Telugu Global
NEWS

ఆర్టీసీపై కేసీఆర్ సంచలన నిర్ణయం... ప్రెస్‌మీట్ పూర్తి వివరాలు

హుజూర్‌నగర్‌ ప్రజలు ఇచ్చిన ఫలితం ప్రభుత్వానికి ఒక టానిక్‌లా పనిచేస్తుందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ప్రతిపక్షాలు లేనిపోని ప్రచారం చేసినా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. ప్రభుత్వంపై లేనిపోని విమర్శలను ప్రతిపక్షాలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలు చాలా వ్యూహాత్మకంగానే టీఆర్‌ఎస్‌ కు భారీ మెజారిటీతో విజయం కట్టబెట్టారన్నారు. భారీ వర్షం కారణంగా తాను ప్రచారానికి వెళ్లలేకపోయానని… కానీ ఎల్లుండి హుజూర్‌నగర్‌కు వెళ్లి అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పి వస్తానన్నారు. అదే సమయంలో హుజూర్‌నగర్‌ ప్రజలకు ఇచ్చిన హామీలపై […]

ఆర్టీసీపై కేసీఆర్ సంచలన నిర్ణయం... ప్రెస్‌మీట్ పూర్తి వివరాలు
X

హుజూర్‌నగర్‌ ప్రజలు ఇచ్చిన ఫలితం ప్రభుత్వానికి ఒక టానిక్‌లా పనిచేస్తుందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ప్రతిపక్షాలు లేనిపోని ప్రచారం చేసినా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. ప్రభుత్వంపై లేనిపోని విమర్శలను ప్రతిపక్షాలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలు చాలా వ్యూహాత్మకంగానే టీఆర్‌ఎస్‌ కు భారీ మెజారిటీతో విజయం కట్టబెట్టారన్నారు.

భారీ వర్షం కారణంగా తాను ప్రచారానికి వెళ్లలేకపోయానని… కానీ ఎల్లుండి హుజూర్‌నగర్‌కు వెళ్లి అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పి వస్తానన్నారు. అదే సమయంలో హుజూర్‌నగర్‌ ప్రజలకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేసి వస్తానన్నారు. అధికార పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకోవడం సరికాదని అసెంబ్లీలోనే ప్రతిపక్షాలకు చెప్పానన్నారు.

గెలుపు ఎవరికీ శాశ్వతం కాదని… అయినప్పటికీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం విషయంలో నెగిటివ్‌గా ప్రచారం చేయడం సరికాదని ప్రతిపక్షాలకు చెప్పానన్నారు. కానీ వారు ఆ మాటలను పట్టించుకోలేదన్నారు. అందుకే హుజూర్‌నగర్ ప్రజలు ఇలాంటి తీర్పు చెప్పారన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు పద్దతి మార్చుకుని నిర్మాణాత్మకంగా వ్యవహరించాలన్నారు.

బీజేపీ వాళ్లకు వచ్చిన ఓట్లు చూసి నవ్వాలో ఏడవాలో వారికే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను తిడితే చాలు పెద్దవాళ్లం అయిపోతాం అనుకుంటే పొరపాటు అని…. మంచిచెడు ఆధారంగానే విమర్శలు చేస్తే ప్రజలు హర్షిస్తారన్నారు. ప్రతిపక్షాలు చాలా చీప్‌గా, పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని వాటిని మానుకుంటే మంచిదన్నారు.

మీడియా సమావేశాలు పెట్టాలంటే రోజూ తాము పెట్టలేమా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ ఫలితం చూసి టీఆర్‌ఎస్‌ నేతలు అహంభావం పెంచుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్‌ సూచించారు. చాలా సంస్కారంతోనే టీఆర్‌ఎస్‌ పనిచేస్తుందన్నారు. హుజూర్‌నగర్ ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వంద శాతం నిలబెట్టుకుంటామన్నారు. తప్పుడు విధానాలు, అహంకారం అన్నది రాజకీయాల్లో ఎక్కువ కాలం పనిచేయదన్నారు. గతంలో టీఆర్‌ఎస్‌ హుజూర్‌నగర్‌లో ఏడు వేల ఓట్లతో ఓడిపోయిందని… ఇప్పుడు 43 వేల మెజారిటీతో గెలవడం అంటే 50వేల మెజారిటీ సాధించినట్టు భావించాల్సి ఉంటుందన్నారు.

నవంబర్‌లోపు మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు. రెండుమూడు రోజుల్లోనే ఏ క్షణంలోనైనా ఎన్నికలు నోటిఫై చేస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎంచుకున్నది ఒక పిచ్చి పంథా అని కేసీఆర్ అభివర్ణించారు. అనవసరమైన, అర్థంపర్థం లేని, దురంహకార పూరితమైన వైఖరిని వారు ఎంచుకున్నారని కేసీఆర్ విమర్శించారు. లక్షా 84వేల బడ్జెట్‌ను ఓటాన్‌ అకౌంట్‌లో ప్రవేశపెట్టామని.. కానీ ఆర్థిక మాంద్యం వచ్చిన నేపథ్యంలో బేషజాలకు పోకుండా దాన్ని లక్షా 36వేల కోట్లకు తగ్గించుకున్నామని వివరించారు. నిధుల కోసం భూములను అమ్ముకునేందుకు సిద్ధపడే పరిస్థితి వచ్చిందన్నారు.

దేశంలో లక్షలాది ఉద్యోగాలు ఊడిపోతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని గొప్పలు చెప్పినా భారీగా ఉద్యోగాలు పోతున్నది నిజమన్నారు. దేశాన్ని ఎప్పుడూ లేనంత ఆర్థిక మాంద్యం వెంటాడుతోందన్నారు. ఆటోమొబైల్‌ రంగం పూర్తిగా కుప్పకూలిందన్నారు. తెలంగాణలోనూ వృద్ధి రేటు బాగా పడిపోయిందన్నారు. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉండగా ఆర్టీసీ సంఘాలు సమ్మెకు వెళ్లడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

ఆర్టీసీపై తనకు పూర్తిగా అవగాహన ఉందని గతంలో రవాణా శాఖ మంత్రిగా కూడా పని చేశానన్నారు. ఆ సమయంలో ఆర్టీసీ నష్టాల్లో ఉండేదన్నారు. తాను ప్రతి బస్టాండ్‌ తిరిగి, బస్సుల సర్వీసులను మెరుగుపరిచి ఏడాదిన్నరలోపే నష్టాన్ని పూడ్చి ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చానన్నారు.

తాను ముఖ్యమంత్రి అవ్వగానే వైస్రాయ్‌ హోటల్ లో ఆర్టీసి యూనియన్ లతో ఒకరోజంతా చర్చలు జరిపి, సలహాలు ఇచ్చి, 44 శాతం జీతం పెంచి సంస్థను అభివృద్ధి చేయాలని కోరానన్నారు. మరోసారి ఐఆర్‌ పెంచాలని కోరితే ఇబ్బందులు ఉన్నా సరే 14 శాతం జీతాలు పెంచామన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా నాలుగేళ్లలోనే 67 శాతం కార్మికుల జీతాలు పెంచినది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనన్నారు. ఇంత చేసిన తర్వాత కూడా గొంతెమ్మ కోర్కెలు కోరితే తీర్చడం సాధ్యమా అని ప్రశ్నించారు.

ఎవరుపడితే వారు వచ్చి ప్రభుత్వంలో విలీనం చేయమంటే చేయడం సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వంలో 57 కార్పొరేషన్లు ఉన్నాయని… ఆర్టీసీని కలిపితే మిగిలిన కార్పొరేషన్లు కూడా వచ్చి డిమాండ్ చేస్తే ఏం చేయాలని ప్రశ్నించారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలనడమే అర్థం లేని పనికిమాలిన డిమాండ్ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఆర్టీసీని చాలా రాష్ట్రాలు తీసి పడేశాయన్నారు. మూడు నాలుగేళ్లకు ఒకసారి ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు వచ్చినప్పుడల్లా సమ్మె చేసి గొంతెమ్మ కోర్కెలు అడిగితే తీర్చడం ఎలా సాధ్యమవుంతుందని ప్రశ్నించారు. యూనియన్ల కారణంగానే ఆర్టీసీలు మూతపడుతున్నాయన్నారు.

తిన్నది అరగక ఆర్టీసీ యూనియర్లు సమ్మె చేస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఉన్నా, టీడీపీ ఉన్నా, టీఆర్‌ఎస్ ఉన్నా సరే సమ్మెలు ఎందుకు తప్పడం లేదని నిలదీశారు. కేవలం యూనియన్ ఎన్నికల్లో గెలిచేందుకు ఇలా సమ్మెలకు దిగడం అలవాటుగా మారిందన్నారు. ఇదంతా చిల్లర యూనియన్ల రాజకీయాలేనన్నారు.

ఆర్టీసీ సమ్మె ముగింపు ఎప్పుడని ప్రశ్నిస్తున్నారని… కానీ ఇక ఆర్టీసీయే ముగుస్తుందన్నారు. జరగబోయేది ఇదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీకి నేటికి 5వేల కోట్ల రూపాయలు అప్పు ఉందన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్‌ లాభాల్లో ఉండగా… ఆర్టీసీ మాత్రమే నష్టాల్లో ఎందుకు ఉందని కేసీఆర్ ప్రశ్నించారు. ఆర్టీసిలో 2వేల 100 అద్దె బస్సులు ఉన్నాయన్నారు. ఆర్టీసీ నడుపుతున్న బస్సులు 8వేల వరకు ఉన్నాయన్నారు. అద్దె బస్సులతో ప్రతి కి.మీ.కు 75 పైసలు ఆర్టీసీకి లాభం వస్తోందన్నారు. రోజుకు ఒక్కో అద్దె బస్సు మీద 225 రూపాయలు లాభం వస్తోందన్నారు. 4లక్షల 72వేల రూపాయలు అద్దె బస్సుల మీద ఆర్టీసీకి ప్రతి రోజు లాభం వస్తోందన్నారు.

అదే 8వేల ఆర్టీసీ బస్సుల మీద ప్రతి కి.మీకు 13 రూపాయలు నష్టం వస్తోందన్నారు. ఇందుకు కారణం ఏంటో యూనియన్లు చెప్పాలన్నారు. ఆర్టీసీ బస్సుల మీద రోజుకు రూ. 3కోట్లు నష్టం వస్తోందన్నారు. పరిస్థితి ఇలా ఉంటే అద్దె బస్సులను తొలగించండి అని ఎలా డిమాండ్ చేస్తారని ప్రశ్నించారు.

సిటీ బస్సులు నడిపే సమయంలో ట్రాఫిక్ కారణంగా అరగంట ఎక్కువ సేపు పని చేసేందుకు కూడా తాము అంగీకరించబోమని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. 50వేలు తీసుకుంటూ ఒక గంట ఎక్కువ పనిచేసేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధపడకపోతే ఇక సంస్థ ఎలా బతుకుతుందని ప్రశ్నించారు.

ఆర్టీసీని ఎవడూ కాపాడలేరన్నారు. ఆర్టీసీని పూర్తిగా ముంచేశారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌ అధికారంలోకి రాకముందు ఐదేళ్ల పాటు ప్రభుత్వం ఆర్టీసీకి ఇచ్చిన సొమ్ము 700 కోట్లు మాత్రమేనన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4వేల 200 కోట్ల రూపాయలను ఆర్టీసీకి విడుదల చేసిందన్నారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులకు నష్టం వస్తుంది కాబట్టి సిటీ బస్సుల నష్టాలను జీహెచ్‌ఎంసీ భరించేలా వెసులుబాటు ఇచ్చామన్నారు. ఇంతకంటే ఇంకేం చేయాలని ప్రశ్నించారు.

పండుగ సమయంలో ఆర్టీసీ ఆదాయం భారీగా ఉంటుందన్నారు. అలాంటి అద్బుతమైన సమయంలో సమ్మెకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. ఇదేనా సంస్థపై వారికి ఉన్న బాధ్యత అని నిలదీశారు. ఆర్టీసీ బతికిబట్టకట్టే పరిస్థితి లేకుండా యూనియన్లు చేశాయన్నారు. పరిస్థితి బాగోలేదు సమ్మెకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేసినా వినలేదని.. అంతిమంగా దాని ఫలితం ఇప్పుడు కార్మికులే అనుభవిస్తున్నారన్నారు.

సెప్టెంబర్‌లో చేసిన పనికి జీతం ఇవ్వాల్సిందేనంటూ కోర్టుకు వెళ్లారని… దాంతో డబ్బులు లేవని ఆర్టీసీ కోర్టుకు చెప్పిందన్నారు. డబ్బులు లేనప్పుడు హైకోర్టు ఏమైనా కొడుతుందా అని కేసీఆర్ ప్రశ్నించారు. సంచిలో డబ్బులు లేనప్పుడు హైకోర్టు ఇవ్వమని ఎలా చెబుతుందన్నారు. ఆర్టీసీ యూనియన్లు చేసింది మహా పాపమని.. అమాయక కార్మికుల గొంతులు కోసేశారన్నారు. ఆర్టీసీని ప్రపంచంలో ఎవ్వడూ కాపాడే పరిస్థితి లేదన్నారు.

గతంలో బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రమే ఉన్నప్పుడు ఎమ్మెల్యేకు ఫోన్ రావాలన్నా మూడు నెలలు పట్టేందన్నారు. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు రావడంతో మూడు జేబుల్లో మూడు ఫోన్లు వచ్చేశాయన్నారు. ఎయిర్‌ఇండియా మాత్రమే ఉన్నప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉండేదని … ప్రైవేట్ విమానయాన సంస్థలు వచ్చాక ప్రయాణికులకు మరింత వెసులు బాటు వచ్చిందన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు కట్టబెట్టిందని… పోటీ తత్వాన్ని పెంచాలని కేంద్రం సూచించిందన్నారు. కాబట్టి ఆ దిశగానే తాము వెళ్తున్నామన్నారు.

ఆర్టీసీ జీతాలపై తీర్పు చెప్పే అధికారం హైకోర్టుకు లేదన్నారు. చివరకు అది లేబర్ కమిషన్ వద్దకు వెళ్తుందని అప్పుడు ఆర్టీసీ ఆస్తులు అమ్మి జీతాలు ఇస్తామన్నారు. మెడ మీద తలకాయి ఉన్నవాడు ఎవడూ కూడా ఇలాంటి సమ్మె చేయరన్నారు. ఐదారు రోజుల్లో ఆర్టీసీ సమ్మె సంగతి తేలుస్తామన్నారు. ఐదారు రోజుల్లో కేవలం ఒక సంతకంతో నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. ఒక సంతకం చేసి ఏడు వేల బస్సులకు పర్మిట్ ఇస్తే కావాల్సినన్ని బస్సులు తిరుగుతాయన్నారు.

ఎస్మా ఉండగా సమ్మె చేయడం చట్ట విరుద్దమన్నారు. 2వేల 600 బస్సులు సర్వీసు అయిపోయి మార్పిడికి సిద్దంగా ఉన్నాయన్నారు. వాటి స్థానంలో కొత్తవి కొనేందుకు డబ్బులు లేవని… బ్యాంకులు కూడా ఇవ్వడం లేదన్నారు. మొత్తం మీద సమ్మె వల్ల ఆర్టీసీ గతంలో లాగే ఉండే అవకాశమే లేదన్నారు. ఆర్టీసీకి 60వేల కోట్ల ఆస్తులున్నాయని ఎవడో పిచ్చోడు చెబితే మీడియా దాన్ని ప్రచారం చేస్తోందన్నారు. 60వేల కోట్ల ఆస్తులు ఎక్కడున్నాయో చూపెడుతారా అంటూ మీడియాను ప్రశ్నించారు.

ఆర్టీసీ విలీనం అసంభవమన్నారు. ఆర్టీసీ విలీనంతో ఏపీలో ఒక ప్రయోగం చేశారని.. కానీ అక్కడ కూడా ముందుకు జరగదన్నారు. దాని ఫలితం ఏంటో మూడు నెలలకో, ఆరు నెలలకో బయటపడుతుందని… అప్పుడు చూడండి అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఏపీలో కమిటీ వేశారు కాబట్టి ఆ కమిటీనే ఏం జరుగుతుందో చెబుతుందన్నారు.

బెంగాల్‌లో కమ్యూనిస్టుల పాలనలో యూనియన్ల పోరు తట్టుకోలేక పెద్దపెద్ద కంపెనీలే పారిపోయాయన్నారు. కలకత్తాలో నేడు ఒక్క టెక్స్‌టైల్ పరిశ్రమ కూడా లేకుండాపోయిందంటే కారణం యూనియన్ల రాజకీయాలేనన్నారు. కలకత్తాలో ఇంటికి రంగులేసినా యూనియన్లు డబ్బులు వసూలు చేశాయన్నారు. మమతా బెనర్జీ సీఎం అయిన తర్వాత ఇళ్లకు రంగులేసుకుంటే ఒక ఏడాది పన్ను కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించాల్సి వచ్చిందన్నారు. అప్పటి వరకు ఇళ్లకు, సంస్థలకు రంగులు వేసుకోవాలన్నా యూనియన్ల దెబ్బకు భయపడేవారన్నారు.

పర్మిట్ ఇస్తే బస్సులు తిప్పుతామంటూ వేలాది దరఖాస్తులు వస్తున్నాయన్నారు. ఒక్క సంతకం చేస్తే నాలుగైదు రోజుల్లోనే కావాల్సినన్ని బస్సులు తిరుగుతాయన్నారు. గొంతులైనా కోసుకుంటాం… సమ్మె విరమించం, చర్చలకు రాబోం అని అంటుంటే తామేమి చేయాలని కేసీఆర్ ప్రశ్నించారు. యూనియన్ నాయకులు ఎంత బాధ్యతతో వ్యవహరించాలో తెలియదా అని నిలదీశారు. కార్మికులు అమాయకులే అయితే వెంటనే వెళ్లి ఎక్కడికక్కడ లెటర్‌ ఇచ్చి డ్యూటీలో చేరుతామని విజ్ఞప్తి చేసుకోవాలన్నారు. దానికి ఎవరైనా పూచి ఇస్తారా అని కేసీఆర్‌ ప్రశ్నించారు. యూనియన్లు ఉన్మాద స్థితికి చేరి ఇప్పుడు సంస్థనే లేకుండా చేశారన్నారు.

First Published:  24 Oct 2019 10:09 AM GMT
Next Story