ఈ హత్య కేసు దర్యాప్తు.. చిన్న క్రైం సినిమాను గుర్తుకు తెస్తుంది..!
పోలీసులపై చాలా మందికి సదభిప్రాయం ఉండదు. అలాంటి వాళ్లు కూడా.. పోలీసులు ఒక చిన్న ఆధారంతో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవడం చూస్తే మెచ్చుకోకమానరు. ఇప్పుడు చదవబోయే కథనం టీవీల్లో వచ్చే సీఐడీ సీరియల్‌ను తలపించకమానదు. వివరాల్లోకి వెళ్దాం.. అది ముంబైలోని కళ్యాణ్ ప్రాంతం. అక్కడి పోలీసులకు మే 23న ఒక ఫోన్ కాల్ వచ్చింది. రైలు పట్టాలపై ఒక మహిళ మృతదేహం పడి ఉందనేది ఆ కాల్ సారాంశం. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అది […]
పోలీసులపై చాలా మందికి సదభిప్రాయం ఉండదు. అలాంటి వాళ్లు కూడా.. పోలీసులు ఒక చిన్న ఆధారంతో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవడం చూస్తే మెచ్చుకోకమానరు. ఇప్పుడు చదవబోయే కథనం టీవీల్లో వచ్చే సీఐడీ సీరియల్‌ను తలపించకమానదు. వివరాల్లోకి వెళ్దాం..
అది ముంబైలోని కళ్యాణ్ ప్రాంతం. అక్కడి పోలీసులకు మే 23న ఒక ఫోన్ కాల్ వచ్చింది. రైలు పట్టాలపై ఒక మహిళ మృతదేహం పడి ఉందనేది ఆ కాల్ సారాంశం. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అది ఒక 50 ఏండ్ల మహిళదిగా గుర్తించారు. అక్కడ క్లూస్ కోసం ఎంత వెతికినా ఏమీ దొరకలేదు. ఆ మహిళ ధరించిన కాళ్ల పట్టీలు తప్ప సంఘటనా స్థలంలో ఒక్క ఆధారం కూడా లభించలేదు.
రోజులు గడిచినా మహిళ మృత దేహాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి బంధువులు ఎవరూ రాకపోవడంతో అనాథ శవంగా పరిగణించి ఖననం చేశారు. అయితే కళ్యాణ్ ప్రాంత ఇన్‌స్పెక్టర్ ఆ దొరికిన కాళ్ల పట్టీలను నిశితంగా పరిశీలించగా ఆ పట్టీపై తమిళంలో అక్షరాలు కనపడ్డాయి. వెంటనే తమిళం తెలిసిన వ్యక్తిని పిలిచి అవేంటని అడిగాడు. అది ఆ పట్టీలు తయారు చేసిన దుకాణం పేరని… తమిళనాడు లోని తిరువణ్ణామలైలో ఆ దుకాణం ఉందని చెప్పాడు.
వెంటనే పోలీసులు తిరువణ్ణామలై బయలుదేరి వెళ్లారు. ఆ దుకాణ యజమానిని అడగ్గా.. ఇది మేం తయారు చేసిందే.. కాని ఎవరు కొన్నారో మాకు తెలియదని అన్నాడు. పోలీసులు నిరాశగా వెళ్తుంటే.. యజమాని ఒక్క క్షణం ఆగండని చెప్పి.. ఈ మోడల్ పట్టీలు మా దగ్గర ఎక్కువగా ముస్లిం మహిళలు కొంటుంటారని చెప్పాడు.
వెంటనే మహిళ ముస్లిం అని.. ఆమె ఇదే ప్రాంతానికి చెందిందని నిర్థారణకు వచ్చి ఆ ప్రాంతమంతా గాలించారు. కాని నిరాశే ఎదురైంది. సరే ఎందుకైనా మంచిదని చుట్టు పక్కల గ్రామాల్లో కూడా వెతకడం ప్రారంభించారు. అప్పటికే మహిళ మృతదేహం దొరికి ఐదు నెలలైంది. కాని ఎలాంటి ముందడుగూ పడటం లేదు.
అలాంటి సమయంలో ఒక గ్రామంలోని మహిళ ఆ కాలి పట్టీని గుర్తుపట్టింది. ఇది మా బంధువు షబీనా షేక్‌ది అనీ.. ఆమె ముంబైలోని దానా బందర్ ప్రాంతంలో ఉండేది.. కాని మే 16 నుంచి కనిపించకుండా పోయిందని చెప్పింది. దీంతో మృతురాలు ఎవరో తెలుసుకున్న పోలీసులు దానా బందర్ ప్రాంతంలో విచారణ జరిపారు.
సబీనా షేక్ ముంబైలో మన్సూర్ షేక్ (42) అనే వ్యక్తితో సహజీవనం చేసేదని తెలిసింది. వెంటనే మన్సూర్ షేక్‌ను గాలించి పోలీసులు పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారణ జరుపగా ఇలా చెప్పాడు.
‘నాది పశ్చిమ బెంగాల్.. నాకు భార్య పిల్లలు ఉన్నారు. అయితే వాళ్లను వదిలి తన వద్దే ఉండమని సబీనా రోజూ బలవంతం చేసేది. అందుకే తనను అంతమొందించాలని అనుకున్నా’ అని చెప్పాడు. మన్సూర్ షేక్ చెప్పింది నిర్థారించుకునే పనిలో పోలీసులు ఉన్నారు. అంతే కాకుండా ఇతడు ఒక్కడే ఈ హత్య చేశాడా.. లేదా ఇంకెవరైనా సహకరించారా అనే కోణంలోనూ విచారిస్తున్నారు.
ఒక చిన్న కాలి పట్టీ హంతకుడిని పట్టించింది. ఒక వేళ ఆ పట్టీలే లేకుంటే ఈ హత్య కేసు ఛేదన కష్టతరం అయ్యేదేమో..!