వైసీపీలో ఇసుక తుపాను... ప్రత్యక్ష ఆందోళనకు పిలుపునిచ్చిన కోటంరెడ్డి
ఇసుక దుమారం ప్రభుత్వాన్ని చుట్టుముడుతోంది. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇసుక మాఫియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక మాఫియా కొనసాగుతోందని ఫైర్ అయ్యారు. నెల్లూరు నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలిస్తున్నారని ఆరోపించారు. ఇసుక మాఫియాకు అడ్డుకట్టవేయాలని… ఇసుక ఆదాయం అక్రమార్కులకు కాకుండా ప్రభుత్వానికి దక్కాలన్న ఉద్దేశంతోనే కొత్త పాలసీని తెచ్చారన్నారు. ఇసుకాసురులకు చెక్ పెట్టేలా జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. కానీ ఆచరణలో మాత్రం జగన్ ఆశయాలను అందుకోలేకపోతున్నామని విమర్శించారు. కొందరు అధికారులు, […]
ఇసుక దుమారం ప్రభుత్వాన్ని చుట్టుముడుతోంది. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇసుక మాఫియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక మాఫియా కొనసాగుతోందని ఫైర్ అయ్యారు.
నెల్లూరు నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలిస్తున్నారని ఆరోపించారు. ఇసుక మాఫియాకు అడ్డుకట్టవేయాలని… ఇసుక ఆదాయం అక్రమార్కులకు కాకుండా ప్రభుత్వానికి దక్కాలన్న ఉద్దేశంతోనే కొత్త పాలసీని తెచ్చారన్నారు. ఇసుకాసురులకు చెక్ పెట్టేలా జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. కానీ ఆచరణలో మాత్రం జగన్ ఆశయాలను అందుకోలేకపోతున్నామని విమర్శించారు. కొందరు అధికారులు, అక్రమార్కుల వల్లే ఇది జరుగుతోందన్నారు. ఒక్క నిమిషానికే ఆన్‌లైన్‌లో నో స్టాక్ బోర్డు ఎలా వస్తోందని కోటంరెడ్డి ప్రశ్నించారు.
పక్క రాష్ట్రాలకు ఇసుక ఎగుమతిని ముఖ్యమంత్రి నిషేధిస్తే కొందరు స్వార్థపరులు మాత్రం దాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని ఆరోపించారు. అందుకే ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా స్పందించాల్సి వస్తోందన్నారు. నెల్లూరు జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పూర్తిగా అధికారులకు స్వేచ్చ ఇచ్చి ఇసుక మాఫియాను చెక్ పెట్టాల్సిందిగా అధికారులను కోరామన్నారు. కానీ ఆన్‌లైన్లో నిమిషానికే నో స్టాక్ బోర్డు వస్తోందని… అదే సమయంలో భారీగా ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలిస్తున్నారని ఆరోపించారు. ఇలా ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో కలెక్టర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని రీచ్ నుంచి స్థానికులకు ఇసుక అందకుండా పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. మంత్రి ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారని కోటంరెడ్డి మండిపడ్డారు. దీని వల్ల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు.
నెల్లూరు రూరల్ నుంచి ఇసుక తరలింపును ఆపకపోతే కార్మికులు, స్థానిక ప్రజలతో కలిసి ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా ప్రత్యక్షపోరాటానికి కూడా సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రత్యక్ష పోరాటానికి దిగితే అది అధికార యంత్రాంగానికే అవమానమన్నారు. కాబట్టి పరిస్థితి అంత దూరం తెచ్చుకోకుండా ఇసుక మాఫియాకు చెక్ పెట్టాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ట్రాక్టర్ ఇసుక ధరను 2వేల 600 రూపాయలుగా నిర్ణయిస్తే .. నెల్లూరులో మాత్రం ట్రాక్టర్ ఇసుక కొనాలంటే 4వేల 500 పెట్టాల్సి వస్తోందన్నారు. దీనికి ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇసుక ఎందుకు తరలిపోతోందో సమాధానం చెప్పాల్సిందేనన్నారు.