నారాయణ, ఎస్పీ కలిసి శ్రీధర్ రెడ్డిని టార్గెట్ చేశారా?
తన అరెస్ట్‌కు దారి తీసిన పరిణామాల వెనుక కుట్ర ఉందని ఆరోపించారు వైసీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి పైన పరోక్షంగా అనుమానం వ్యక్తం చేశారు. అదే సమయంలో మాజీ మంత్రి నారాయణ, జిల్లా ఎస్పీలపైనా శ్రీధర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఎంపీడీవో సరళ తన అనుచరుడి వెంచర్‌కు అవసరమైన తాగునీటి పైపు లైన్ కోసం అనుమతులు ఇవ్వకపోవడంతో ఆమెకే నేరుగా ఫోన్ చేశానని… స్థానిక ఎమ్మెల్యే కాకాణి […]
తన అరెస్ట్‌కు దారి తీసిన పరిణామాల వెనుక కుట్ర ఉందని ఆరోపించారు వైసీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి పైన పరోక్షంగా అనుమానం వ్యక్తం చేశారు. అదే సమయంలో మాజీ మంత్రి నారాయణ, జిల్లా ఎస్పీలపైనా శ్రీధర్ రెడ్డి ఆరోపణలు చేశారు.
ఎంపీడీవో సరళ తన అనుచరుడి వెంచర్‌కు అవసరమైన తాగునీటి పైపు లైన్ కోసం అనుమతులు ఇవ్వకపోవడంతో ఆమెకే నేరుగా ఫోన్ చేశానని… స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుమతులు ఇవ్వొద్దని చెప్పారని ఆమె వివరంచారన్నారు. దాంతో నేరుగా కాకాణికే ఫోన్ చేస్తే ఆ అనుమతులు ఇప్పట్లో సాధ్యం కాదన్నారు. దాంతో ఈ అంశంపై కోర్టును ఆశ్రయించాల్సిందిగా తాను తన అనుచరుడికి సూచించానన్నారు. అలా కోర్టుకు వెళ్తారని తెలిసే ఇలా తప్పుడు కేసులు పెట్టారన్నారు.
ఎంపీడీవో సరళను స్వయంగా వెంకటాచలం వైసీపీ నాయకుడు వెంటబెట్టుకుని వెళ్లి కేసు పెట్టించారన్నారు. ఒక వైసీపీ ఎమ్మెల్యేపై కేసు పెట్టేందుకు మరో వైసీపీ నాయకుడే ఎంపీడీవోను తీసుకెళ్లడం బట్టి దీని వెనుక అసలు సూత్రదారులు ఎవరో అర్థం చేసుకోవచ్చన్నారు. పరోక్షంగా కాకాణి గోవర్దన్ రెడ్డిపై కోటంరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
తన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్‌లో ఉంటే అతడి పేరును కూడా ఫిర్యాదులో చేర్చారని వివరించారు. అర్థరాత్రి తన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి ఇంటిపై 30 మంది పోలీసులు దాడి చేశారని… అతడి భార్య పట్ల కూడా దురుసగా వ్యవహరించారని కోటంరెడ్డి చెబుతున్నారు.
జిల్లా ఎస్పీపైనా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ప్రస్తుత ఎస్పీని మాజీ మంత్రులు నారాయణ, సోమిరెడ్డిలు ఏరికోరి ఎన్నికల సమయంలో జిల్లాకు వేయించుకున్నారని… అప్పటి నుంచి కూడా తన పట్ల ఎస్పీ కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారని శ్రీధర్ రెడ్డి చెప్పారు. శ్రీధర్ రెడ్డికి మద్దతుగా ఉండవద్దంటూ తన నియోజకవర్గంలోని పోలీసులను కూడా ఎస్పీ బెదిరిస్తున్నారని ఆరోపించారు.
కొద్ది రోజుల క్రితమే నెల్లూరులోని కార్పొరేట్ కాలేజీలు ప్రభుత్వ నిబంధనలను పాటించాల్సిందేనంటూ తాను ఉద్యమం మొదలుపెట్టానని… దాంతో నారాయణ తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. సన్నిహితుడైన ఎస్పీ ద్వారా మాజీ మంత్రి నారాయణ పావులు కదిపారని శ్రీధర్ రెడ్డి చెబుతున్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేను అయినప్పటికీ తనను అరెస్ట్ చేసేందుకు ఉదయం వరకు కూడా ఆగకుండా అర్థరాత్రి పోలీసులను ఇంటి మీదకు ఎస్పీ పంపించడం ఎంత వరకు సమంజసమని కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.
ఎంపీడీవో ఇంటిపై తాను దాడి చేయలేదని… ఈఘటనపై లోతుగా విచారణ జరిపించాలని కోరారు. ఒకవేళ తాను తప్పు చేసినట్టు తేలితే శాశ్వతంగా వైసీపీ నుంచి బహిష్కరించాలని శ్రీధర్ రెడ్డి కోరారు.