మేఘా పై బురద జల్లేందుకు శివాజీని దింపిన టీడీపీ
నటుడు శివాజీ మరో రాజకీయ కుతంత్రానికి తాజాగా తెరలేపారా? ఇది ఆయన వెలుగులోకి తెస్తున్న దశలవారీ మరో గరుడ పురాణమా? ఆయన తాజా కుట్ర వెనుక తెలుగుదేశం భాగోతం బయటపడుతోందా….? తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో ఎప్పుడూ వ్యవహరించే ఆయన తాజాగా ఎపిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పోలవరం ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చిన మేఘా ఇంజనీరింగ్‌పై బురదజల్లేందుకు రంగంలోకి దిగారా? తద్వారా మేఘాను బ్లాక్‌మెయిలింగ్ పద్ధతిలో ఒత్తిడిచేసి, వివాదంలోకి లాగడం ద్వారా చంద్రబాబు […]
నటుడు శివాజీ మరో రాజకీయ కుతంత్రానికి తాజాగా తెరలేపారా? ఇది ఆయన వెలుగులోకి తెస్తున్న దశలవారీ మరో గరుడ పురాణమా? ఆయన తాజా కుట్ర వెనుక తెలుగుదేశం భాగోతం బయటపడుతోందా….?
తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో ఎప్పుడూ వ్యవహరించే ఆయన తాజాగా ఎపిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పోలవరం ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చిన మేఘా ఇంజనీరింగ్‌పై బురదజల్లేందుకు రంగంలోకి దిగారా? తద్వారా మేఘాను బ్లాక్‌మెయిలింగ్ పద్ధతిలో ఒత్తిడిచేసి, వివాదంలోకి లాగడం ద్వారా చంద్రబాబు చేస్తున్న ఆరోపణకు ఊతం ఇవ్వాలని ఆయన లక్ష్యంగా కొత్త అవతారం ఎత్తారా?
జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కొత్తగా మేఘా సంస్థపై చేస్తున్న ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలకు బలం చేకూరుతోంది. ఇంతవరకూ ఆయన రచించి ఘనంగా వెలుగులోకి తెచ్చిన ఏ పురాణానికి కూడా ఆధారాలు లభించకపోగా కనీసం వాటి వాసనల ఆనవాళ్ళుకూడా కనిపించలేదు. టీవీ9 లాంటి వాటిల్లో పెట్టుబడుల వ్యవహారం అయితే ఆయన ఒక మీడియా బాస్ తో కలిసి రచించిన మరో కుట్రగా తేలిపోయింది.
తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు ఆశించి, పోలవరం రివర్స్ టెండరింగ్‌పై కుట్రలో భాగంగానే ఎపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేఘా బ్లాక్‌మెయిలింగ్ గరుడ పురాణానికి శివాజి తెరలేపారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ విధమైన ఆంశాలను రాజకీయ అవసరాలకోసం సంచలనాలు సృష్టించే విధంగా లేవనెత్తడం ఆయనతోపాటు, ఎల్లోమీడియా బృందం, తెలుగుదేశం పార్టీ తెరవెనుకుండి నడిపించడం కొత్తేమీకాదనేది వారి అంచనా.
శివాజీ గరుడ, ద్రవిడ కుట్రలు కథలుగానే మిగిలాయి..
తొలుత 2018 మార్చి 22న అప్పటి ఎపి ప్రభుత్వానికి అనుకూలంగా మరీ ముఖ్యంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ట మసకబారుతుండటంతో ఆయనను కాపాడేందుకు శివాజీ గరుడ పురాణానికి తెరలేపారు. దానిని ఏడాదిన్నరపాటు ఆయన దశలవారీగా సాగించినా 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘోర ఓటమి పాలుకావడం తప్పలేదు.
ఆ పుక్కిట పురాణాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే చంద్రబాబును తద్వారా ఎపి రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తో చేతులు కలిపిందనేది ఆయన పురాణ సారాంశం. అందులో భాగంగా రాష్ట్రాన్ని అస్థిరపాలుచేసే కుట్రకు నాడు కేంద్రం ప్రయత్నించిందని ఆయన ఆరోపణ చేశారు. ఇందు కోసం ఏకంగా దాదాపు రూ 5 వేల కోట్ల రూపాయలు కేటాయించిందని వెల్లడించారు. సహజంగానే ఆయన సెలబ్రెటీ కావటంతోపాటు పచ్చ మీడియా అండదండలు ఉండటంతో దానికి విపరీత ప్రచారం లభించినా చివరకు ప్రజాదరణ లభించకపోగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై టిడిపి ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురయ్యింది.
అప్పట్లో ఆయనతో చంద్రబాబు అండ్‌కో ఆ పుక్కిట పురాణాన్ని సినిమా అవకాశాలులేక ఖాళీగా ఉన్న ఆ నటునితో చెప్పించింది. ఇక శివాజీ మాటను చంద్రబాబు 2018 సెప్టెంబర్ 8న అందుకోగా ఆ తర్వాత ఆయనతోపాటు తెలుగుదేశం శ్రేణులు కొనసాగించాయి.
2019 ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే దానికి అప్పుడు తెరదీశారు కాని చివరకు వికటించింది. దక్షిణ భారతదేశానికి ఆపరేషన్ ద్రవిడ అని ఎపి ఆపరేషన్‌కు గరుడ అని నామకరణం చేసి విస్తృత ప్రచారం కల్పించినా బాబుకు చివరకు ఛీత్కారాలే మిగిలాయి. ఆపరేషణ్ గరుడ, ద్రవిడను ఏడాదిన్నరపాటు సాగించి ప్రవచనాల తరహాలో దశలవారీగా వెల్లడించినా చివరకు ఒక్కటీ నిరూపణ కాకపోగా అన్నీ కాశీ మజిలీ కథలు, బేతాళకధలు, మాయల ఫకీర్ నాటకాలు, పిట్టల దొర మాటలు, హరికథా కాలక్షేపం, జానపథ చిత్రాలుగా మిగిలిపోయాయి.
వికటించిన జోస్యం !
అదే సమయంలో మోడిని రంగంలోకి దింపితే బిజెపి కేవలం 80 నుంచి 120 లోక్‌సభ స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని ఆయన చేసిన జోస్య పురాణం దారుణంగా విఫమయ్యింది. ఆ తర్వాత చంద్రబాబును వేధించేందుకు కేంద్ర ప్రభుత్వంలోని దర్యాప్తు సంస్థ సోమవారం నోటీసులు ఇవ్వనుందని ఆయన గత ఏడాది సెప్టెంబర్‌లో రోజుతో సహా ప్రకటించగా దానికి చంద్రబాబు కొనసాగింపు ఇచ్చారు.
కాని ఎన్నో సోమవారాలు గడిచిపోయాయి. కాని ఇప్పటికీ చంద్రబాబుకు సిబిఐ నుంచి నోటీసు రాలేదు. పోని అటువంటి ప్రయత్నమే కనిపించటంలేదు. పైగా కేంద్రంలోని బిజెపితో దగ్గరయ్యేందుకు టిడిపి ప్రయత్నిస్తూ అందులో భాగంగా తమ పార్టీ ఎంపిలనే చంద్రబాబు బిజెపిలోకి పంపించారు.
ఇక బిజెపి కూడా రాష్ట్రంలో నేరుగా టిడిపికి అనుకూలంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఇక వారికి పచ్చమీడియా ఇస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. గతంలో బిజెపికి ఆ మీడియా సింగల్ కాలం కూడా ఇచ్చేదికాదు. ఇటీవల తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్‌లో కలిస్తే బిజెపికి, ప్రధాని నరేంద్రమోడికి వ్యతిరేకంగా కలిశారని కథనాలను మరో గరుడ పుక్కిట పురాణంలాగ వండి వార్చారు.
జగన్ పై దాడి సమచారం ఓ కట్టుకధనే !
అదే సమయంలో ఓ నాయకునిపై (పరోక్షంగా జగన్‌పై) హత్యకు కుట్ర రాజకీయ ప్రయోజనాలకోసం రచిస్తున్నారని, తద్వారా రాష్ట్రంలో అలజడులు, అల్లకల్లోలం సృష్టించి ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ ఆయన కొత్త కథనం వినిపించారు.
అయితే అదే సమయంలో విశాఖలో జగన్‌పై దాడి జరిగింది. మరి ఇది ఆయనకు ముందే ఎలా తెలిసిందో ఇప్పటికీ వెల్లడించలేదు. అయితే ఆ దాడి తర్వాత ఆయన చెప్పిన విథంగా రాష్ట్రంలో అల్లర్లూ జరగలేదు, నాటి ప్రభుత్వాన్ని కేంద్రం రద్దుచేయనేలేదు. ఆయన దాడి కథను సినిమా కథ తరహాలో రచించి వెల్లడించటం వెనుక వైసీపీని, జగన్‌ను అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశ్యమే. రాజకీయ ప్రయోజనాలు ఆశించి తమంతతాముగా దాడి చేయించుకునేందుకు పథకం రచించారని ఆయన ప్రకటించినా దానిని అప్పటి టీడీపీ ప్రభుత్వమే నిరూపణ చేయలేకపోయింది.
రవిప్రకాశ్ – శివాజీ కుట్రను బయటపెట్టిన ఈ-మెయిల్స్
టీవీ 9 మాతృ సంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ని అడ్డుపెట్టుకుని పావులు కదిపిన ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీనటుడు శివాజీతో కలిసి పన్నిన కుట్ర బట్టబయలయ్యింది.
వీరిద్దరి మధ్యా కుదిరింది పాత ఒప్పందం కాదని, లా ట్రిబ్యునల్‌లో కేసు వేయడం కోసం కుట్ర చేసి, పాత తేదీతో నకిలీ షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు పక్కా సాక్ష్యాధారాలు లభించాయి. ఈ కుట్రకు సంబంధించి శక్తి అనే వ్యక్తి నుంచి, డైరెక్టర్ ఎంకేవీఎన్ మూర్తి, రవిప్రకాశ్, రవిప్రకాశ్ కు సన్నిహితుడైన హరి అనే వ్యక్తి, ఫైనాన్స్ అధికారిగా ఉన్న మూర్తి అనే మరో వ్యక్తి మధ్య బదిలీ అయిన పలు ఈ-మెయిళ్లను సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సాక్ష్యాలకోసం నకిలీ డ్రాఫ్ట్
టీవీ 9లో వారి పెట్టుబడులకు సంబంధించి వారిద్దరూ ఎన్‌సిఎల్‌టిలో దాఖలుచేసిన కేసు వీగిపోయింది. తమను పెటుబడిదారులుగా పరిగణించాలని వారు వేసిన కేసును న్యాయమూర్తి 2019 మే 24న తిరస్కరించారు. అసలు ఈ కేసుకు అనుకూలంగా తీర్పుకోసం రవిప్రకాశ్ నుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు శివాజీ ఫిబ్రవరి 20, 2018న ఒప్పందం కుదుర్చుకున్నట్లు సృష్టించిన ఒప్పందపు డ్రాప్ట్ ను వాస్తవానికి ఏప్రిల్ 13, 2019న తయారు చేశారు.
ఈ డ్రాప్ట్ ను ఆ రోజు సాయంత్రం 5:46 గంటకు ఫైనాన్స్ అధికారి మూర్తికి మెయిల్ చేసిన శక్తి… రవిప్రకాశ్, ఎంవీకేఎన్ మూర్తి, రవిప్రకాశ్ సన్నిహితుడు హరికూ కాపీలు పంపించారు. ఫిబ్రవరి 20, 2018న కుదుర్చుకున్నట్లు పాత తేదీతో చేసుకోబోయే ఒప్పందం వివరాలు ఇందులో ఉన్నాయి.
ఆ తర్వాత సాయంత్రం 6:45 గంటల నుంచి రాత్రి 9:39 గంటల మధ్య వీరందరి మధ్య మెయిల్స్ సర్క్యులేట్ అయినట్లు పోలీసుకు ఆధారాలు భించాయి. ఇక శివాజీ లా ట్రిబ్యునల్‌లో దాఖలు చేయడానికి అవసరమైన పిటిషన్ ను విజయవాడకు చెందిన ఓ అడ్వకేట్ రూపొందించగా, ఆ మరుసటి రోజున అంటే, ఏప్రిల్14, 2019న ఉదయం 5:38 గంటలకు ఆ పిటిషన్ కాపీని, అందులో చేయాల్సిన మార్పును ఈ మెయిల్లో ప్రస్తావించడంతో పాటు, తగిన మార్పు చేర్పులతో ఉదయం 9 గంటల కల్లా, విజయవాడ అడ్వకేట్ కు పంపించాల్సి ఉంటుందంటూ శక్తి … రవిప్రకాశ్, ఆయన అనుచరులకు మెయిల్ పంపించారు. అదే రోజు ఈ పిటిషన్ పై రవిప్రకాశ్ ఆయన అనుచరులు మెయిల్లో సంప్రదింపులు జరిపినట్లు పోలీసు ఆధారాలు సేకరించారు.
తాజాగా పోలవరం కథనంలోకి వస్తే …..
నటుడు శివాజీకి సినిమా అవకాశాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. తెలుగుదేశం నాయకునిగా మారిపోయి ఎన్నికల్లోనూ ప్రచారం సాగించారు. ఇక సెలబ్రెటీలు సాధారణంగా ప్రచారం కోరుకుంటారు. దానికి తోడు పచ్చమీడియా మద్దతు ఉంది. అదే సమయంలో ఎపిలోని జగన్ ప్రభుత్వం నాటి చంద్రబాబు అవినీతి అక్రమాలను వెలికితీస్తూ అందులో భాగంగా పోలవరం కాంట్రాక్టు రద్దుచేసి టెండర్లు పిలవగా మేఘా ప్రభుత్వానికి రూ 720 కోట్లు మిగిలే విధంగా బిడ్డు దాఖలు చేసింది.
చంద్రబాబు ప్రభుత్వం పోలవరం నిర్మాణంలో విఫలమైన నేపథ్యంలో పనులు యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయడమే కాకుండా అక్రమాలు, అవినీతి, అవకతవలు అరికట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వం నడుంబిగించడంతోనే వివాదం మొదలైంది.
మేఘా పై బురద చల్లడానికి క్విడ్‌ప్రోకో కుట్ర
మేఘా పై బురద చల్లడంలో భాగంగా చంద్రబాబు పోలవరం క్విడ్‌ప్రోకోను సృష్టించారు. దేశంలో మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లోనూ ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోళ్ళకు మూడేళ్ళలో రూ. 3,545 కోట్లు వ్యయం చేసేందుకు కేంద్రం నిర్ణయించగా ఆయన ఏకంగా ఏపీలోనే రూ. 7500 కోట్ల స్కామ్ పోలవరం క్విడ్‌ప్రోకో పేరిట జరుగుతోందంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే.
అసలు ఆంధ్రప్రదేశ్‌కు బస్సులు కొనుగోలులో స్వేచ్ఛ, అధికారాలు లేకపోయినప్పటికీ నేరుగా కొనేస్తుందంటూ ఆయన చెప్పటం వెనుక పోలవరం ప్రతిష్టను మంటగలపటమే ఉద్దేశం. అసలు క్విడ్‌ప్రోకో అంటూ కొత్త నామకరణం చేసేసి తమ కాలంలో జరిగిన అక్రమాలు, అవకతవకల నుంచి బయటపడేందుకు కొత్త ఆరోపణలను తెరమీదకు తెచ్చారు.
ఏపీఎస్‌ఆర్టీసి నేరుగా బస్సులు కొనుగోలు చేసే పద్ధతే లేనప్పుడు ఇక ఒలెక్ట్రా నుంచి ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయడం ఎలా సాధ్యమవుతుంది? ఆర్టీసి నష్టాలతో నడుస్తుండడంతో బస్సు కొనుగోలు విధానం నిలిపివేసి పూర్తిగా లీజు పద్ధతిలో సేకరిస్తూ ప్రయాణికుల అవసరాలు తీర్చే విధంగా నడుపుతున్నారు.
మేఘాకు చెందిన ఒలెక్ట్రా నుంచి క్విడ్ ప్రోకో పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేసే విధంగా పోలవరంలో ప్రధానమైన పనిని తక్కువ ధరకు అంటే 12.6శాతం తక్కువకు టెండర్‌ను మేఘా సంస్థ కోట్ చేసిందని ఆరోపించారు. అందులో భాగంగానే ఇప్పుడు నటుడు శివాజీ రంగంలోకి వచ్చారు. కుట్రల శివాజీ మరో కుతంత్రానికి తాజా పురాణం చెబుతున్నారు.
ఈ విధమైన కథనాలు ఆఖరుకు పచ్చమీడియా కూడా నమ్మే పరిస్థితిలేదు. దాంతో ఆయన సినిమా పద్థతిలో వీడియో క్లిప్‌ను వైరల్‌చేసే పద్థతి ఎంచుకున్నారు. అటు ఏపీ ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బతీయటం అందులో భాగంగా మేఘా మీద బురద జల్లడం ఆయన లక్ష్యం.
ఇది తెలుగు దేశం స్క్రిప్ట్‌లో భాగంగానే కనిపిస్తోంది. అందులో భాగంగా ఆయన వెలుగులోకి తెస్తున్న దశలవారీ మరో గరుడ పురాణం కానుంది. తెలుగుదేశం పార్టీ చెప్పినట్లు ఎప్పుడూ వ్యవహరించే శివాజీ తాజాగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పోలవరం ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చిన మేఘా ఇంజనీరింగ్ సంస్ధను వివాదం చేయటం ద్వారా టిడిపి ఆరోపణకు బలం చేకూర్చే పథకం ఇది.
మేఘాను బ్లాక్‌మెయిలింగ్ వివాదంలోకి లాగడం ద్వారా చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు ఊతం ఇవ్వాలన్నదే ఆయన లక్ష్యం. ఇది ఆయన నటిస్తున్నా టిడిపి రచించిన రాజకీయ కుట్రగా ఉందనే అనుమానాలకు బలం చేకూరుతోంది.