400 కోట్లు ఎగ్గొట్టిన నవయుగ
రామోజీరావు వియ్యంకుడికి చెందిన నవయుగ సంస్థ బాగోతం మరొకటి బయటపడింది. కృష్ణపట్నం పోర్టు వద్ద వేల ఎకరాల భూమిని తీసుకున్న నవయుగ సంస్థ… నిబంధనల ప్రకారం స్థానిక పంచాయతీకి చెల్లించాల్సిన పన్నును ఎగ్గొట్టింది. ఆ మొత్తం ఇప్పుడు 400 కోట్లకు పైగా ఉంది. ముత్తుకూరు రెవెన్యూ పరిధిలో పోర్టు కోసం 2వేల 625 ఎకరాలను సేకరించారు. పోర్టు వల్ల తమ ప్రాంతం అభివృద్ది చెందితుంది అన్న ఉద్దేశంతో తక్కువ ధరకే గ్రామస్తులు భూములను అప్పగించారు. రైతుల నుంచి […]
రామోజీరావు వియ్యంకుడికి చెందిన నవయుగ సంస్థ బాగోతం మరొకటి బయటపడింది. కృష్ణపట్నం పోర్టు వద్ద వేల ఎకరాల భూమిని తీసుకున్న నవయుగ సంస్థ… నిబంధనల ప్రకారం స్థానిక పంచాయతీకి చెల్లించాల్సిన పన్నును ఎగ్గొట్టింది. ఆ మొత్తం ఇప్పుడు 400 కోట్లకు పైగా ఉంది.
ముత్తుకూరు రెవెన్యూ పరిధిలో పోర్టు కోసం 2వేల 625 ఎకరాలను సేకరించారు. పోర్టు వల్ల తమ ప్రాంతం అభివృద్ది చెందితుంది అన్న ఉద్దేశంతో తక్కువ ధరకే గ్రామస్తులు భూములను అప్పగించారు. రైతుల నుంచి తీసుకున్న భూములతో ఆ తర్వాత నవయుగ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది. పోర్టు ఏర్పాటు చేసి 11 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ పంచాయతీకి చెల్లించాల్సిన ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు.
ఏపీ పంచాయతీరాజ్ 1994 చట్టం సెక్షన్ 61 ఐ, ఏ ప్రకారం పంచాయతీ పరిధిలోని వాణిజ్య, నివాస భవనాలకు పన్నులు వసూలు చేసే హక్కు ఉంది. ముత్తుకూరు గ్రామ పరిధిలోని 2, 625 ఎకరాల భూమి విలువ రూ. 6వేల 342 కోట్లు.
నిబంధనల ప్రకారం భూములు, భవనాల మార్కెట్ విలువలో స్థానిక పంచాయతీకి రూపాయి చొప్పున పన్నులు చెల్లించాలి. కానీ అధికారులు మాత్రం నామమాత్రంగా రూ.0.50 చొప్పున నిర్ణయించి లెక్కలు కట్టారు. ఆ ప్రకారం చూసినా రూ.6,610.08 కోట్ల విలువ చేసే కృష్ణపట్నం పోర్టు, భూములకు అర్ధ రూపాయి చొప్పున పన్ను వేసినా పంచాయతీకి దాదాపు రూ.33.05 కోట్లు నెట్ ట్యాక్స్ చెల్లించాలి. దాన్ని చెల్లించలేదు.
ప్రభుత్వ వనరులు ఉపయోగించుకున్నందుకు 8 శాతం లైబ్రరీ సెస్‌కు రూ.2.64 కోట్లు, పది శాతం వాటర్ సెస్‌కు రూ.3.30 కోట్లు, పది శాతం లైటింగ్ సెస్‌కు రూ.3.30 కోట్లు, 20 శాతం డ్రైనేజీ సెస్‌కు రూ.6.61 కోట్లు చెల్లించాలి. ఈ లెక్కన ఏడాదికి రూ.48.91 కోట్లు ముత్తుకూరు పంచాయతీకి కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.
ఈ మొత్తం కోసం ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా నవయుగ సంస్థ స్పందించలేదు. చివరకు భూముల్లో కొలతలు తీసుకునేందుకు పంచాయతీ అధికారులను కూడా అనుమతించలేదు. నవయుగ సంస్థ 400 కోట్లు ఎగ్గొట్టిన అంశంపై విజిలెన్స్ కూడా ఆరా తీసింది.
కృష్ణపట్నం యాజమాన్యానికి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా పన్ను మాత్రం చెల్లించలేదని నెల్లూరు డీపీవో సుస్మిత వివరించారు. కృష్ణపట్నం పోర్టుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పన్ను మినహాయింపులు లేవని అధికారులు చెబుతున్నారని… కానీ గత ప్రభుత్వ పెద్దలతో ఉన్న సంబంధాలను అడ్డుపెట్టుకుని పోర్టు యాజమాన్యం 400 కోట్ల పన్ను ఎగ్గొట్టిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రభుత్వమైనా ఆ పన్నును వసూలు చేయాలని కోరుతున్నారు.