Telugu Global
NEWS

సెలెక్టర్లా...అనుష్కశర్మకు సేవకులా?

భారత సెలెక్టర్లపై ఫరూక్ ఇంజనీర్ విసుర్లు క్రికెట్ పాలమండలినీ విడిచిపెట్టని మాజీ గ్రేట్ భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్, 80 సంవత్సరాల క్రికెట్ కురువృద్ధుడు ఫరూక్ ఇంజనీర్ కు కోపం వచ్చింది. ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీని, వినోద్ రాయ్ నేతృత్వంలోని భారత క్రికెట్ పాలకమండలి సభ్యులను దుమ్ముదులిపి మరీ విడిచి పెట్టారు. భారత సెలెక్టర్లు కెప్టెన్ విరాట్ కొహ్లీ భార్యకు టీ కప్పులు అందిస్తూ బతికేస్తున్నారని… సెలెక్టర్లు అందరూ కలసినా 12 […]

సెలెక్టర్లా...అనుష్కశర్మకు సేవకులా?
X
  • భారత సెలెక్టర్లపై ఫరూక్ ఇంజనీర్ విసుర్లు
  • క్రికెట్ పాలమండలినీ విడిచిపెట్టని మాజీ గ్రేట్

భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్, 80 సంవత్సరాల క్రికెట్ కురువృద్ధుడు ఫరూక్ ఇంజనీర్ కు కోపం వచ్చింది. ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీని, వినోద్ రాయ్ నేతృత్వంలోని భారత క్రికెట్ పాలకమండలి సభ్యులను దుమ్ముదులిపి మరీ విడిచి పెట్టారు.

భారత సెలెక్టర్లు కెప్టెన్ విరాట్ కొహ్లీ భార్యకు టీ కప్పులు అందిస్తూ బతికేస్తున్నారని… సెలెక్టర్లు అందరూ కలసినా 12 టెస్టులు అనుభవం లేదని..ఇలాంటి వారిని ఎందుకు సెలెక్టర్లుగా నియమించారో తనకు అర్థం కావడంలేదని మండి పడ్డారు.

అనుష్కశర్మకు సేవకులా

ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ లో భారత సెలెక్టర్లు..అనుష్కశర్మకు టీ కప్పు అందిస్తూ తనకు కనిపించారని, ఓ వ్యక్తి బీసీసీఐ బ్లేజర్ తో కనిపించాడని.. అతనే సెలెక్షన్ కమిటీ సభ్యుడని ఆ తర్వాత తనకు తెలిసిందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

1970 దశకంలో భారతజట్టు కీలక ఆటగాళ్లలో ఒకరిగా ఉన్న ఫరూక్ ఇంజనీర్ కు 46 టెస్టులు, 5 వన్డే మ్యాచ్ లు ఆడిన అనుభవం, రికార్డు ఉన్నాయి. దిలీప్ వెంగ్ సర్కార్ లాంటి అపార అనుభవం ఉన్న మాజీ క్రికెటర్లను సెలెక్టర్లుగా నియమిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందని.. రెండుటెస్టులు, మూడుటెస్టులు ఆడిన క్రికెటర్లు ఎలా ఎంపిక సంఘం సభ్యులు కాగలరని నిలదీశారు. వారి అర్హత ఏంటంటూ ప్రశ్నించారు.

భారత క్రికెట్ జట్టు ఎంపిక సమయంలో కెప్టెన్ విరాట్ కొహ్లీ ఏది చెబితే అదే జరుగుతోందని…విరాట్ కొహ్లీ పవర్ అలాంటిదని.. మరి సెలెక్టర్లు, సెలెక్షన్ కమిటీకి ఇక పని ఏముందంటూ చురకలు అంటించారు.

క్రికెట్ పాలకమండలి పైనా విమర్శలు…

భారత క్రికెట్ బోర్డును బాగు చేయటానికి సుప్రీంకోర్టు, జస్టిస్ లోథా మంచి సూచనలు చేసినా…అవి ఆచరణలో మాత్రం ఎందుకూ కొరగాకుండూ పోయాయని.. క్రికెట్ తో ఏమాత్రం సంబంధంలేని, క్రికెట్ వ్యవహారాల పైన కనీస అవగాహన లేని వ్యక్తులతో నలుగురు సభ్యుల పాలకమండలని ఏర్పాటు చేయటాన్ని మించిన తెలివి తక్కువ పని మరొకటి లేదని ఇంజనీర్ మండిపడ్డారు.

పాలకమండలిలోని ఒక్కో సభ్యుడు 3 కోట్ల 50 లక్షల రూపాయల చొప్పున బోర్డు డబ్బు గుంజుకుపోయారని… సమావేశాలకు హాజరైన ప్రతిసారీ వేలకు వేల రూపాయలు భత్యాలుగా దండుకొన్నారంటూ విసుర్లు విసిరారు.

భారత మహిళా మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీకి నామమాత్రంగా క్రికెట్ ఆడిన అనుభవం మాత్రమే ఉందని గుర్తు చేశారు. సౌరవ్ గంగూలీ లాంటి చురుకైన వ్యక్తి, నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడు బీసీసీఐ అధ్యక్షుడు కావడం హర్షించదగిన పరిణామమని ఫరూక్ ఇంజనీర్ ప్రశంసించారు.

మొత్తం మీద… తాను క్రికెట్ ఆడే రోజుల్లో బ్యాటుతో మెరుపులు మెరిపించిన ఫరూక్ ఇంజనీర్…ఎనిమిది పదుల వయసులో వాడిగా, వేడిగా, సూటిగా వ్యాఖ్యలు చేయడంతో పాటు తన మనసులోని మాటల్ని సూటిగా బయటపెట్టడం ద్వారా కలకలమే లేపారు.

First Published:  1 Nov 2019 2:35 AM IST
Next Story