Telugu Global
NEWS

విశాఖటెస్టులో విజయానికి భారత్ తహతహ

ఆఖరిరోజు ఆటలో సఫారీల విజయలక్ష్యం 384 పరుగులు ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తీన్మార్ సిరీస్ లోని తొలిటెస్టులో ఆతిథ్య భారత్ విజయానికి ఉరకలేస్తోంది. స్టీల్ సిటీ విశాఖపట్నంలోని ఆంధ్రక్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ నాలుగోరోజు ఆట ముగిసే సమయానికే భారత్ విజయానికి మార్గం సుగమం చేసుకొంది. రోహిత్- పూజారా ధూమ్ ధామ్ బ్యాటింగ్… ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన సౌతాఫ్రికాను…431 పరుగుల స్కోరుకు భారత్ […]

విశాఖటెస్టులో విజయానికి భారత్ తహతహ
X
  • ఆఖరిరోజు ఆటలో సఫారీల విజయలక్ష్యం 384 పరుగులు

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తీన్మార్ సిరీస్ లోని తొలిటెస్టులో ఆతిథ్య భారత్ విజయానికి ఉరకలేస్తోంది.

స్టీల్ సిటీ విశాఖపట్నంలోని ఆంధ్రక్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ నాలుగోరోజు ఆట ముగిసే సమయానికే భారత్ విజయానికి మార్గం సుగమం చేసుకొంది.

రోహిత్- పూజారా ధూమ్ ధామ్ బ్యాటింగ్…

ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన సౌతాఫ్రికాను…431 పరుగుల స్కోరుకు భారత్ ఆలౌట్ చేయగలిగింది. స్టార్ స్పిన్నర్ అశ్విన్ 145 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్ 71 పరుగుల తొలిఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించింది.

ఓపెనర్ మయాంక్ అగర్వాల్..7 పరుగులకే అవుటైనా…మరో ఓపెనర్ రోహిత్- వన్ డౌన్ పూజారా కలసి రెండో వికెట్ కు మెరుపు వేగంతో సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు.

తొలి ఇన్నింగ్స్ లో 176 పరుగుల స్కోరు సాధించిన రోహిత్ శర్మ…రెండో ఇన్నింగ్స్ లో సైతం అదే దూకుడు కొనసాగించాడు.

149 బాల్స్ లో 10 బౌండ్రీలు, 7 సిక్సర్లతో 127 పరుగులు సాధించగా…పూజారా 148 బాల్స్ లో 13 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 81 పరుగులు సాధించి అవుటయ్యారు.

కెప్టెన్ విరాట్ కొహ్లీ 31, రవీంద్ర జడేజా 40, రహానే 27 పరుగులు సాధించారు. భారత్ 4 వికెట్లకు 323 పరుగుల స్కోరుతో డిక్లేర్ చేసింది.

సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ 2 వికెట్లు, ఫిలాండర్, రబాడా చెరో వికెట్ పడగొట్టారు.

ఎల్గర్ కు జడేజా చెక్…

395 పరుగుల భారీవిజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా..ఆట 4వ ఓవర్లోనే ఓపెనర్ ఎల్గర్ వికెట్ నష్టపోయింది. 16 బాల్స్ ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన…తొలి ఇన్నింగ్స్ సెంచరీహీరో ఎల్గర్ ను లెఫ్టామ్ స్పిన్నర్ జడేజా పడగొట్టాడు.

మరో ఓపెనర్ మర్కరమ్ తో కలసి వన్ డౌన్ డీ బ్రూయిన్ స్కోరును 11కు చేర్చడంతో నాలుగోరోజుఆట ముగిసింది.

బ్యాటింగ్ కు అంతగా అనువుకాని ఆఖరిరోజు ఆటలో నెగ్గాలంటే సౌతాఫ్రికా 384 పరుగులు చేయాల్సి ఉంది. అదే భారత్ విజేతగా నిలవాలంటే మరో 9 వికెట్లు పడగొడితే చాలు… స్పిన్ జోడీ అశ్విన్, జడేజాలకు ఆఖరిరోజున చేతినిండా పనే అనడంలో సందేహం లేదు.

First Published:  5 Oct 2019 4:07 PM IST
Next Story