Telugu Global
NEWS

రివర్స్ టెండరింగ్‌ వల్ల ఐదు వేల కోట్లు మిగిలే అవకాశం

రివర్స్‌ టెండరింగ్ విధానంలో ఇప్పటి వరకు ఒక్క నీటిపారుదల రంగంలోనే వెయ్యి కోట్ల రూపాయల డబ్బును ఆదా చేశామని చెప్పారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లకుండా చంద్రబాబు చేసినట్టు నేరుగా ప్రాజెక్టులు అప్పగించి ఉంటే ఈ వెయ్యి కోట్ల రూపాయల డబ్బు కేవలం ఓ పది మంది జేబుల్లోకి వెళ్లి ఉండేదన్నారు. చంద్రబాబు సీఎం అయిన రెండేళ్ల తర్వాతే ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రారంభించారన్నారు. తాము వచ్చి ఇంకా నాలుగు నెలలు మాత్రమే అయిందని… […]

రివర్స్ టెండరింగ్‌ వల్ల ఐదు వేల కోట్లు మిగిలే అవకాశం
X

రివర్స్‌ టెండరింగ్ విధానంలో ఇప్పటి వరకు ఒక్క నీటిపారుదల రంగంలోనే వెయ్యి కోట్ల రూపాయల డబ్బును ఆదా చేశామని చెప్పారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లకుండా చంద్రబాబు చేసినట్టు నేరుగా ప్రాజెక్టులు అప్పగించి ఉంటే ఈ వెయ్యి కోట్ల రూపాయల డబ్బు కేవలం ఓ పది మంది జేబుల్లోకి వెళ్లి ఉండేదన్నారు.

చంద్రబాబు సీఎం అయిన రెండేళ్ల తర్వాతే ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రారంభించారన్నారు. తాము వచ్చి ఇంకా నాలుగు నెలలు మాత్రమే అయిందని… ప్రాజెక్టులపై సమీక్ష జరుపుకుని ప్రణాళికా బద్దంగా ముందుకెళ్లేందుకు సిద్దమవుతున్నామన్నారు. కమిషన్లు ఇచ్చిన కాంట్రాక్టర్ల నుంచి పనులు చేజారిపోతుంటే దేవినేని ఉమాకు బాగా బాధగా ఉందన్నారు. బహుశా కమిషన్లు ఇచ్చిన కంపెనీలు తిరిగి ఇవ్వాల్సిందిగా దేవినేని ఉమాపై ఒత్తిడి తెస్తున్నట్టుగా ఉందన్నారు.

సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థ గతంలో వెలిగొండ ప్రాజెక్టు కాంట్రాక్టును 4.69 శాతానికి అధికంగా తీసుకుందని… ఇప్పుడు రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తే అదే సంస్థ తక్కువ ధరకు కడుతామంటూ పోటీ పడిందన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా ఉంది కాబట్టే సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థ రివర్స్ టెండరింగ్‌లో ఆఖరి వరకు పోటీలో నిలిచిందన్నారు.

అన్ని శాఖల్లో రివర్స్ టెండరింగ్‌ ద్వారా ఐదు వేల కోట్ల రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందన్నారు. చంద్రబాబు రెండు లక్షల కోట్ల అప్పులు పడేసి వెళ్తే తాము నాలుగు నెలల్లోనే వేల కోట్లు మిగిల్చే పనిలో ఉన్నామన్నారు.

మరో నెల రోజుల్లో అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన రివర్స్ టెండరింగ్ పూర్తవుతుందని… ఆ వెంటనే శరవేగంగా పనులు మొదలవుతాయని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. భగవంతుడు సహకరించి మంచి వర్షాలు ఈ ఏడాది కురిపిస్తే దాన్ని చూసి కూడా చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.

సంక్షేమ పథకాలను అమలు చేసినా టీడీపీ నేతలు తప్పు పట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కేవలం ఐదు, పది మంది కాంట్రాక్టర్లకు వేల కోట్లు దోచిపెట్టే చంద్రబాబు, టీడీపీ నేతలు… పేద ప్రజలు బాగుపడడం కూడా చూసి తట్టుకోలేకపోతున్నారన్నారు.

ఇసుక ఎక్కువ దొరికే కృష్ణా, గోదావరి నదుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా సుధీర్ఘంగా వరద కొనసాగుతోందని అందువల్లే ఇసుక ఇబ్బంది ఉందన్నారు. వరద తగ్గగానే ఇసుక కొరత ఉండదన్నారు. వరద వల్ల ఇసుక లభ్యత కూడా ఈసారి ఎక్కువగా ఉంటుందన్నారు. టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు ఎక్కువయ్యాయని… అందుకే చంద్రబాబు తిరిగి బీజేపీ జపం మొదలుపెట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ మూడో ప్లేస్‌లో ఉంటుందన్నారు.

First Published:  21 Oct 2019 7:24 AM IST
Next Story