పెద్దారెడ్డి పేరు గల్లంతు, మంత్రితో వాగ్వాదం
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అనంతపురం వచ్చిన సందర్బంగా జిల్లా మంత్రి శంకర్‌నారాయణ, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. తనకు జరిగిన అవమానం పట్ల పెద్దారెడ్డి నేరుగా మంత్రిని నిలదీశారు. కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జిల్లాకు వచ్చిన జగన్.. తొలుత పుట్టపర్తికి విమానంలో వచ్చారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌కు వచ్చారు. అక్కడ సీఎంకు స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హెలికాప్టర్ వద్దకు […]
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అనంతపురం వచ్చిన సందర్బంగా జిల్లా మంత్రి శంకర్‌నారాయణ, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.
తనకు జరిగిన అవమానం పట్ల పెద్దారెడ్డి నేరుగా మంత్రిని నిలదీశారు. కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జిల్లాకు వచ్చిన జగన్.. తొలుత పుట్టపర్తికి విమానంలో వచ్చారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌కు వచ్చారు. అక్కడ సీఎంకు స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హెలికాప్టర్ వద్దకు వెళ్లారు.
పోలీసులు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిని మాత్రం అడ్డుకున్నారు. జాబితాలో మీ పేరు లేదంటూ అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు. దాంతో తాను ఎమ్మెల్యేను అని… తనను ఎందుకు అడ్డుకుంటారని పెద్దారెడ్డి ప్రశ్నించారు. తన బాబాయ్‌ని పోలీసులు అడ్డుకున్న విషయం గమనించిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్కడికి వచ్చి పోలీసుల తీరును తప్పుపట్టారు. తనతో పాటు పెద్దారెడ్డిని సీఎం వద్దకు తీసుకెళ్లారు.
హెలికాప్టర్ వద్దకు వెళ్లే వారి జాబితాను జిల్లా మంత్రి శంకర్‌నారాయణ ఆధ్వర్యంలో తయారు చేశారని తెలుసుకున్న పెద్దారెడ్డి నేరుగా సీఎం సభ వద్దే మంత్రిని నిలదీశారు. తన పేరు ఎందుకు జాబితాలో లేదని నిలదీశారు. సొంత జిల్లాకు చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యేలే గుర్తు లేకుండాపోయారని అని ప్రశ్నించారు. దానికి తోడు తాడిపత్రి నియోజకవర్గంలోని కొందరు నాయకులకు తనకు చెప్పకుండానే నేరుగా మంత్రి పాస్‌లు ఇవ్వడంపై పెద్దారెడ్డి ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అక్కడ తనకు తెలియకుండా పాస్‌లు ఎలా జారీ చేశారని నిలదీశారు.
మంత్రికి, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరుగుతున్న అంశాన్ని గమనించిన సీనియర్ నేత, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అక్కడికి వెళ్లి వారిద్దరికి సర్దిచెప్పారు. సభ ముగిసిన తర్వాత మాట్లాడాకుందాం…. ఇంతటితో వదిలేయండి అని సూచించారు. దాంతో పెద్దారెడ్డి, శంకర్ నారాయణ మౌనంగా ఉండిపోయారు. మంత్రి తీరుపై ఆ తర్వాత ముఖ్యమంత్రికి పెద్దారెడ్డి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.