జగన్-కేసీఆర్ భేటీ... కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రులు జగన్‌మోహన్ రెడ్డి, కేసీఆర్ ల భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గోదావరి జలాలు కృష్ణా నదికి తరలించడంతో పాటు రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించేందుకు హైదరాబాద్ ప్రగతి భవన్‌లో ఇద్దరు సీఎంలు సమావేశం అయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు చర్చలు జరిగాయి. తొలుత 45 నిమిషాల పాటు ఇతర నాయకులు సమావేశంలో ఉన్నారు. సాయంత్రం 5.10 నుంచి రాత్రి 9గంటల వరకు ఈ భేటీ జరిగింది. ఆ తర్వాత ఇద్దరు సీఎంలు ప్రత్యేకంగా పలు […]
ముఖ్యమంత్రులు జగన్‌మోహన్ రెడ్డి, కేసీఆర్ ల భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గోదావరి జలాలు కృష్ణా నదికి తరలించడంతో పాటు రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించేందుకు హైదరాబాద్ ప్రగతి భవన్‌లో ఇద్దరు సీఎంలు సమావేశం అయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు చర్చలు జరిగాయి.
తొలుత 45 నిమిషాల పాటు ఇతర నాయకులు సమావేశంలో ఉన్నారు. సాయంత్రం 5.10 నుంచి రాత్రి 9గంటల వరకు ఈ భేటీ జరిగింది. ఆ తర్వాత ఇద్దరు సీఎంలు ప్రత్యేకంగా పలు అంశాలపై చర్చలు జరిపారు.
తిరుమల బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా సీఎం జగన్, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డిలు కేసీఆర్‌ను ఆహ్వానించారు. తెలంగాణలో ఒకేసారి 18వేల మంది కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నందున… వారిలో నాలుగు వేల మందికి ఏపీలో శిక్షణ ఇవ్వాల్సిందిగా జగన్‌ను కేసీఆర్ కోరారు. ఇందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు.
ఈ సమావేశంలో నదీ జలాల మళ్లింపుపై ప్రధాన చర్చ జరిగింది. దుమ్ముగూడెం నుంచి నాగార్జున సాగర్‌లోకి గోదావరి జలాలను తరలించాలని నిర్ణయించారు. అక్కడి నుంచి రివర్సబుల్ టర్బైన్స్ ద్వారా శ్రీశైలానికి గోదావరి జలాలను పంపించనున్నారు.
సాగర్‌లో ప్రస్తుతం గరిష్ట నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా… కనీసం 230 టీఎంసీల నీటి నిల్వను కొనసాగిస్తూ ఆపై అక్కడి నుంచి నీటిని శ్రీశైలానికి రివర్స్ టర్బైన్స్ ద్వారా తరలించడంపై ఇద్దరు సీఎంలు ఒక నిర్ణయానికి వచ్చారు.
గోదావరి జలాలను కృష్ణకు మళ్లిస్తే ఏపీలోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు సాగు, తాగు నీటి సమస్య తీరుతుంది.
పోలవరం నుంచి నాగార్జున సాగర్‌కు నీటి మళ్లింపు, రాంపూర్ నుంచి నీటిని మళ్లించే పథకంపైనా చర్చ జరిగినా… దుమ్ముగూడెం- నాగార్జుసాగర్ టెయిల్‌పాండ్ పథకం పైనే ప్రధానంగా చర్చ జరిగింది. త్వరలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, ఇంజనీర్ల బృందాన్ని పరిశీలనకు పంపించాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు.