ఓడిపోతే మళ్ళీ రాను " ఉత్తమ్ కుమార్ సవాల్
హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే తాను మళ్లీ నియోజకవర్గం వైపు చూడనని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, లోక్ సభ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ చేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం తన సతీమణి, హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పద్మారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని భారీ బహిరంగ సభతో ప్రారంభించారు. “నేను నిజమైన దేశభక్తుడ్ని. 20 సంవత్సరాల పాటు దేశం కోసం పొరుగుదేశంతో పోరాడిన వీర […]
హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే తాను మళ్లీ నియోజకవర్గం వైపు చూడనని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, లోక్ సభ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ చేశారు.
నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం తన సతీమణి, హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పద్మారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని భారీ బహిరంగ సభతో ప్రారంభించారు. “నేను నిజమైన దేశభక్తుడ్ని. 20 సంవత్సరాల పాటు దేశం కోసం పొరుగుదేశంతో పోరాడిన వీర సైనికుడిని. మీలా పదవుల కోసం అమెరికా నుంచి దిగుమతి అయిన వాడ్ని కాదు” అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు. దేశం కోసం పోరాడిన తనతో స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తల పడలేరని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
తనకు సంతానం లేదని, నియోజకవర్గంలో ఉన్న వారంతా తమ పిల్లలేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. బంగారు తెలంగాణ తెస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన కుటుంబాన్నిమాత్రమే బంగారంతో నింపేశారని, ఈ పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదని ఆయన అన్నారు.
“ కేసీఆర్.. మీ పాలనలో ప్రజలు విసిగిపోతున్నారు. మీ పాలనకు చరమగీతం పాడడం హుజూర్ నగర్ నుంచి ప్రారంభం అవుతుంది” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు తరలివచ్చారని, ఇది అధికార పార్టీ భయానికి నిదర్శనమని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
“పద్మా రెడ్డిని ఓడించేందుకు నియోజకవర్గానికి ఏకంగా 70 మంది తరలివచ్చారు. ఒక్కరిని ఓడించేందుకు ఇంతమంది అవసరమా కేసీఆర్” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మా రెడ్డి 30 వేలకు పైగా మెజారిటీతో గెలవడం ఖాయమని, రానున్న 20 రోజులూ కార్యకర్తలు రాత్రీ, పగలు తేడా లేకుండా పని చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.