అవసరమైన నిర్మాణాలు మాత్రమే రాజధానిలో చేస్తాం
రాజధాని ప్రాంతంలో పాలనకు అవసరమైన నిర్మాణాలు మాత్రమే చేస్తామని… అవసరం లేని నిర్మాణాలను చేపట్టబోమన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాల కారణంగానే అనేక ఇబ్బందులు రాజధాని విషయంలో వస్తున్నాయన్నారు. తాత్కాలిక భవనం పునాది కట్టడానికి కూడా 100 అడుగుల పునాది తీయాల్సి వచ్చిందన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా మంత్రి నారాయణ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవడం వల్ల అనేక ఇబ్బందులు వచ్చాయన్నారు. రాజధాని ప్రాంతంలో అనేక కుంభకోణాలు జరగడం, ముంపు ప్రమాదం […]
రాజధాని ప్రాంతంలో పాలనకు అవసరమైన నిర్మాణాలు మాత్రమే చేస్తామని… అవసరం లేని నిర్మాణాలను చేపట్టబోమన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాల కారణంగానే అనేక ఇబ్బందులు రాజధాని విషయంలో వస్తున్నాయన్నారు. తాత్కాలిక భవనం పునాది కట్టడానికి కూడా 100 అడుగుల పునాది తీయాల్సి వచ్చిందన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా మంత్రి నారాయణ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవడం వల్ల అనేక ఇబ్బందులు వచ్చాయన్నారు. రాజధాని ప్రాంతంలో అనేక కుంభకోణాలు జరగడం, ముంపు ప్రమాదం ఉండడంతో వీటిని పరిశీలించేందుకు ఒక కమిటీని వేశామన్నారు.
ఈ కమిటీ రెండు రోజుల్లో రాష్ట్ర పర్యటనను ప్రారంభిస్తుందన్నారు. వారి సూచనల మేరకు రాజధానిపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆ లోపు రాజధాని రైతులు ఇబ్బంది పడకూడదనే గత నెలలోనే కౌలు మొత్తం ఒకేసారి చెల్లించామన్నారు.
రాష్ట్రమంటే కేవలం అమరావతి మాత్రమే కాదన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలన్నారు. రాజధాని ఎక్కడుండాలి… ఏ ప్రాంతంలో ఏది ఉంచాలి? ఏ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి చేయవచ్చు? అన్న వాటిపై కమిటీ సలహాలు ఇస్తుందన్నారు.
రాజధానికి సంబంధించిన నిర్ణయాలన్నీ పారదర్శకంగానే, బహిరంగంగానే జరుగుతాయన్నారు. లోపాయికారీ ఒప్పందాలంటూ ఏమీ ఉండవన్నారు. ఏ ఒక్క ప్రాంతాన్నో, ఏ ఒక్క కులాన్నో వెంటేసుకుని ముందుకెళ్లాలన్నది జగన్ ఆలోచన కానేకాదన్నారు.
పాలనకు అవసరమైన నిర్మాణాలు చేస్తామని… అవసరం లేని నిర్మాణాలను చేపట్టబోమన్నారు. శివరామకృష్ణన్ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉద్దేశం అన్ని ప్రాంతాల వారి అభిప్రాయలు తీసుకుని రాజధాని ఏర్పాటు చేయాలన్నదే కదా అని ప్రశ్నించారు. కానీ చంద్రబాబు కనీసం ఆ కమిటీ రిపోర్టును పరిగణనలోకి తీసుకున్నారా అని నిలదీశారు.
చంద్రబాబు వేసిన నారాయణ కమిటీ సభ్యుల్లో ఒక్కరూ కూడా నిపుణులు లేరని.. అందరూ కేవలం రాజకీయ కోణంలో, అవినీతి సంపాదన కోణంలోనే నియమితులయ్యారన్నారు. హైకోర్టు తమ ప్రాంతంలో ఉండాలంటూ పలు ప్రాంతాల వారు డిమాండ్ చేస్తున్నారని… ఇలాంటి సమస్యలు ఉన్నాయని వాటికి పూర్తి స్థాయిలో పరిష్కారం కనుగొంటామన్నారు.13 జిల్లాల్లో సమగ్ర అభివృద్ధి ఉండాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన అని బొత్స వివరించారు.