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా వన్డే క్యాప్ అందుకొంది. టీ-20 ల్లో మాత్రం సౌతాఫ్రికా ప్రత్యర్థిగా తొలిమ్యాచ్ ఆడిన జెమీమా..ఇప్పుడు భారతజట్టులో ఓ కీలక ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకొంది.

వెస్టిండీస్ తో జరిగిన ప్రస్తుత టీ-20 సిరీస్ లో సైతం జెమీమా మెరుపు బ్యాటింగ్ తో భారత్ కు సిరీస్ అందించింది.

ప్రియా పూనియా ధూమ్ ధామ్ బ్యాటింగ్…

స్మృతి మంథానాకు గాయం కావడంతో భారతజట్టులో చేరిన రాజస్థాన్ ప్లేయర్ ప్రియా పూనియా సైతం తనకు అంది వచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొంది. సౌతాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్ ద్వారా తానేమిటో నిరూపించుకొంది.

యువఓపెనర్ ప్రియా పూనియా… తన అరంగేట్రం వన్డేలోనే అదరగొట్టింది. 124 బాల్స్ లో 8 బౌండ్రీలతో 75 పరుగుల నాటౌట్ స్కోరు సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొంది.

టీనేజ్ థండర్ షెఫాలీ వర్మ…

హర్యానా టీనేజర్ షఫారీ వర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకొంది. అతిపిన్నవయసులో అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ఆడిన భారత తొలి మహిళగా రికార్డుల్లో చేరింది. అంతేకాదు…అతిచిన్న వయసులో అంతర్జాతీయ హాఫ్ సెంచరీ సాధించిన భారత క్రికెటర్ గా నిలిచింది.

సూరత్ లోని లాలాబాయి కాంట్రాక్టర్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ఇటీవలే ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ ద్వారా షఫాలీ అరంగేట్రం చేసింది. ఇప్పటి వరకూ గర్గీ బెనర్జీ మాత్రమే అత్యంత పిన్నవయసులో టీ-20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భారత మహిళగా ఉంది. ఆ రికార్డును షెఫాలీ అధిగమించగలిగింది.

సచిన్ ను మించిన షఫాలీ…

భారత క్రికెటర్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో గత మూడు దశాబ్దాలుగా ఉన్న రికార్డు ను సైతం షఫాలీ తెరమరుగు చేసింది. అత్యంత పిన్నవయసులో అంతర్జాతీయ హాఫ్ సెంచరీ సాధించిన క్రికెటర్ గా సచిన్ పేరుతో ఉన్న రికార్డును టీనేజ్ క్రికెటర్ షఫాలీ వర్మ అధిగమించింది.

వెస్టిండీస్ తో మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా గ్రాస్ ఐలెట్ వేదికగా ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ లో షఫాలీ స్ట్ర్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా.. సచిన్ పేరుతో ఉన్న రికార్డును తెరమరుగు చేసింది.

మూడుదశాబ్దాల క్రితం సచిన్ 16 సంవత్సరాల 214 రోజుల వయసులో తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ సాధించిన భారత క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు.

గత 30 సంవత్సరాలుగా సచిన్ పేరుతో చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డును షఫాలీ 15 సంవత్సరాల 285 రోజుల వయసులోనే సాధించడం ద్వారా అధిగమించింది.

షఫాలీ కేవలం 49 బాల్స్ లోనే 73 పరుగుల స్కోరు సాధించింది. తన కెరియర్ లో కేవలం 5వ టీ-20 మ్యాచ్ మాత్రమే ఆడిన షఫాలీ…మొదటి వికెట్ కు స్మృతి మంథానాతో కలసి 143 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. షెఫాలీ హాఫ్ సెంచరీలో 10 బౌండ్రీలు, 2 సిక్సర్లు ఉన్నాయి.

రామన్ కోచ్ గా కొత్తనీరు…

భారత మహిళాజట్టు ప్రధాన శిక్షకుడుగా రామన్ బాధ్యతలు చేపట్టడంతోనే…జట్టు కూర్పులో మార్పులు చేర్పులు చేశారు. స్మృతి మంధానా, జెమీమా రోడ్రిగేస్ , షఫాలీ, ప్రియా పూనియా లాంటి యువక్రికెటర్లకు తగిన అవకాశాలు కల్పిస్తూ రేపటితరం క్రికెటర్లకు బంగారుబాట వేశారు.మహిళా క్రికెట్లో సైతం పలువురు నవతరం క్రికెటర్లు దూసుకురావడం చూస్తుంటే భారత మహిళా క్రికెట్ కు సైతం ఢోకా లేదని చెప్పక తప్పదు.

First Published:  17 Nov 2019 4:50 AM IST
Next Story