Telugu Global
NEWS

నేటినుంచే సౌరవ్ గంగూలీ బీసీసీఐ ఇన్నింగ్స్

బీసీసీఐ అధ్యక్షుడుగా సౌరవ్ గంగూలీ తొమ్మిది దశాబ్దాల భారత క్రికెట్ బోర్డు చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. దారితప్పిన భారత క్రికెట్ బోర్డును గాడిలో పెట్టడానికి భారత సర్వోన్నత న్యాయస్థానం నియమించిన జస్టిస్ లోథా కమిటీ సంస్కరణల పుణ్యమా అంటూ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడుగా ఈరోజు బాధ్యతలు చేపట్టనున్నాడు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నమాట భారత క్రికెట్ బోర్డు పెద్దలకు అతికినట్లు సరిపోతుంది. ప్రపంచంలోనే అత్యంతభాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డులో వ్యాపార, రాజకీయవేత్తల […]

నేటినుంచే సౌరవ్ గంగూలీ బీసీసీఐ ఇన్నింగ్స్
X
  • బీసీసీఐ అధ్యక్షుడుగా సౌరవ్ గంగూలీ

తొమ్మిది దశాబ్దాల భారత క్రికెట్ బోర్డు చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. దారితప్పిన భారత క్రికెట్ బోర్డును గాడిలో పెట్టడానికి భారత సర్వోన్నత న్యాయస్థానం నియమించిన జస్టిస్ లోథా కమిటీ సంస్కరణల పుణ్యమా అంటూ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడుగా ఈరోజు బాధ్యతలు చేపట్టనున్నాడు.

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నమాట భారత క్రికెట్ బోర్డు పెద్దలకు అతికినట్లు సరిపోతుంది. ప్రపంచంలోనే అత్యంతభాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డులో వ్యాపార, రాజకీయవేత్తల ఏకస్వామ్యాన్ని, ప్రాబల్యాన్ని నిర్మూలించి..క్రికెట్ ను క్రికెట్ కు సంబంధించిన వ్యక్తులు మాత్రమే నడుపుకొనే వ్యవస్థను తీసుకురావాలని..భారత అత్యున్నత న్యాయస్థానం సంస్కరణలు తీసుకువచ్చింది.

ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణాలతో దారితప్పిన భారత క్రికెట్ ను గాడిలో పెట్టడానికి సుప్రీంకోర్టే స్వయంగా జోక్యం చేసుకొని.. జస్టిస్ లోథా కమిటీని ఏర్పాటు చేసింది.

జస్టిస్ లోథా సంస్కరణలు…

భారత క్రికెట్ బోర్డు వ్యవహారాలలో పారదర్శకత, జవాబుదారీతనం, హుందాతనం తీసుకువచ్చేలా జస్టిస్ లోథా విప్లవాత్మక సంస్కరణలను తీసుకువచ్చారు.

బోర్డు కార్యవర్గంలో బిజినెస్ మాగ్నెట్లు, రాజకీయ ప్రముఖులు పాతుకుపోయి…తమ కుటుంబ సొత్తులా భావించడాన్ని నివారించడానికి జస్టిస్ లోథా పలు రకాల చర్యలు తీసుకొన్నారు.

బీసీసీఐ దాని అనుబంధ సంఘాలను ఏళ్లతరబడి జలగల్లా పట్టిపీడిస్తున్న రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్ల నుంచి విముక్తం చేయడం, 70 ఏళ్ల పైబడినవారికి క్రికెట్ బోర్డు, దాని అనుబంధ సంఘాలలో స్థానం లేకుండా చేయటం, క్రికెట్ సంఘాలను మాజీ క్రికెటర్లే నడుపుకొనేలా మార్గం సుగమం చేయటం, మూడు విడతలకు మించి కార్యవర్గాలకు ఎంపిక కానివ్వకుండా నిరోధించడం, ఒక రాష్ట్ర్రానికి ఒక ఓటు మాత్రమే ఉండేలా నిబంధనలు రూపొందించడం ద్వారా.. మత్తగజంలాంటి బీసీసీఐ మెడలు వంచడంలో సుప్రీంకోర్టు కమ్ జస్టిస్ లోథా కమిటీ సఫలమయ్యింది. ఎదురుతిరిగిన బీసీసీఐ కార్యవర్గాన్ని ఒక్క వేటుతో రద్దు చేయడం ద్వారా…బీసీసీఐ అనుబంధం సంఘాలలో ప్రకంపనలు రేపింది.

పాలకమండలి చేతిలో అధికారం…

జస్టిస్ లోథా సూచించిన సంస్కరణలు కఠినంగా అమలు చేయటం కోసం వినోద్ రాయ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల పాలకమండలిని ఏర్పాటు చేసింది.

గత కొద్ది సంవత్సరాలుగా.. బీసీసీఐ, దాని అనుబంధ సంఘాలను పాలకమండలి మాత్రమే నియంత్రిస్తూ వచ్చింది. కఠినమైన ఆంక్షలు విధిస్తూ చాలావరకూ దారికి తెచ్చింది. దారితప్పిన భారత క్రికెట్ బోర్డును గాడిలో పెట్టడానికి…సుప్రీంకోర్టు ఆదేశాలతో జస్టిస్ లోథాకమిటీ సూచనలు, ప్రతిపాదనలు సత్ఫలితాలనివ్వడం ప్రారంభమయ్యింది.

అందులో భాగంగానే సరికొత్త నిబంధనలతో వివిధ రాష్ట్ర్రాల క్రికెట్ సంఘాలు…పాలకమండలి ప్రతినిథుల నేతృత్వంలో ఎన్నికలు నిర్వహించుకోడమే కాదు.. సరికొత్త కార్యవర్గాలను ఏర్పాటు చేసుకొన్నాయి.

అయితే…జస్టిస్ లోథా సంస్కరణలను నూటికి నూరుశాతం అమలు చేయని తమిళనాడు,హర్యానా, మహారాష్ట్ర్ర, ఉత్తరప్రదేశ్, మణిపూర్ క్రికెట్ సంఘాలను మాత్రం 23న జరిగే బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఈ ఐదు రాష్ట్ర్రాల క్రికెట్ సంఘాలకు ఓటు హక్కు వినియోగించుకోకుండా ఆంక్షలు విధించింది.

క్రికెటర్లకే బీసీసీఐ పగ్గాలు…

బీసీసీఐ, దాని అనుబంధ క్రికెట్ సంఘాలలో మాజీ క్రికెటర్ల పాత్రే ఎక్కువగా ఉండేలా జస్టిస్ లోథా కమిటీ చర్యలు తీసుకొంది. మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. క్రికెట్ ను క్రికెటర్లు , క్రికెట్ కు సంబంధించిన వ్యక్తులు మాత్రమే బాగు చేసుకోవాలని, సమర్థవంతంగా అభివృద్ది చేసుకోవాలని ఆదేశించింది.

బీసీసీఐ సరికొత్త రాజ్యాంగం ప్రకారం…బోర్డు కార్యవర్గంలో క్రికెటర్ల సంఘం ప్రతినిధుల్లో పురుషులు, మహిళల నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పించింది.

జస్టిస్ లోథా కమిటీ సిఫారసుల పుణ్యమా అంటూ కర్ణాటక క్రికెట్ సంఘానికి మాజీ క్రికెటర్ బ్రిజేష్ పటేల్, బెంగాల్ క్రికెట్ సంఘానికి సౌరవ్ గంగూలీ, హైదరాబాద్ క్రికెట్ సంఘానికి మహ్మద్ అజరుద్దీన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

కార్యవర్గ ఎన్నికలకు ముందే…

సుప్రీంకోర్టు నియమించిన పాలకమండలి ఆదేశాల మేరకు …సరికొత్త రాజ్యాంగం, నిబంధనలతో బీసీసీఐ అనుబంధం సంఘాలకు నిర్వహించిన ఎన్నికల కార్యక్రమం పూర్తయ్యింది. 2017 నుంచి వినోద్ రాయ్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల పాలకమండలి పర్యవేక్షణలోనే బీసీసీఐ పని చేస్తూ వస్త్దోంది.

బీసీసీఐకి సైతం అక్టోబర్ 23న ఎన్నిక నిర్వహించాలని పాలకమండలి చైర్మన్ వినోద్ రాయ్ నిర్ణయించారు. బీసీసీఐకి అనుబంధంగా ఉన్న మొత్తం క్రికెట్ సంఘాలలో పూర్తిస్థాయి హోదా కలిగిన 24 క్రికెట్ సంఘాలు కొత్త రాజ్యాంగాలను ఏర్పాటు చేసుకొన్నాయి.

ఇండియన్ రైల్వేస్, సర్వీసెస్, ఇండియన్ యూనివర్శిటీస్ క్రికెట్ సంఘాలు మాత్రం తమతమ ప్రతినిధులను బీసీసీఐకి పంపుతాయి.

ఏకగ్రీవంగా సౌరవ్ గంగూలీ ఎన్నిక…

బీసీసీఐ అనుబంధ సంఘాల ప్రతినిధులందరూ కలసి…ఎన్నికలకు వారంరోజుల ముందే సమావేశం ఏర్పాటు చేసుకొని బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని.. బీసీసీఐ చైర్మన్ గా నియమించాలని నిర్ణయించాయి.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జే షా బీసీసీఐ కార్యదర్శిగాను, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమాల్ కోశాధికారిగాను బాధ్యతలు నిర్వర్తించ బోతున్నారు.

దాదా అరుదైన ఘనత..

భారత క్రికెట్ బోర్డు చరిత్రలో భారత మాజీ కెప్టెన్, విజయనగరం మహారాజా 1954-56 సంవత్సరాలలో బీసీసీఐ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించిన తొలి క్రికెటర్ గా గుర్తింపు పొందారు. ఆ తర్వాత 2014 లో సునీల్ గవాస్కర్, శివలాల్ యాదవ్ సైతం తాత్కాలిక అధ్యక్షులుగా బోర్డుకు సేవలు అందించారు. వారి తర్వాత పూర్తిస్థాయిలో సౌరవ్ గంగూలీ మాత్రమే బీసీసీఐ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టడం విశేషం.

సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగణంగా …గత రెండు సంవత్సరాలుగా భారత క్రికెట్ బోర్డు పగ్గాలు చేపట్టిన వినోద్ రాయ్ నేతృత్వంలోని పాలకమండలి సైతం బాధ్యతల నుంచి తప్పుకొని సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని సరికొత్త కార్యవర్గానికి పగ్గాలు అప్పచెప్పనుంది.

గత కొద్ది సంవత్సరాలుగా బీసీసీఐ కోల్పోయిన ప్రతిష్టను పునరుద్దరించడమే తన లక్ష్యమని సౌరవ్ గంగూలీ ప్రకటించారు. కెప్టెన్ గా, ఆటగాడిగా విజయవంతమైన సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ బోర్డు చైర్మన్ గానూ సఫలం కావాలని కోరుకొందాం.

First Published:  23 Oct 2019 10:46 AM IST
Next Story