అంతర్జాలం దెబ్బకు కుదేలైన థామస్ కుక్
చాలా వరకు మనం ఏం చూస్తున్నామన్నది మన దృష్టి కోణం మీద ఆధారపడి ఉంటుంది. 1841లో యునైటెడ్ కింగ్ డమ్ లోని మార్కెట్ హార్బరోలో ప్రారంభమైన ప్రపంచంలోని అతి పెద్ద ప్రయాణ ఏర్పాట్ల సంస్థ థామస్ కుక్ వైఫల్యాన్ని బ్రిటిష్ పెట్టుబడిదారీ విధానంలోని సిగ్గుమాలిన పద్ధతుల్లో భాగంగానే చూస్తారు. ఈ వైఫల్యం వెనక బ్రిటిష్ హోం స్టోర్స్, స్కాట్ లాండ్ రాయల్ బ్యాంకు లేదా రోవర్ కు చెందిన దండిగా వేతనాలు అందుకునే మేనేజర్లే ఉన్నారని అనుకుంటారు. […]
చాలా వరకు మనం ఏం చూస్తున్నామన్నది మన దృష్టి కోణం మీద ఆధారపడి ఉంటుంది. 1841లో యునైటెడ్ కింగ్ డమ్ లోని మార్కెట్ హార్బరోలో ప్రారంభమైన ప్రపంచంలోని అతి పెద్ద ప్రయాణ ఏర్పాట్ల సంస్థ థామస్ కుక్ వైఫల్యాన్ని బ్రిటిష్ పెట్టుబడిదారీ విధానంలోని సిగ్గుమాలిన పద్ధతుల్లో భాగంగానే చూస్తారు.
ఈ వైఫల్యం వెనక బ్రిటిష్ హోం స్టోర్స్, స్కాట్ లాండ్ రాయల్ బ్యాంకు లేదా రోవర్ కు చెందిన దండిగా వేతనాలు అందుకునే మేనేజర్లే ఉన్నారని అనుకుంటారు. వీరు థామస్ కుక్ కంపెనీ ఆస్తులను అమ్మేశారు. పింఛన్ పథకాన్ని సర్వ నాశనం చేశారు. థామస్ కుక్ వైఫల్యం త్వరితగతిన విస్తరిస్తున్న బ్రిటిష్ పెట్టుబడిదారీ విధాన వైఫల్యమా?
థామస్ కుక్ కంపెనీకి నష్టాలు వస్తున్నప్పటికీ వాటాదార్లకు డివిడెండ్లు చెల్లించింది. ఆ కంపెనీ ప్రధాన కార్య నిర్వహణాధికారి పీటర్ ఫ్రాంక్ హాసర్ కు గత నాలుగేళ్లుగా 8.4 మిలియన్ పౌండ్ల వేతనం చెల్లిస్తూ వచ్చింది. ఈ కంపెనీ ముణిగిపోవడానికి కారణాలు ఏమిటి అని దర్యాప్తులు జరుగుతాయి. అయితే విస్తు పోవడం మాత్రం ప్రజల వంతు అవుతుంది.
కంపెనీ నిర్వాహకుల విచ్చలవిడితనం ఆ సంస్థ మూతపడడానికి దారి తీసింది. అయితే ఈ వ్యవహారం కేవలం దురాశపూరితమైన వ్యాపారానికి పరిమితమైంది కాదు. పింఛన్ ఫండ్ నిర్వాహకులు థామస్ కుక్ కంపెనీ ప్రతిపాదించిన చివరి పథకాలను కూడా తిరస్కరించారు.
బ్రిటన్ కు యూరప్ కు మధ్య ఉన్న విభేదాలు కూడా ఈ కంపెనీ దివాలా ఎత్తడానికి కారణమని కొందరు వాదిస్తున్నారు. బ్రిటన్ లో 9,000 ఉద్యోగాలు కాపాడడానికి 150 మిలియన్ పౌన్లు సహాయం చేయాలన్న అభ్యర్థనను బోరిస్ జాన్సన్ ప్రభుత్వం అంగీకరించలేదు. దీనికి బదులుగా థామస్ కుక్ సేవలను వినియోగించుకుని సెలవులకు వెళ్లిన 1,50,000 మందిని వెనక్కు తీసుకురావడానికే బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నించింది.
మరో వేపున జర్మనీలోని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు థామస్ కుక్ కు అనుబంధ కంపెనీ అయిన కాండర్ కు 380 మిలియన్ల యూరోలు సహాయం చేసి ఆ కంపెనీని థామస్ కుక్ నుంచి విడదీయాలని ప్రయత్నించారు. దీనివల్ల 1,40,000 జర్మన్లు తమ సెలవులు గడపగలిగారు.
బ్రెక్సిట్ పుణ్యమా అని ముణిగిపోయిన కంపెనీలలో థామస్ కుక్ మొదటిది అనే వారూ ఉన్నారు. ఏడాది కింద ఈ కంపెనీ అమ్మకాలు 9 బిలియన్ పౌన్లు, 19 మిలియన్ల వినియోగ దార్లు, ప్రపంచ వ్యాప్తంగా 22,000 మంది ఉద్యోగులు ఉన్నారు. 3 బిలియన్ పౌన్ల నష్టంతో ఈ కంపెనీ గత సెప్టెంబర్ 23న మూతపడింది. స్టాక్ మార్కెట్ లో 16 బిలియన్ పౌన్ల నష్టం సంభవించింది.
టూయి, ర్యాన్ ఏర్, ఈజీ జెట్ కంపెనీలు సైతం థామస్ కుక్ తో సహా తీవ్రంగా నష్టపోయాయి. ఎనిమిదేళ్ల కింద కూడా థామస్ కుక్ కంపెనీ దివాలా నుంచి తప్పించుకోగలిగింది. 2011లో బ్యాంకు నుంచి రుణం తీసుకుని 2013లో వాటాదార్ల నుంచి 425 మిలియన్ పౌన్ల నిధులు సేకరించి అప్పుడు గట్టెక్క గలిగింది.
నష్టపోయిన కంపెనీల్లో థామస్ కుకు మొదటిది ఏమీ కాదు. అంతర్జాలం దెబ్బకు నష్టపోయిన కంపెనీ ఇది. ఈ కంపెనీ డిజిటల్ యుగంలో అనలాగ్ పద్ధతుల్లోనే పని చేసింది అని మోనార్క్ ఏర్ లైన్స్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ టిం జీన్స్ అన్నారు. ఇంటర్నెట్ పుణ్యమా అని ఈ కంపెనీ కూడా దివాలా తీసింది.
చాలా మంది తమ ప్రయాణ ఏర్పాట్ల కోసం థామస్ కుక్ లాంటి ప్రయాణ ఏర్పాట్లు చేసే సంస్థల మీద ఆధారపడకుండా అంతర్జాలాన్నే ఆశ్రయించారు. ట్రిప్ అడ్వైజర్ లాంటి కంపెనీలు విప్లవాత్మకమైన మార్పులను తమ వ్యాపారంలో ప్రవేశ పెట్టి మనగలిగాయి. థామస్ కుక్ కంపెనీకి 500 శాఖలు ఉండేవి. ఇవి వినియోగదార్లకు ఉపయుక్తంగా ఉండేవి. అయితే ఆన్ లైన్లో ప్రయాణ ఏర్పాట్లు చేసే సంస్థలు కుప్పలు తెప్పలుగా వచ్చినందువల్ల థామస్ కుక్ తన శాఖలను నిర్వహించడం మితి మీరిన భారమైంది. థామస్ కుక్ మాత్రం పాత పద్ధతుల్లోనే తన వ్యాపారం కొనసాగించింది. ఆన్ లైన్ లో ప్రయాణ ఏర్పాట్లు చేసే కంపెనీలు ప్రయాణికులకు అదనపు సదుపాయాలు కల్పించాయి. వినియోగదార్ల అవసరాలకు తగ్గట్టుగా వ్యవహరించాయి.
మిత పానానికి, మిత భోజనానికి సంబంధించిన ఒక సమావాశానికి ఒక పూట హాజరై తిరిగి రావడం కోసం థామస్ కుక్ అనే బాప్టిస్టు మత బోధకుడు 1841లో ఏర్పాట్లు చేశారు. ఒక షిల్లింగ్ మాత్రమే తీసుకుని రైలు టికెట్టు, మధ్యాహ్నం తేనీరు, సంగీతం వినే ఏర్పాట్లు చేశారు. థామస్ కుక్ ఆ తరువాత ప్రయాణ ఏర్పాట్లు చేసే కంపెనీ నెలకొల్పారు. ఇది బ్రిటన్ లో ఒక పరిశ్రమగా మారింది.
అయితే మొదట ఇలాంటి ప్రయత్నాలు ప్రారంభించిన కంపెనీలు, సంప్రదాయాన్ని పరిరక్షించాలని ప్రయత్నించిన సంస్థలు మారుతున్న కాలం ప్రకారం కొనసాగడం ఇబ్బంది కావచ్చు. అసలు ప్రయాణ ఏర్పాట్లు చేసే వ్యాపారాలే ఇబ్బందుల్లో ఉన్నాయి. నిలదొక్కుకోగలుగుతున్న కంపెనీలు కేవల ప్రయాణ ఏర్పాట్లు చేయడానికి పరిమితం కాకుండా విమానయానం, హోటల్ కంపెనీలు కూడా ప్రారంభించాయి. టూయి, సన్వింగ్ కంపెనీలు ఇదే పని చేశాయి. థామస్ కుక్ కూడా విమానయాన వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ఆ సంస్థ దగ్గర 90 విమానాలు ఉండేవి. కానీ ఆ వ్యాపారం సఫలం కాలేదు.
లే లాండ్ ట్రక్కులు, రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిళ్ల కంపెనీ లాగా థామస్ కుక్ కూడా మన దేశంలో మరో అవతారం ఎత్తే ఎవకాశం లేకపోలేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా థామస్ కుక్ భారత్ లోని తన వ్యాపారాలను 2012లోనే ఇతరులకు విక్రయించింది. 2021 దాకా తమ బ్రాండును వినియోగించుకోవడానికి అనుమతించింది. దీనికి ప్రతిఫలంగా ఏటా కొంత సొమ్ము వసూలు చేసేది.
థామస్ కుక్ ఇండియా ఇప్పుడు అతి పెద్ద ప్రయాణ ఏర్పాట్లు చేసే సంస్థ. 2020 నుంచి కంపెనీ పేరు మార్చాలని థామస్ కుక్ ఇండియా భావించింది. అయితే ఇప్పుడు అదే పేరు కొనసాగించి థామస్ కుక్ దగ్గర హక్కులు స్వాధీనం చేసుకుని తన వ్యాపారం కొనసాగించవచ్చు. కానీ అవే వ్యాపార పద్ధతులు అనుసరించకుండా ఉండాలి.
(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)