బీఎస్‌ఎన్‌ఎల్‌లో 50ఏళ్లు పైబడిన వారికి వీఆర్‌ఎస్
ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్(భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నష్టాల్లో ఉన్న రెండు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ (మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్)ను విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. విలీనం చేయడంతో పాటు వాటిని ఆర్థికంగా తిరిగి నిలబెట్టేందుకు 69వేల కోట్లతో భారీ పునరుద్దరణ ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు సంస్థల […]
ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్(భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నష్టాల్లో ఉన్న రెండు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ (మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్)ను విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది.
విలీనం చేయడంతో పాటు వాటిని ఆర్థికంగా తిరిగి నిలబెట్టేందుకు 69వేల కోట్లతో భారీ పునరుద్దరణ ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ నిర్ణయం తీసుకుంది.
ఈ రెండు సంస్థల మీద ప్రస్తుతం 40వేల కోట్ల రుణ భారం ఉంది. ఈ రుణంలో సగం కేవలం ముంబై, ఢిల్లీ సర్కిళ్లలో టెలికాం సేవలు అందిస్తున్న ఎంటీఎన్‌ఎల్‌వే. ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే వీటి అప్పులు తక్కువే. ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి. కాబట్టి ఆస్తులను హామీగా పెట్టి రుణాలు సాధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం రెండు కంపెనీల ఆదాయంలో అత్యధికం సిబ్బంది జీతాలకే సరిపోతోంది. ప్రైవేట్ కంపెనీలు తమ ఆదాయంలో చాలా తక్కువ మొత్తాన్ని మాత్రమే జీతాల కోసం ఖర్చు చేస్తుంటే బీఎస్‌ఎన్‌ఎల్ 77 శాతం ఆదాయాన్ని సిబ్బంది జీతాలకే ఖర్చు చేస్తోంది.
ఈ నేపథ్యంలో వీఆర్‌ఎస్ అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 50 ఏళ్లు పైబడిన వారికి వీఆర్‌ఎస్ వర్తిస్తుంది. వీఆర్‌ఎస్ పథకం అమలు కోసం 29వేల,937 కోట్లను కేటాయించనున్నారు.
ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ లలో లక్షా 90వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీఆర్‌ఎస్ ద్వారా వీరిలో కనీసం సగం మందిని వదిలించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
వీఆర్‌ఎస్ పూర్తిగా స్వచ్ఛందగానే ఉంటుందని… ఎవరిపైనా ఒత్తిడి తీసుకురాబోమని కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ప్రైవేట్ కంపెనీలతో పోటీగా నిలబడేందుకు గాను… 2016 ధరలకే 4జీ స్పెక్ట్రంను బీఎస్ఎన్‌ఎల్‌కు కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది.
కంపెనీల రుణాల చెల్లింపు, నెట్‌వర్క్ ఆధునీకరణ, విస్తరణ కోసం రానున్న నాలుగేళ్లలో ఈ రెండు సంస్థల ఆస్తులు, భూములు ద్వారా 37వేల 500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.