Telugu Global
NEWS

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాడీవేడి వాదనలు

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాడీవేడీగా వాదనలు జరిగాయి. ఆర్టీసీ తరపున యాజమాన్యం అఫిడవిట్ దాఖలు చేసింది. తాము చర్చలకు సిద్ధపడ్డా యూనియన్లు మాత్రం విలీనంపైనే పట్టుబడుతున్నాయని యాజమాన్యం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. యూనియన్ తరపున న్యాయవాదులు మాత్రం 21 డిమాండ్లపైనే చర్చలు జరుపుతామని యాజమాన్యం స్పష్టం చేసిందని… హైకోర్టు ఆదేశాలను కూడా తప్పుగా అర్థం చేసుకున్నారని వాదించారు. యూనియన్లు 45 డిమాండ్లతో సమ్మె నోటీసులు ఇచ్చిందని… ప్రభుత్వం మాత్రం మొత్తం డిమాండ్లే 21 అన్నట్టు ప్రచారం […]

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాడీవేడి వాదనలు
X

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాడీవేడీగా వాదనలు జరిగాయి. ఆర్టీసీ తరపున యాజమాన్యం అఫిడవిట్ దాఖలు చేసింది. తాము చర్చలకు సిద్ధపడ్డా యూనియన్లు మాత్రం విలీనంపైనే పట్టుబడుతున్నాయని యాజమాన్యం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

యూనియన్ తరపున న్యాయవాదులు మాత్రం 21 డిమాండ్లపైనే చర్చలు జరుపుతామని యాజమాన్యం స్పష్టం చేసిందని… హైకోర్టు ఆదేశాలను కూడా తప్పుగా అర్థం చేసుకున్నారని వాదించారు. యూనియన్లు 45 డిమాండ్లతో సమ్మె నోటీసులు ఇచ్చిందని… ప్రభుత్వం మాత్రం మొత్తం డిమాండ్లే 21 అన్నట్టు ప్రచారం చేస్తోందని కోర్టు దృష్టికి తెచ్చారు.

ఇందుకు స్పందించిన కోర్టు…. ఆర్థిక భారం లేని డిమాండ్లపై చర్చలు జరపాల్సిందిగా తాము ప్రభుత్వానికి సూచించామన్నారు. ప్రభుత్వంలో విలీనంపైనే ఎందుకు పట్టుబడుతున్నారని కార్మిక సంఘాలను కోర్టు ప్రశ్నించింది. ఓవర్‌ నైట్‌లో విలీనం ఎలా సాధ్యమవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. విలీనం డిమాండ్‌ను పక్కనపెట్టి మిగతా వాటిపై చర్చ జరపాలని, లేకపోతే సమ్మె విషయంలో ప్రతిష్టంభన కొనసాగి.. ఇటు కార్మికులు, అటు ప్రజలు ఇబ్బంది పడతారని న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీని ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. కార్మికుల సమ్మె చట్ట విరుద్దమైతే మరి ప్రభుత్వం వారిపై ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించింది. ప్రభుత్వం ముందే ఒక నిర్ణయానికి వచ్చి చర్చలు జరిపినట్టుగా ఉందని కోర్టు అభిప్రాయపడింది. అసలు చర్చలు జరిపే ఉద్దేశం ఉందా లేదా అని కోర్టు ప్రశ్నించింది.

రాష్ట్రంలో రైలు ప్రయాణం చేసే వారి కంటే బస్సుల మీద ఆధారపడే వారే ఎక్కువగా ఉన్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఆదిలాబాద్‌ అటవీ ప్రాంతంలో చిన్నారులకు ఆరోగ్య సమస్య ఉంటే వారు వరంగల్, హైదరాబాద్‌లకు బస్సుల మీదే ఆధారపడి రావాల్సి ఉంటుందని … ఒకవేళ ఆ చిన్నారుల ప్రాణాలు పోతే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అని కోర్టు ప్రశ్నించింది.

వాదనల సందర్భంగా అదనపు అడ్వకేట్ జనరల్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ముందు అడ్వకేట్ జనరల్ మాత్రమే వాదనలు వినిపించాలని… వెంటనే ఏజీ హాజరుకావాలని ఆదేశించింది. దాంతో ఏజీ కోర్టుకు వెళ్లి వాదనలు వినిపించారు.

First Published:  28 Oct 2019 3:33 PM IST
Next Story