సిరియాపై టర్కీ దురాక్రమణ
సిరియా మీద దురాక్రమణ కొనసాగించడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టర్కీకి అనుమతి ప్రసాదించారు. టర్కీ సేనలు సిరియాలోని కుర్దిష్ స్థావారాలపై వైమానిక దాడులు చేశాయి. అయితే టర్కీ వినియోగించిన పదాతి దళాలు పూర్తి స్థాయి సైనిక దళాలు కావు. ఇవి ఒక రకమైన జిహాదీ మిలీషియా (పౌర సేనలు) దళాలు. అలెప్పో, ఇద్లిబ్ లో ఇలాంటి మిలీషియా దళాలను ఏర్పాటు చేశారు. దీనికోసం సౌదీ అరేబియా నిధులు అందించింది. అలాగే ఖతర్, టర్కీ, అమెరికా ఆర్థిక […]
సిరియా మీద దురాక్రమణ కొనసాగించడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టర్కీకి అనుమతి ప్రసాదించారు. టర్కీ సేనలు సిరియాలోని కుర్దిష్ స్థావారాలపై వైమానిక దాడులు చేశాయి. అయితే టర్కీ వినియోగించిన పదాతి దళాలు పూర్తి స్థాయి సైనిక దళాలు కావు. ఇవి ఒక రకమైన జిహాదీ మిలీషియా (పౌర సేనలు) దళాలు. అలెప్పో, ఇద్లిబ్ లో ఇలాంటి మిలీషియా దళాలను ఏర్పాటు చేశారు.
దీనికోసం సౌదీ అరేబియా నిధులు అందించింది. అలాగే ఖతర్, టర్కీ, అమెరికా ఆర్థిక సహాయమూ ఉంది. ఈ మిలీషియా దళాలకు కావలసిన సైనిక సహాయమూ అందింది. ఈ మిలీషియా దళాలకు రక్త దాహం ఎక్కువ. తాము దైవదూషణాపరులు అని భావించిన వారెవరి మీదైనా ఈ దళాలు విచ్చలవిడిగా దాడులు చేస్తాయి. ప్రస్తుతం టర్కీలో 30 లక్షల మంది సిరియా శరణార్థులు ఉన్నారు. వీరిని వెనక్కు పంపించడం టర్కీ అసలు లక్ష్యం. ఇది అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుద్ధ నేరం కిందే లెక్క.
టర్కీలో మెజారిటీగా ఉన్న ప్రాంతం సిరియా కుర్దులతో కూడింది. అందులోనూ అరబ్బులు, వారిలోనూ క్రైస్తవులు, ముస్లింలు, అసీరియన్లు యజీదీలు, ఇతరులు ఉన్నారు. ఆ ప్రాతంలోనే వ్యవసాయ వనరులూ ఉన్నాయి. దానికి దక్షిణాన సిరియాకు సంబంధించిన చమురు నిలవలూ ఉన్నాయి. ఇక్కడ నివసించే వివిధ జాతులవారిలో వైవిధ్యం ఉంది కనక సిరియా కుర్దులు రాజకీయంగా స్వయంప్రతిపత్తి కోరడానికి అవకాశం లేదు. వారు అలా కోరి ఉంటే పొరుగున ఉన్న వారు కాని, డెమాస్కస్ లోని సిరియా ప్రభుత్వంగానీ అంగీకరించేవి కావు.
సిరియా అధ్యక్షుడు బషర్-అల్-అసద్ ప్రభుత్వం పై 2011లో తిరుగుబాటు చెలరేగినప్పుడు సిరియా ప్రభుత్వం తమ రాజధాని అయిన డెమాస్కస్ ను కాపాడుకోవడం కోసం సిరియా పశ్చిమ ప్రాంతంలో ఉన్న సైనిక దళాలను ఉపసంహరించింది. సిరియా దళాలను ఉపసంహరించుకోవడంతో సిరియా కుర్ద్ రాజకీయ పార్టీలు ఇరాక్ సరిహద్దులోని యూఫ్రిటిస్ నది ప్రాంతంలోని భూభాగంపై పట్టు సంపాదించగలిగాయి. వారు రొజావా రాష్ట్రం ఏర్పాటు చేశారు. అది సిరియా కుర్దుల రాష్ట్రం. అందులో కొందరు అక్కడ సోషలిస్టు రాజ్యం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు.
కానీ ఇంతలోనే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐ.ఎస్.ఐ.ఎస్.) తీవ్రమైన దాడి చేయడంతో సోషలిస్టు రాజ్యం ఏర్పాటు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఐ.ఎస్.ఐ.ఎస్. కొబానేతో పాటు ఇతర చిన్న చిన్న పట్టణాలను స్వాధీనం చేసుకుంది. ఐ.ఎస్.ఐ.ఎస్. రొజావా మీద ఆధిపత్యం సంపాదించడంతో పాటు సిరియా కుర్దులకే కాకుండా యజీదీల వంటి మెజారిటీ వర్గాల పట్టు కూడా పోయింది. ఈ జాతులు అంతమొందే దశ వచ్చింది.
సిరియా కుర్దులు అన్ని కూటములనుంచి మద్దతు సంపాదించడానికి ప్రయత్నం చేశారు. వారు మాస్కోలో ఒక కార్యాలయం ఏర్పాటు చేశారు. అమెరికాతో సంప్రదింపులు ప్రారంభించారు. అమెరికా ఐ.ఎస్.ఐ.ఎస్. మీద దాడికి ఉపక్రమించినప్పుడు సిరియా కుర్దులు తమ మిలీషియా బృందాలను (ప్రజా రక్షణ విభాగాలు లేదా వై.పి.జి) దళాలను విస్తృతమైన సిరియా డెమోక్రాటిక్ ఫోర్సెస్ (ఎస్.డి.ఎఫ్.) మిలీషియా దళాలుగా మార్చడానికి ప్రయత్నించారు.
ఇందులో ఇప్పుడు అరబ్బులు, అసీరియన్లు, కుర్దులు కూడా ఉన్నారు. ఈ మిలీషియా దళాలన్నీ ఐ.ఎస్.ఐ.ఎస్. పై అమెరికా దాడికి మద్దతు ప్రకటించాయి. ఎస్.డి.ఎఫ్. మద్దతే లేకపోతే అమెరికా ఉత్తర సిరియాలోని ఐ.ఎస్.ఐ.ఎస్. స్థావరాలను నిర్మూలించగలిగేదే కాదు.
ఐ.ఎస్.ఐ.ఎస్. ఓటమి, ఎస్.డి.ఎఫ్. విజయం సిరియా కుర్ద్ నాయకుల్లో ఒక బూటకపు ఆశావాదానికి తావిచ్చింది. అమెరికా ఛత్ర ఛాయల్లో తమకు రక్షణ ఉంటుందనుకున్నారు. టర్కీ నుంచి, సిరియా నుంచి తమకు ఎదురయ్యే ఒత్తిడిని ఎదుర్కొని నిలబడగలమనుకున్నారు. టర్కీలోని మితవాద ప్రభుత్వం తమ సరిహద్దులో కుర్దుల స్వయంప్రతిపత్తికి అనుకూలంగా లేదు.
రొజావా ప్రయోగాన్ని విఫలం చేయడానికి 2014, 2015లో టర్కీ సిరియా మీద దాడి చేసింది. రొజావా ప్రయోగాన్ని విఫలం చేయడానికి టర్కీ కాచుకు కూర్చుంది. సిరియా కుర్దిష్ ల చేతిలో, అమెరికా అధీనంలో ఉన్నా భూభాగాన్ని అంతటినీ సిరియా స్వాధీనం చేసుకోవాలనుకుంది. రష్యా, ఇరాన్ ప్రభుత్వాలు సిరియా ప్రభుత్వానికి మద్దతు పలికాయి. దీనివల్ల అసద్ ప్రభుత్వానికి భౌగోళిక సార్వభౌమాధికారం ఉండాలన్న అభిప్రాయం కలిగింది. రోజావా దానికి అడ్డంకిగా తయారైంది.
డెమాస్కస్ లోని సిరియా ప్రభుత్వం, రష్యా, ఇరాన్ ఆమోదం లేకుండా టర్కీ దళాలు ముందుకు సాగడానికి అవకాశమే లేదు. రొజావా ఎక్కువ కాలం నిలబడేది కాదని సిరియా కుర్ద్ రాజకీయ నాయకులకు తెలుసు. అది మూణ్నాళ్ల ముచ్చటే అనీ వారికి తెలుసు. ఆ ప్రాంతంలో ఉన్న ఏ ప్రభుత్వమూ రొజావాకు అనుకూలం కాదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
అమెరికా తన బలగాలను మెరుపు వేగంతో ఉపసంహరించుకుంది. తన స్థావరాలను వదులుకుంది. వాటిని సిరియా, రష్యా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. టర్కీ ముందుకు సాగకుండా ఆగిపోవడానికి అంగీకరించింది. అయితే ఆ ప్రాంతంలో సిరియన్ల ఆధిపత్యం కొనసాగాలని భావించింది.
అయితే సిరియా కుర్దులు ఆ ప్రాంతం టర్కీ వారి చేతిలో ఉండడం కన్నా సిరియా చేతిలో ఉండడం మేలు అనుకున్నారు. ఎందుకంటే వారి ఆశలు ఎటూ కూలిపోయాయి. అమెరికా దళాలు ఉపసంహరించుకుంటున్నప్పుడు కుర్దులు వారి మీద రాళ్లు, కుళ్లిన పళ్లు విసిరారు. దీనికి అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ దీటుగానే స్పందించారు.
“కుర్దులకు మద్దతుగా తమకు నాటోలో చిరకాలంగా భాగస్వామిగా ఉన్న టర్కీకి వ్యతిరేకంగా పోరాడే ఉద్దేశం లేదు. అంతే గాకుండా కుర్దులు స్వయంప్రతిపత్తిగల ప్రాంతం ఏర్పాటు చేసుకోవడం మా ఉద్దేశం కాదు” అని స్పష్టం చేశారు. ఇవన్నీ కుర్దుల ఆశల మీద నీళ్లు చల్లాయి.
(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)