Telugu Global
National

నాడు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ఎక్కడున్నారు?

వరదలు తగ్గగానే ఇసుక కొరత తీరుతుందని ప్రభుత్వం చెబుతున్నా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రులు కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. శ్రీశైలంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 8సార్లు గేట్లు ఎత్తేలా వరద వచ్చిందని కన్నబాబు గుర్తు చేశారు. రాష్ట్రంలో అన్ని నదులు పొంగి పొర్లుతున్నాయన్నారు. చివరకు వరస కరువులు ఎదుర్కొన్న అనంతపురం జిల్లాలో కూడా భారీ వర్షాలు పడి రాష్ట్రం పచ్చగా ఉందన్నారు. భారీ వర్షాల కారణంగా నదుల్లో […]

నాడు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ఎక్కడున్నారు?
X

వరదలు తగ్గగానే ఇసుక కొరత తీరుతుందని ప్రభుత్వం చెబుతున్నా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రులు కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.

శ్రీశైలంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 8సార్లు గేట్లు ఎత్తేలా వరద వచ్చిందని కన్నబాబు గుర్తు చేశారు. రాష్ట్రంలో అన్ని నదులు పొంగి పొర్లుతున్నాయన్నారు. చివరకు వరస కరువులు ఎదుర్కొన్న అనంతపురం జిల్లాలో కూడా భారీ వర్షాలు పడి రాష్ట్రం పచ్చగా ఉందన్నారు. భారీ వర్షాల కారణంగా నదుల్లో ప్రవాహం ఉండడంతో ఇసుక కొరత ఏర్పడిందన్నారు. వరద తగ్గగానే ఇసుక కొరత తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయన్నారు.

ఇసుక కొరత ఏర్పడడం చూసి కొందరు వ్యక్తులు చాలా ఆనందంతో ఉన్నారని… సంతోషంతో తట్టుకోలేకపోతున్నారన్నారు కన్నబాబు. అలా ఆనందపడుతున్న వారిలో చంద్రబాబు, నారా లోకేష్, వారి సహచరుడు పవన్‌ కల్యాణ్ ముందున్నారన్నారు. రాజకీయం చేయడానికి ఇసుక పాయింట్ దొరికిందని ముగ్గురూ చాలా ఆనందంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందన్న భ్రమ కలిగించేందుకు ముగ్గురూ తెగ ప్రయత్నిస్తున్నారన్నారు.

మొన్న గుంటూరులో సొంత కొడుకుతో నాలుగు గంటల దీక్ష చేయించిన చంద్రబాబు… ఇప్పుడు దత్తపుత్రుడితో విశాఖలో లాంగ్ మార్చ్ చేయించబోతున్నారని కన్నబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ ఐదేళ్లుగా లాంగ్ మార్చ్ చేస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. మొన్నటి ఎన్నికల్లో కలిసిపోటీ చేసిన సీపీఎం, సీపీఐ కూడా పవన్ కల్యాణ్ మార్చ్‌కు మద్దతు ఇవ్వలేదని గుర్తు చేశారు.

ఇప్పటికే బీజేపీ కూడా జనసేన మార్చ్‌కు మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించిందన్నారు. ఇప్పుడు లాంగ్ మార్చ్‌కు చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్రమే మిగిలారన్నారు. పవన్‌కల్యాణ్ కార్యక్రమానికి టీడీపీ నేతలు విశాఖలో జనసమీకరణ చేస్తున్నారని మంత్రి కన్నబాబు చెప్పారు.

నెలల తరబడి నదుల్లో వరద ఉంటే… ఇసుక తీయడం సాధ్యం కాదన్న కనీస అవగాహన లేకుండా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రవాహం ఉండగా ఇసుక తీసేందుకు ప్రయత్నిస్తుంటే ప్రమాదాలు జరుగుతున్నాయని… దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కొద్ది రోజుల్లో వరద తగ్గుతుంది…. అప్పుడు ఇసుకకు ఇబ్బంది ఉండదు అని చెబుతున్నప్పటికీ లాంగ్ మార్చ్‌ నిర్వహించడం ద్వారా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏం సాధించబోతున్నారని కన్నబాబు ప్రశ్నించారు.

చంద్రబాబు హయాంలో గోదావరి, కృష్ణా నదుల్లో ఇసుకను సింగరేణి గనులను తవ్వినట్టు తవ్వి దోపిడి చేసింది నిజం కాదా… ఆ రోజు పవన్ కల్యాణ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఇసుక మాఫియాను అడ్డుకోబోయిన వనజాక్షిని ఇసుకలో పడేసి కొట్టినప్పుడు పవన్‌ కల్యాణ్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.

భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన 900 కోట్ల రూపాయలను చంద్రబాబు దారి మళ్లించారని కాకినాడ కలెక్టరేట్ ముందు భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేసినప్పుడు పవన్‌ కల్యాణ్‌ ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. ఆ రోజు భవన నిర్మాణ కార్మికులు పవన్‌ కల్యాణ్ కు కనిపించలేదా అని కన్నబాబు నిలదీశారు.

చంద్రబాబు హయాంలో చిత్తూరు జిల్లాలో ఏర్పేడులో ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలు ధర్నా చేస్తుంటే లారీతో తొక్కించి 15మందిని చంపేస్తే ఆ రోజు పవన్‌ కల్యాణ్ ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. చిత్తూరు జిల్లాలో దళితులకు చెందిన 15 వందల ఎకరాల భూమిని ఇసుక మాఫియా కబ్జా చేసి ఇసుక తోలుకుంటే అప్పుడు మాత్రం పవన్ కల్యాణ్ ప్రశ్నించలేదన్నారు.

2014 నుంచి 2019 వరకు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని టార్గెట్‌ చేసుకుని విమర్శలు చేసిన జనసేన… ఇప్పుడు తిరిగి వైసీపీ ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తోందంటే దీన్ని బట్టే చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి చేస్తున్న లాంగ్ జర్నీ స్పష్టంగా అర్థమైపోతోందన్నారు.

విశాఖలో పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్‌కు జనాలను సమీకరించే బాధ్యతను టీడీపీ నేతలు ఎందుకు తీసుకున్నారో చెప్పాలని మంత్రి కన్నబాబు డిమాండ్ చేశారు.

పవన్ కల్యాణ్ చేస్తున్నది లాంగ్ మార్చ్ కాదని… రాంగ్‌ మార్చ్ అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రకాశం బ్యారేజ్ మీద వెళ్తున్న సమయంలోనైనా పవన్ కల్యాణ్‌కు నదుల్లో వస్తున్న వరద కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ జగన్ మోహన్ రెడ్డి ముందుకెళ్తుంటే… ఇక భవిష్యత్తు ఉండదన్న భయంతో చంద్రబాబు, ఆయన దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ ఇసుకపై ఆందోళనకు దిగుతున్నారన్నారు.

ఏ ప్రభుత్వమైనా ఇసుక దాచి పెట్టుకుని ఏం సాధిస్తుందని ప్రశ్నించారు. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ఇసుక మాఫియా దోచిపడేసినా ఏ రోజూ ప్రశ్నించని పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏదో జరిగిపోతోందని గగ్గోలు పెడుతున్నారన్నారు. విశాఖలో పవన్ కల్యాణ్ మార్చ్ చేస్తుంటే చంద్రబాబు మనుషులను తోలడం బట్టే వారి మధ్య సంబంధం ఏంటో తెలుస్తోందన్నారు.

ఇసుక ఉన్నా ఇవ్వలేదంటున్న పవన్ కల్యాణ్… వచ్చి గోదావరి, కృష్ణ, వంశధార నదుల ఒడ్డున ఆ మార్చ్ చేస్తే ప్రజలకు అసలు విషయం అర్థమవుతుందన్నారు అనిల్. చంద్రబాబు హయాంలో ఇసుక మాఫియా పేట్రేగిపోయినా కళ్లుమూసుకున్న పవన్ కల్యాణ్… ఇప్పుడు అసలు మాఫియాకే అవకాశం లేకుండా ప్రభుత్వం పాలసీని తెస్తే ఇసుక మాఫియా అంటూ తప్పుడు విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. మళ్లీ నేనే రావాలంటున్నారని చంద్రబాబు చెబుతుంటే రైతులు హడలిపోతున్నారన్నారు.

సొంతకొడుకును కొంగుచాటున దాచిపెట్టుకుంటూ చంద్రబాబు రాజకీయం చేస్తుంటే… దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ మాత్రం లాంగ్ మార్చ్ అంటూ బయలుదేరాడని అనిల్ విమర్శించారు. జగన్ పాలన చూసిన తర్వాత తమ పార్టీలు ఏమైపోతాయో అన్న భయం చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కు ఉండడం సహజమని… కానీ ఆ భయంతో ఇంతగా దిగజారిపోయి రాజకీయం చేయడం మాత్రం సరైనది కాదన్నారు.

First Published:  2 Nov 2019 9:30 AM IST
Next Story