Telugu Global
NEWS

హుజూర్ నగర్ లో జత కడుతున్న టిఆర్ఎస్, సీపీఐ..!

హుజూర్ నగర్ ఉప ఎన్నిక రసకందాయంలో పడింది. ఇక్కడ గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ పావులు కదులుతున్నాయి. ఇన్నాళ్లూ కత్తులు దూసుకున్నవారు సైతం కౌగిలించుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఓటమి భయమో లేక ముందు జాగ్రత్త చర్యో కానీ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి సీపీఐ స్నేహ హస్తం కోరుతోంది. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న తమ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు సీపీఐ నాయకులను కోరారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ […]

హుజూర్ నగర్ లో  జత కడుతున్న టిఆర్ఎస్, సీపీఐ..!
X

హుజూర్ నగర్ ఉప ఎన్నిక రసకందాయంలో పడింది. ఇక్కడ గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ పావులు కదులుతున్నాయి. ఇన్నాళ్లూ కత్తులు దూసుకున్నవారు సైతం కౌగిలించుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఓటమి భయమో లేక ముందు జాగ్రత్త చర్యో కానీ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి సీపీఐ స్నేహ హస్తం కోరుతోంది.

ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న తమ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు సీపీఐ నాయకులను కోరారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు, లోక్ సభలో ఆ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సీపీఐ ప్రధాన కార్యాలయం ముగ్దుం భవన్ కు వెళ్లి సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఇతర సీనియర్ నాయకులను కలిశారు అధికార పార్టీ సీనియర్ నాయకులు. ముగ్దుం భవన్ కు వెళ్లి మద్దతు ఇవ్వాలని సీపీఐ నాయకులను కోరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సీపీఐ పోటీ చేయడం లేదని, దీంతో తమకు మద్దతు పలకాలి అని ఆ పార్టీ నాయకులను కోరేందుకు వచ్చినట్లుగా సమావేశం అనంతరం టిఆర్ఎస్ నాయకులు విలేకరులకు తెలిపారు.

మంగళవారం నాడు జరిగే పార్టీ కార్యవర్గ సమావేశంలో చర్చించి టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని సీపీఐ నాయకులు చెప్పారు. ఈ రెండు పార్టీల అగ్రనాయకుల సమావేశం అనంతరం విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు పలికేందుకు సీపీఐ అంగీకరించినట్లు సమాచారం.

ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న హుజూర్ నగర్ లో ఆ పార్టీని దెబ్బతీయడమే కాక… తెలంగాణలో చాపకింద నీరులా విస్తరిస్తోందంటూ భారతీయ జనతా పార్టీపై వార్తలు వస్తున్న నేపథ్యంలో …. టీఆర్ఎస్ హుజూర్ నగర్ లో విజయం సాధించి బీజేపీకి చెక్ పెట్టాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

First Published:  29 Sept 2019 8:48 PM GMT
Next Story