Telugu Global
NEWS

పేర్లు చెప్పకుండా ఫిక్షన్‌ రాస్తున్నారు... వారే ఇప్పుడు భయపడాలి...

ఆంధ్రప్రదేశ్‌లో అసమ్మతిని సృష్టించడం, అసమ్మతిని పోగేయడం వంటి పనుల్లో కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు, సీనియర్‌ జర్నలిస్ట్‌ రామచంద్రమూర్తి వ్యాఖ్యానించారు. ఇలా చేయడం న్యాయమేనా అని ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. కానీ ప్రభుత్వం గురించి అవాస్తవాలను కొన్ని మీడియా సంస్థలు ప్రజలకు చేరవేస్తుంటే దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజలకు వాస్తవాలు చేరితే వారే సరైన నిర్ణయం తీసుకుంటారని.. అందుకే వాస్తవాలను ప్రజలకు చేరవేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం […]

పేర్లు చెప్పకుండా ఫిక్షన్‌ రాస్తున్నారు... వారే ఇప్పుడు భయపడాలి...
X

ఆంధ్రప్రదేశ్‌లో అసమ్మతిని సృష్టించడం, అసమ్మతిని పోగేయడం వంటి పనుల్లో కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు, సీనియర్‌ జర్నలిస్ట్‌ రామచంద్రమూర్తి వ్యాఖ్యానించారు. ఇలా చేయడం న్యాయమేనా అని ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. కానీ ప్రభుత్వం గురించి అవాస్తవాలను కొన్ని మీడియా సంస్థలు ప్రజలకు చేరవేస్తుంటే దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ప్రజలకు వాస్తవాలు చేరితే వారే సరైన నిర్ణయం తీసుకుంటారని.. అందుకే వాస్తవాలను ప్రజలకు చేరవేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉందన్నారు. నిజాలు రాసే మీడియా సంస్థలు ప్రభుత్వం తెచ్చిన జీవోను చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు.

కట్టుకథలు రాసే వారు, పనిగట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టించే వారు, అబద్దాలు ప్రచారం చేసే జర్నలిస్టులు, వాటిని ప్రచురించే మీడియా సంస్థలకు మాత్రమే ఇప్పుడు భయం ఉందన్నారు. వాస్తవాలు రాసే వారు భయపడాల్సిన అవసరం లేదన్నారు. తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్థలపై చర్యలు తీసుకునేందుకు వీలుగా విడుదల చేసిన జీవో రాజ్యాంగబద్ధమైనదే అని రామచంద్రమూర్తి స్పష్టం చేశారు.

మీడియాపై ఆంక్షలు విధిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఐదు జీవోలు ఇచ్చిందన్నారు. సాక్షి మీడియాలో పనిచేసిన తనపై నేరుగా కేసులు పెట్టారన్నారు. కానీ తాము జీవోలను వ్యతిరేకించలేదని… తమపై పెట్టిన కేసులపై కోర్టులో పోరాటం చేశామన్నారు. తప్పుడు వార్తలు రాయనప్పుడు భయపడాల్సిన పని లేదన్నారు.

ఎవరి మీదనైనా వార్త రాసేటప్పుడు సదరు వ్యక్తి నుంచి వివరణ తీసుకుని ఆ తర్వాతే వార్త రాయలన్నది జర్నలిజంలో ప్రాథమిక సూత్రమని… కానీ దాన్ని కూడా ఇప్పుడు పాటించడం లేదన్నారు. ఫ్యాక్ట్‌ బదులు ఫిక్షన్‌ రాస్తున్నారన్నారు. కొన్ని పత్రికలు సోర్స్‌ పేర్లు చెప్పకుండా… వారు చెప్పారు, వీరు చెప్పారు… అక్కడ అనుకుంటున్నారు… ఇక్కడ అనుకుంటున్నారు… అంటూ పత్రిక యాజమాన్యం అనుకుంటున్న దాన్ని ప్రచురిస్తున్నాయని రామచంద్రమూర్తి విమర్శించారు.

తప్పుడు వార్తల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు ప్రపంచంలోని ఏ ప్రభుత్వానికైనా ఉంటుందన్నారు. తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ న్యూయార్క్ టైమ్స్‌ను, వాషింగ్టన్‌ పోస్టును తన కార్యక్రమాలకు రావొద్దు అంటూ అమెరికా అధ్యక్షుడు బ్యాన్ చేశారన్నారు. కానీ తాము అలా బ్యాన్‌ చేయడం లేదని… తప్పుడు వార్తల విషయంలో మాత్రం చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు.

First Published:  1 Nov 2019 11:23 AM IST
Next Story