Telugu Global
National

'మేఘా' రీటెండర్ తో ప్రభుత్వానికి 628 కోట్ల ఆదా

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ‘మేఘా’ పోల’వరం’గా మారింది. గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే 12.6% తక్కువకు అంటే 4,358 కోట్ల రూపాయల మొత్తానికి పనులు చేపట్టేందుకు మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) ముందుకొచ్చింది. దీని వల్ల ప్రభుత్వానికి 628 కోట్ల రూపాయల నిధులు ఆదా అవుతాయి. ఈ ప్రాజెక్ట్ లో జల విద్యుత్‌ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్‌ నిర్మాణ పనికి రూ. 4,987 కోట్లకు ప్రభుత్వం టెండర్‌ పిలవగా ఆ […]

మేఘా రీటెండర్ తో ప్రభుత్వానికి 628 కోట్ల ఆదా
X

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ‘మేఘా’ పోల’వరం’గా మారింది. గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే 12.6% తక్కువకు అంటే 4,358 కోట్ల రూపాయల మొత్తానికి పనులు చేపట్టేందుకు మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) ముందుకొచ్చింది. దీని వల్ల ప్రభుత్వానికి 628 కోట్ల రూపాయల నిధులు ఆదా అవుతాయి.

ఈ ప్రాజెక్ట్ లో జల విద్యుత్‌ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్‌ నిర్మాణ పనికి రూ. 4,987 కోట్లకు ప్రభుత్వం టెండర్‌ పిలవగా ఆ పనికి మేఘా ఇంజనీరింగ్‌ ఒక్కటే 4,358 కోట్ల రూపాయలకు టెండర్‌ దాఖలు చేసింది. కోర్టు అనుమతులు లభించిన వెంటనే మేఘా పనులు ప్రారంభిస్తే గడువులోగా త్వరితగతిన ప్రాజెక్టు పనులు జరిగేందుకు వీలుంటుంది.

రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌లో భాగంగా పోలవరం కాంట్రాక్టును రద్దు చేసి తిరిగి టెండర్‌ను పిలిచింది. దేశంలో ఇంతవరకు ఎక్కడా లేని విధంగా ఎల్‌-1గా వచ్చిన సంస్థ కోట్‌ చేసిన ధరను ప్రాథమిక అంచనా వ్యయంగా పరిగణనలోకి తీసుకుని దాని ఆధారంగా బిడ్డింగ్‌ నిర్వహించారు.

పోలవరం ప్రాజెక్టుతో పాటు జల విద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి గత ప్రభుత్వం ఒక నిర్మాణ సంస్థకు రూ. 2,346 కోట్లు చెల్లించింది. పనులు మాత్రం అంతంత మాత్రంగానే జరిగాయి. 2012న పోలవరం నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకున్న టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు సంస్థ ట్రాన్స్ ట్రాయ్‌ పనులు చేయలేక చేతులెత్తేసింది. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం చెప్పిన వారికి సబ్‌ కాంట్రాక్ట్‌ పనులు అప్పగించి పనుల విషయంలో నత్తకు నడక నేర్పింది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పనులను రద్దు చేసి రివర్స్‌ టెండర్ కు వెళ్లి, పోలవరం హెడ్ వర్క్స్ తో పాటు జల విద్యుత్‌ కేంద్రాలను కలిపి ప్రభుత్వం రివర్స్‌ టెండర్‌ కు పిలిచింది. ఆ పనులు విలువ రూ 4,987 కోట్లు.

ఈ పనులకు మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ ఒక్కటే బిడ్‌ దాఖలు చేసింది. ప్రభుత్వ అంచనాలకు పూర్తి భిన్నంగా 12.6 శాతం తక్కువతో రూ. 4,358 కోట్లకు పనులు చేపట్టేందుకు మేఘా ఇంజనీరింగ్‌ ముందుకొచ్చి తన సత్తాను మరోసారి చాటేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రికార్డు సమయంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని పూర్తి చేయటంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్దదయిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించటం ద్వారా ఎంఈఐఎల్‌ ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

పోలవరం బిడ్‌ ఓపెన్‌ చేసిన ప్రభుత్వం అవసరమైన ప్రక్రియను పూర్తిచేసిన వెంటనే నిర్మాణ పనులు చేపట్టేందుకు మేఘా ఇంజనీరింగ్‌ సిద్ధమౌతోంది. ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా ఈ బహుళార్ధ సాధక ప్రాజెక్టును పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో మేఘా ఇంజనీరింగ్‌ ఉంది.

పోలవరం ప్రాజెక్టును 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి, 80 టీఎంసీల గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజ్‌ ఎగువన కృష్ణా నదికి తరలించటం, 23.44 టీఎంసీల నీటిని విశాఖపట్నం నగర తాగునీటి అవసరాల నిమిత్తం తరలించటం, పోలవరం కాలువకు ఆనుకుని ఉన్న 540 గ్రామాల్లోని 28.5 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చేందుకు తాగునీరు అందించేలా నిర్మిస్తున్నారు.

ప్రభుత్వ అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు నవంబరు చివర్లో ప్రారంభించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఉంది. ఈలోగానే కాంట్రాక్టర్ తో ఒప్పందం, న్యాయ సమీక్ష జరగాలి. అక్టోబర్‌ ఒకటో తేదీ నాటికి అంటే మరో వారం రోజు లకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. బిడ్డింగ్‌ తెరిచిన వెంటనే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

ప్రభుత్వం చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ అటు ప్రభుత్వానికి, ఇటు కాంట్రాక్టర్లకు సులభమైన మార్గంగా నిలుస్తోంది. గతంలో ఏ పనికైనా టెండర్లు పిలిచినపుడు నాలుగైదు సంస్థలు టెండర్లు దాఖలు చేసేవి. అవి సమర్పించిన సాంకేతిక అర్హతలను అధికారులు పరిశీలించి ధృవీకరించేందుకు కొన్నివారాల సమయం పట్టేది. ఇపుడు రివర్స్ టెండరింగ్ లో వివరాలన్నీంటిని కంప్యూటర్ లో ఈపీసీ వెబ్ సైట్ లో పొందుపరచడం వల్ల అర్హత లేని వారు టెండర్‌ బిడ్‌ దాఖలు చేసినా ఆ బిడ్ ను సిస్టం తనంతట తానే నిరాకరిస్తుంది.

ఇదే సమయంలో కాంట్రాక్టర్‌ తనకు అన్ని సాంకేతిక అర్హతలున్నాయని తనకు తానుగా డిక్లరేషన్‌ సమర్పించాలి. ఆ తరువాత ఫైనాన్షియల్‌ బిడ్‌ సమర్పించాలి. ఒకవేళ కాంట్రాక్టర్‌ ఏవైనా తప్పుడు ధృవపత్రాలు సమర్పిస్తే వారు సమర్పించిన ధరావత్తు సొమ్ము, బ్యాంక్‌ గ్యారంటీ లు ప్రభుత్వానికి వెళ్లిపోతాయి. ఈ కారణం వల్లే మేఘా ఇంజనీరింగ్‌ తప్ప ఎవ్వరూ పోలవరం ప్రాజెక్టులో టెండర్‌ దాఖలు చేయాలేదనే వాదన బలంగా వినిపిస్తోంది.

First Published:  23 Sept 2019 5:45 AM GMT
Next Story