Telugu Global
International

స్వీడిష్ సాకర్ గ్రేట్ కు అరుదైన గౌరవం

తన కాంస్య ప్రతిమను తానే ఆవిష్కరించుకొన్న ఇబ్రహీమోవిచ్ ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ లో ఎందరో గొప్పగొప్ప స్టార్ ప్లేయర్లున్నా…స్వీడిష్ సాకర్ గ్రేట్ జ్లాటాన్ ఇబ్రహీమోవిచ్ స్టయిలే వేరు. తాను ఫుట్ బాల్ ఓనమాలు దిద్దుకొన్న స్టేడియం ఎదుటనే తన కాంస్య శిలా ప్రతిమను ఆవిష్కరించుకొని… వావ్ అనిపించుకొన్నాడు. స్వీడన్ లోని మాల్మోనగరంలోని సాకర్ స్టేడియం ఎదుట జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి భారీసంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. 6 అడుగుల 5 అంగుళాల ఆజానుబాహుడైన ఇబ్రహీమోవిచ్ […]

స్వీడిష్ సాకర్ గ్రేట్ కు అరుదైన గౌరవం
X
  • తన కాంస్య ప్రతిమను తానే ఆవిష్కరించుకొన్న ఇబ్రహీమోవిచ్

ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ లో ఎందరో గొప్పగొప్ప స్టార్ ప్లేయర్లున్నా…స్వీడిష్ సాకర్ గ్రేట్ జ్లాటాన్ ఇబ్రహీమోవిచ్ స్టయిలే వేరు. తాను ఫుట్ బాల్ ఓనమాలు దిద్దుకొన్న స్టేడియం ఎదుటనే తన కాంస్య శిలా ప్రతిమను ఆవిష్కరించుకొని… వావ్ అనిపించుకొన్నాడు.

స్వీడన్ లోని మాల్మోనగరంలోని సాకర్ స్టేడియం ఎదుట జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి భారీసంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.

6 అడుగుల 5 అంగుళాల ఆజానుబాహుడైన ఇబ్రహీమోవిచ్ కాంస్య ప్రతిమను స్వీడిష్ విఖ్యాత శిల్పకారుడు పీటర్ లిండే తీర్చిదిద్దారు. 500 కిలోల కంచులోహంతో 2.7 మీటర్ల ఎత్తైన విగ్రహాన్ని తయారు చేశారు. ఈ కాంస్య ప్రతిమను తీర్చిదిద్దటానికి ఐదుసంవత్సరాల కాలం పట్టింది.

మాల్మో నగర స్టేడియం ఎదుట వేలాదిమంది అభిమానుల సమక్షంలో ఇబ్రహీమోవిచ్ తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించుకోడం..ప్రపంచ సాకర్ వర్గాలలో ప్రముఖవార్తగా నిలిచింది.

పారిస్ లోని గ్రేవిన్ వాక్స్ మ్యూజియంలో ఇప్పటికే ఇబ్రహీమోవిచ్ ప్రతిమ కొలువుతీరి ఉంది.

యుగోస్లావియా టు స్వీడన్…

అలనాటి యుగోస్లావియాలోని రోజెన్ గార్డ్ లో జన్మించిన ఇబ్రహీమోవిచ్ బాల్యమంత భయాందోళనల నడుమనే గడచింది. అక్కడి నుంచి స్వీడన్ కు వలస వచ్చిన ఇబ్రహీమోవిచ్…మాల్మో నగర సాకర్ స్టేడియం సమీపంలో ఫుట్ బాల్ శిక్షణ పొంది విశ్వవిఖ్యాత సాకర్ ప్లేయర్లలో ఒకనిగా గుర్తింపు పొందాడు. ఏకంగా స్వీడన్ జాతీయజట్టులో చోటు సంపాదించడమే కాదు…కేంద్రబిందువుగా మారాడు.

ఇబ్రహీమోవిచ్ స్వీడన్ జాతీయజట్టులో ఉన్నాడంటే చాలు…ఫలితంతో సంబంధం లేకుండా స్టేడియాలు కిటకిటలాడటం సాధారణ విషయం.

లీగ్ సాకర్ లో మొనగాడు…

యూరోపియన్ క్లబ్ సాకర్ లీగ్ లో ఎక్కువ జట్లను విజేతగా నిలపడంలో ఇబ్రహీమోవిచ్ కు అద్భుతమైన రికార్డే ఉంది. తన కెరియర్ లో మాల్మో, అజాక్స్, యువెంటస్, ఇంటర్ మిలాన్, బార్సిలోనా, ఏసీ మిలాన్, పీఎస్ జీ, మాంచెస్టర్ యునైటెడ్, లాస్ ఏంజెలిస్ గెలాక్సీ క్లబ్ జట్ల తరపున ఆడి తన సత్తా చాటుకొన్నాడు.

గత 16 సీజన్లలో ఇబ్రహీమోవిచ్ మొత్తం 13 లీగ్ టైటిల్స్ సాధించడం విశేషం.

2001 నుంచి 2016 వరకూ స్వీడన్ ఫుట్ బాల్ జట్టుకు వెన్నెముకలా నిలిచిన ఇబ్రహీమోవిచ్ కు ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానులు ఉండటం విశేషం. స్వీడన్ తరపున 116 మ్యాచ్ లు ఆడిన ఇబ్రహీమోవిచ్ కు 62 గోల్స్ సాధించిన ఘనత ఉంది.

తాను లేకుంటే స్వీడిష్ ఫుట్ బాలే లేదని…స్వీడన్ జట్టు ఆడకుంటే ప్రపంచకప్ ఫుట్ బాల్ కే అర్ధంలేదంటూ ప్రకటించడం కేవలం ఇబ్రహీమోవిచ్ కు మాత్రమే చెల్లింది. అతని ఆటలో పవర్ అలాంటిది మరి.

First Published:  15 Oct 2019 2:30 AM IST
Next Story