Telugu Global
NEWS

స్వింగ్ బౌలింగ్ నయాకింగ్ దీపక్ చహార్

అసాధారణ ప్రతిభ దీపక్ సొంతం కష్టానికి తగ్గ ఫలం అందుకొన్న చహార్ బంగ్లాదేశ్ తో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ లో భారత నయాస్వింగ్ బౌలర్ దీపక్ చహార్ గురించే ఇప్పుడు క్రికెట్ వర్గాలు మాట్లాడుకొంటున్నాయి. కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లతో సహా హ్యాట్రిక్ సాధించడమే కాదు…సరికొత్త ప్రపంచ రికార్డు సైతం సాధించిన దీపక్ ఇప్పుడు కష్టానికి తగ్గ ఫలితం అనుభవిస్తున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు మ్యాన్ ఆఫ్ ది […]

స్వింగ్ బౌలింగ్ నయాకింగ్ దీపక్ చహార్
X
  • అసాధారణ ప్రతిభ దీపక్ సొంతం
  • కష్టానికి తగ్గ ఫలం అందుకొన్న చహార్

బంగ్లాదేశ్ తో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ లో భారత నయాస్వింగ్ బౌలర్ దీపక్ చహార్ గురించే ఇప్పుడు క్రికెట్ వర్గాలు మాట్లాడుకొంటున్నాయి. కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లతో సహా హ్యాట్రిక్ సాధించడమే కాదు…సరికొత్త ప్రపంచ రికార్డు సైతం సాధించిన దీపక్ ఇప్పుడు కష్టానికి తగ్గ ఫలితం అనుభవిస్తున్నాడు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సైతం దీపక్ అందుకొన్నాడు. మూడుమ్యాచ్ ల్లో 8 వికెట్లు పడగొట్టడం ద్వారా భారత నంబర్ వన్ బౌలర్ గా నిలిచాడు.

తండ్రి ప్రేరణతో….

తండ్రి లోకేంద్ర సింగ్ చహార్ ప్రేరణతో క్రికెట్ ఓనమాలు దిద్దుకొన్న దీపక్ చహార్ సహజసిద్ధమైన స్వింగ్ బౌలర్. తన తండ్రి ఆగ్రా కేంద్రంగా భారత వాయుసేనలో ఉద్యోగిగా ఉన్న సమయంలో దీపక్ సాధన ప్రారంభించాడు.

తండ్రి పర్యవేక్షణలో నెట్ ప్రాక్టీస్ లో నిరంతరం సాధన చేసే దీపక్ చహార్…లక్ష బంతులు వేయటం ద్వారా తన బౌలింగ్ కు పదును పెట్టుకొన్నాడంటే ఆశ్చర్యపోవడం మనవంతే అవుతుంది.

తండ్రి త్యాగంతోనే…..

దీపక్ చహార్ కోసం అతని తండ్రి లోకేంద్రసింగ్ చహార్…తన విమానదళం ఉద్యోగానికి రాజీనామా చేసి…స్వస్థలం ఆగ్రాకు వచ్చి…సొంతంగా రెండు పిచ్ లను ఏర్పాటు చేయటం ద్వారా నిరంతరం నెట్ ప్రాక్టీసు సాగేలా చేశాడు.

తాను క్రికెటర్ కావాలని కలలుకన్నానని…అయితే తన తండ్రి ఆరోజుల్లో అనుమతించలేదని…కానీ తాను సాధించలేనిది తన కుమారుడు సాధించడంతో… తన జీవితం సఫలమైందని దీపక్ తండ్రి లోకేంద్రసింగ్ చహార్ చెప్పాడు.

తన తమ్ముడి కుమారుడు రాహుల్ చహార్ ను సైతం లెగ్ స్పిన్నర్ గా తీర్చి దిద్దటమే కాదు…టీ-20లో భారతజట్టుకు ప్రాతినిథ్యం వహించేలా చేయగలిగాడు.

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు చెందిన దీపక్ చహార్ కుటుంబం రాజస్థాన్ లోని గంగానగర్ లో స్థిరనివాసం ఏర్పరచుకొంది. రాజస్థాన్ లో నివాసం ఏర్పరచుకొన్న కారణంగానే రంజీ జట్టుకు ప్రాతినిథ్యం వహించగలిగాడు.కేవలం 8వ తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పిన దీపక్ కు విండీస్ ఫాస్ట్ బౌలర్ మాల్కం మార్షల్, సౌతాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ అంటే ఎంతో ఇష్టం.

రంజీట్రోఫీలో స్వింగ్ మ్యాజిక్…

18 సంవత్సరాల వయసులోనే రాజస్థాన్ రంజీ జట్టులో సభ్యుడిగా దీపక్ చహార్ స్వింగ్ మ్యాజిక్ తో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్నాడు.

రంజీ మాజీ చాంపియన్ హైదరాబాద్ తో జైపూర్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో దీపక్ చహార్ విశ్వరూపమే ప్రదర్శించాడు.

సహజసిద్ధమైన ఇన్ స్వింగర్లకు అవుట్ స్వింగ్ ను జోడించి బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తించే దీపక్…10 పరుగులకే 8 వికెట్లు పడగొట్టడంతో.. హేమాహేమీలతో కూడిన హైదరాబాద్ కేవలం 21 పరుగులకే కుప్పకూలింది.

కేవలం దీపక్ చహార్ బౌలింగ్ ప్రతిభతోనే రాజస్థాన్ రంజీట్రోఫీ విజేతగా నిలువగలిగింది.

ఐపీఎల్ లో ధోనీ అస్త్రం…

రంజీ ట్రోఫీ తొలిసీజన్లోనే 40 వికెట్లు పడగొట్టడం ద్వారా దీపక్ చహార్ తన స్వింగ్ మ్యాజిక్ ఏపాటిదో చాటి చెప్పాడు. గాయాలతో కొద్దికాలం క్రికెట్ కు దూరమైన దీపక్ …పూణే సూపర్ జెయింట్స్ జట్టులో సభ్యుడిగా ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. మహేంద్ర సింగ్ ధోనీ దృష్టిలో పడటం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరాడు.

చెన్నై సూపర్ కింగ్స్ ధోనీ, ఆల్ రౌండర్ డ్వయన్ బ్రావోల చోరవతో దీపక్… కీలకమైన పవర్ ప్లే ఓవర్లలో అత్యంత ప్రమాదకరమైన బౌలర్ గా రూపుదిద్దుకొన్నాడు.

2018 సీజన్లో 10 వికెట్లు, 2019 సీజన్లో 22 వికెట్లు పడగొట్టడం ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ కు ఎంపికైన భారత జట్టులో స్టాండ్ బై గా చోటు సంపాదించాడు.

2015 లో వన్డే అరంగేట్రం…

2018 సెప్టెంబర్ 25న దుబాయ్ వేదికగా అప్ఘనిస్థాన్ పైన తొలివన్డే మ్యాచ్ ఆడిన దీపక్…అదే ఏడాది జులై 8న బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా టీ-20 క్యాప్ సాధించాడు.

ప్రస్తుత బంగ్లాదేశ్ సిరీస్ వరకూ 7 మ్యాచ్ లు ఆడిన దీపక్ చహార్ 14 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 7 పరుగులకే 6 వికెట్లు సాధించిన ప్రపంచ రికార్డు సైతం ఉంది.

టెస్ట్ క్రికెట్ ఆశలు…

ప్రస్తుతం 27 సంవత్సరాల వయసు మాత్రమే ఉన్న దీపక్ చహార్ కు మరో ఏడు సంవత్సరాలపాటు అత్యుత్తమస్థాయిలో క్రికెట్ ఆడే సత్తా ఉంది. టెస్ట్ క్రికెట్లో సైతం దీపక్ భారతజట్టులో చోటు సంపాదించగలిగితే…తన జీవిత లక్ష్యం పరిపూర్ణమైనట్లేనని దీపక్ చహార్ తండ్రి ఆశిస్తున్నారు.

స్వింగ్ బౌలింగ్ కు అనుకూలించే న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్ర్రేలియా దేశాలలో జరిగే టెస్టు సిరీస్ ల్లో పాల్గొనే భారత టెస్టు జట్టులో దీపక్ చహార్ కు చోటు దక్కడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

First Published:  12 Nov 2019 11:35 AM IST
Next Story