Telugu Global
Others

దర్యాప్తులో కనిపించని నిష్పాక్షికత

వ్యక్తి శ్రేయోవాదం అన్న ఉదారవాద విధానాలను, వ్యక్తి స్వేచ్ఛను కాపాడడానికి కొన్ని హక్కులు ఉండాలన్న సూత్రాన్ని అనుసరించే ఏ సమాజమైనా నిర్దిష్ట ప్రక్రియలను అనుసరించడం అత్యంత ప్రధానం. నిర్దిష్ట ప్రక్రియలు అంటే దర్యాప్తు చేసే పోలీసులు, నేర నిర్ధారణలో కీలక పాత్ర పోషించే న్యాయ సంబంధ వైద్య (ఫోరెన్సిక్) నిపుణులు దాపరికం లేకుండా వ్యవహరించాలని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనుమాన రహితంగా సాక్ష్యాధారాలను వెలికి తీయడానికి పోలీసులు, న్యాయ సంబంధ వైద్య నిపుణులు తమ నైపుణ్యాన్ని వినియోగించవలసి ఉంటుంది. […]

దర్యాప్తులో కనిపించని నిష్పాక్షికత
X

వ్యక్తి శ్రేయోవాదం అన్న ఉదారవాద విధానాలను, వ్యక్తి స్వేచ్ఛను కాపాడడానికి కొన్ని హక్కులు ఉండాలన్న సూత్రాన్ని అనుసరించే ఏ సమాజమైనా నిర్దిష్ట ప్రక్రియలను అనుసరించడం అత్యంత ప్రధానం.

నిర్దిష్ట ప్రక్రియలు అంటే దర్యాప్తు చేసే పోలీసులు, నేర నిర్ధారణలో కీలక పాత్ర పోషించే న్యాయ సంబంధ వైద్య (ఫోరెన్సిక్) నిపుణులు దాపరికం లేకుండా వ్యవహరించాలని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనుమాన రహితంగా సాక్ష్యాధారాలను వెలికి తీయడానికి పోలీసులు, న్యాయ సంబంధ వైద్య నిపుణులు తమ నైపుణ్యాన్ని వినియోగించవలసి ఉంటుంది.

దండ నీతి వ్యవస్థలో పని చేసే వారు వ్యక్తికి న్యాయం కలిగే రీతిలో వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకే “న్యాయం జరగడమే కాదు న్యాయం జరిగినట్టు కనిపించాలి” అన్న నానుడి వచ్చింది.

నేర విచారణా ప్రక్రియలను ఎంత బాగా అమలు చేస్తారన్న అంశంపైనే న్యాయం ఆధారపడి ఉంటుంది. దండనీతి వ్యవస్థలో నిష్పాక్షికత, శాస్త్రీయమైన నిరపేక్ష పద్ధతి మొదలైన వాటిని న్యాయ సంబంధ వైద్య నిపుణులు అనుసరించాలి. అప్పుడే దర్యాప్తు కూడా పక్షపాత రహితంగా ఉంటుంది. దర్యాప్తు సంస్థలు సమగ్రమైన సాక్ష్యాధారాలు సేకరించాలి. అవి తిమ్మిని బమ్మి చేయడానికి, నీరుగార్చడానికి అనువుగా ఉండకూడదు. అంటే దర్యాప్తు సంస్థలు సాక్ష్యాన్ని నీరుగారుస్తున్నాయనో, లేదా సాక్ష్యాన్ని నామరూపాలు లేకుండా చేస్తున్నాయనో ఆరోపణలకు అతీతంగా ఉండాలి.

దర్యాప్తు యాంత్రికమైన వ్యవహారం కాదు. దర్యాప్తు చేసే వారిలో భిన్న కోణాల నుంచి చూసే వారు ఉండవచ్చు. వారికీ రాగ ద్వేషాలు ఉండవచ్చు. ఇలాంటి రాగ ద్వేషాలకు అతీతంగా వ్యవహరించడానికి వారికి తగిన శిక్షణ ఇచ్చినా చాలామంది వాటిని అధిగమించలేక పోవచ్చు.

పోలీసుల నిష్పాక్షిత అనుమానాస్పదం కావడం, లేదా వారికి రాజకీయ అండ ఉండడం ఒక్క మన దేశానికే పరిమితమైన విషయం కాదు. ఈ రుగ్మత విశ్వ వ్యాప్తంగా ఉన్నదే. ఇలాంటి ధోరణులు న్యాయానికి విఘాతం కలిగిస్తాయి. దండనీతికి ఉన్న విలువే తగ్గిపోయేట్టు చేస్తాయి. విచారణ చేసే వారిలో పక్షపాత ధోరణివల్ల సాక్ష్యాధారాలు నీరుగారుతాయి. దర్యాప్తులో జాప్యం కలుగుతుంది. దండనీతి వ్యవస్థలో న్యాయం జరగకుండా పోయే ప్రమాదమూ ఉంటుంది.

దర్యాప్తులో లోపాలు సరైన శిక్ష పడకుండానో, కొన్ని సందర్భాలలో దోషులను నిర్దోషులుగా ప్రకటించడానికి దారి తీయవచ్చు. ఇలా నిర్దోషులుగా తేల్చి వదిలేయడం ఆత్మ పరిశీలనకు అవకాశం ఇవ్వవు.

అంతే గాక ఇలా సరైన సాక్ష్యాధారాలు లేక నిర్దోషులుగా తేలిన వారు తమను “వదిలేశారు” అని జబ్బలు చరుచుకుంటారు. దర్యాప్తు సంస్థలు నిష్పాక్షికంగా వ్యవహరించకపోవడం, వ్యక్తిగతమైన రాగద్వేషాలకు లోనై వ్యవహరించడంవల్ల, అనుసరించవలసిన ప్రక్రియలను అనుసరించకపోవడంవల్ల న్యాయానికి అడ్డంకులు ఏర్పడతాయి.

పోలీసులు దర్యాప్తు చేసే పరిస్థితులు, నేరాన్ని నిర్ధారించడానికి న్యాయసంబంధ వైద్య సమాచారం అందించే నిపుణులు, చట్టం ప్రకారం శిక్షించడానికి తోడ్పడవలసిన వారు న్యాయం “గతి” ఏమిటో నిర్ధారించే దుస్థితి ఏర్పడుతుంది. ఇది న్యాయ నిర్ణయ వ్యవస్థ సారాన్ని, సామర్థ్యాన్ని కూడా ప్రశ్నార్థకం చేస్తుంది.

సరైన విచారణా ప్రక్రియలను అనుసరిస్తే వ్యక్తి స్వేచ్ఛకు భరోసా ఉంటుంది. దీనిలో సామాజిక, లింగ వివక్షకు తావు ఉండకూడదు. సభ్య సమాజం నైతికత మీద నమ్మకం లేని వారికి కూడా విచారణా ప్రక్రియలో అనుసరించే విధానం ప్రధానమైందే. రాజకీయంగా దురదృష్టవంతులకూ ఈ ప్రక్రియ అనుసరించడం ముఖ్యమైందే. వీరు దర్యాప్తు ప్రక్రియ సవ్యంగా ఉండాలనుకుంటారు. ఆధిపత్య వర్గాల వారి పెత్తనానికి గురయ్యే వారికి దర్యాప్తులో అనుసరించే ప్రక్రియ మరింత ప్రాధాన్యత ఉన్న అంశం. వ్యవస్థాగతంగా అననుకూల పరిస్థితుల్లో ఉన్న వారికి, అణగారిన వర్గాలకు ఈ ప్రక్రియ మరింత అవసరం.

దర్యాప్తులో జాప్యం, తద్వారా చార్జి షీట్ దాఖలు చేయడం ఆలస్యం కావడం కష్టాల్లో ఉన్న వారి పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. అయినా వారికి దర్యాప్తు వ్యవస్థల మీద అపార విశ్వాసం ఉంటుంది. ఈ విశ్వాసమే దర్యాప్తు చేసే వారు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని ఆశించడానికి దారి తీస్తుంది. వారు నిరపేక్షంగా ఉండాలని కోరుకుంటారు. దర్యాప్తు చేసే వారు ఛాందసంగా వ్యవహరించ కూడదనుకుంటారు.

సాక్ష్యాన్ని నీరు గార్చడాన్ని, బలహీనమైన సాక్ష్యాధారాలను ప్రవేశ పెట్టడాన్ని ఇలాంటి వారు అనుమానించడంలో ఆశ్చర్యం లేదు. దర్యాప్తు చేసే వారు కనికరం చూపాలని వీరు కోరుకోరు. కాని కొన్ని సార్లు ఇలాంటి వైఖరి అనుసరిస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. విచారణ సందర్భంలో నిర్దిష్ట ప్రక్రియను అనుసరించాలనుకోవడం అత్యాశ కాదు.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  5 Oct 2019 4:04 PM IST
Next Story