సుప్రభాతం ఏ భాషలో ఉంటుందో తెలియని మేధావికి ఏం చెప్పగలం...
రాజధాని విషయంలో చంద్రబాబు హయాంలో చేసుకున్న ఒప్పందం నుంచి సింగపూర్ కంపెనీ పరస్పర అంగీకారంతోనే వైదొలిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఆదాయం ఎలా వస్తుందో వివరించాల్సిందిగా తాము కోరగా సింగపూర్ కంపెనీ సమాధానం చెప్పలేకపోయిందన్నారు. రెండుసార్లు తాను సమావేశం నిర్వహించినా ఆదాయం ఎలా వస్తుందో మాత్రం సింగపూర్ కంపెనీ చెప్పలేకపోయిందన్నారు. కొద్దిరోజులు ఆగితే చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తాయన్నారు. ఏపీలో దోపిడి లేదని తెలిసిన తర్వాత చాలా కంపెనీలు […]
రాజధాని విషయంలో చంద్రబాబు హయాంలో చేసుకున్న ఒప్పందం నుంచి సింగపూర్ కంపెనీ పరస్పర అంగీకారంతోనే వైదొలిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఆదాయం ఎలా వస్తుందో వివరించాల్సిందిగా తాము కోరగా సింగపూర్ కంపెనీ సమాధానం చెప్పలేకపోయిందన్నారు. రెండుసార్లు తాను సమావేశం నిర్వహించినా ఆదాయం ఎలా వస్తుందో మాత్రం సింగపూర్ కంపెనీ చెప్పలేకపోయిందన్నారు.
కొద్దిరోజులు ఆగితే చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తాయన్నారు. ఏపీలో దోపిడి లేదని తెలిసిన తర్వాత చాలా కంపెనీలు వస్తాయన్నారు. ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడితే మట్టికొట్టుకుపోతారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం చాలా తప్పన్నారు. పేదలు ఇంగ్లీష్ చదువులు చదువుకుంటే తప్పా అని ప్రశ్నించారు.
”తమాషా చేస్తున్నావా ?…ఏంటి ఆ భాష?… మీ ఒక్కరికే నోరు ఉందనుకుంటున్నావా?.. మాకు లేదా నోరు… గౌరవం ఇస్తుంటే రోజురోజుకు మితిమీరిపోతున్నారు. ఇంగ్లీష్ మీడియం వల్ల ఏం నష్టం జరుగుతుందో చెప్పకుండా… తోలు తీస్తా, తాట తీస్తా అంటూ మాట్లాడడం ఏమిటి ?” అని పవన్‌ను బొత్స ప్రశ్నించారు.
మూడు సార్లు మంత్రిగా ఉన్నప్పటికీ ఇంగ్లీష్ భాషపై పట్టులేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నానో తనకు తెలుసని బొత్స వ్యాఖ్యానించారు. రాబోయే తరాల పిల్లలు కూడా ఇలాగే ఇబ్బందులు పడాలా అని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తున్నాయన్నారు.
చంద్రబాబు ఇసుక ఉచితంగా ఇచ్చామంటున్నారని… రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఉచితంగా ఇచ్చినట్టు నిరూపిస్తే తాను తలదించుకుంటానన్నారు. ఇసుక రీచ్‌ల వద్ద టీడీపీ నేతలు రాబందుల్లా కాపుకాసి దోచుకున్నారని బొత్స ఫైర్ అయ్యారు.
చంద్రబాబు అంత బ్రహ్మాండంగానే పాలన చేసి ఉంటే 23 సీట్లకు ఎందుకు పడిపోయాడని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ముగ్గురు భార్యలకు నలుగురు పిల్లలు ఉన్నారు… వారు ఏ మీడియంలో చదువుతున్నారు అని ముఖ్యమంత్రి ప్రశ్నించిన దాంట్లో తప్పేముందని బొత్స ప్రశ్నించారు. ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉంటే మీ ఇద్దరు భార్యల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని ఎవరైనా ప్రశ్నిస్తుంటారన్నారు.
ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ఇష్టం లేకపోతే ఆ విషయాన్ని పద్దతిగా చెప్పాలే గానీ.. ఇష్టానుసారం నోరు పారేసుకోవడం పవన్ కల్యాణ్‌కు మంచిది కాదన్నారు. మధ్యలో ఇంగ్లీష్ మీడియంలోకి మారిస్తే పిల్లలు సక్సెస్ అవడం కష్టమన్నారు. చిన్నప్పుడు ఏది నేర్పిస్తే దాన్నే పిల్లలు బాగా నేర్చుకుంటారని వివరించారు.
తిరుమల సుప్రభాతం తెలుగులో ఉంటుందని చెప్పే పవన్ కల్యాణ్ లాంటి మేధావులకు ఏం సమాధానం చెప్పగలం అని బొత్స వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లాలో ఏ ఒక్క వైసీపీ నేత అయినా సరే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని చంద్రబాబు నిరూపిస్తే దేనికైనా తాను సిద్ధమన్నారు. చంద్రబాబు అన్నీ పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారన్నారు.
విజయనగరం నుంచి ఒడిషాకు ఇసుక రవాణా చేస్తున్నారని చంద్రబాబు చెబుతున్నాడని… కానీ ఒడిషా నుంచే ఇక్కడికి ఇసుక వస్తుంటుందని… విజయనగరం నుంచి ఒడిషాకు ఇసుక తీసుకెళ్తే రూపాయికి కూడా కొనేవారు ఉండరన్నారు.
రెండు లక్షల 50వేల కోట్ల రూపాయల అప్పును నెత్తినేశాం కాబట్టి కొత్త ప్రభుత్వం అప్పుల ఊబిలో నుంచి బయటకు రాలేదని చంద్రబాబు అనుకున్నారని… కానీ ఇప్పుడు అంతా సవ్యంగా సాగుతుంటే ఎలా సాధ్యమైందని చంద్రబాబు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడని బొత్స వ్యాఖ్యానించారు. పక్కింట్లోవాడు నవ్వుతున్నాడా? ఏడుస్తున్నాడా? అని తొంగిచూసినట్టుగా చంద్రబాబు వ్యవహారం ఉందన్నారు.