సీరియళ్లూ... దోమలు... మంచి నేస్తాలు !
వివిధ చానెళ్లలో వచ్చే సీరియళ్లు…. ప్రజలను కుట్టి వారిని రోగాల పాలు చేసే దోమలు మంచి స్నేహితులట. ఈ ఇద్దరి స్నేహం కారణంగా నగరాల్లో నివసిస్తున్న ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారట. అదేమిటీ సీరియళ్లకు… దోమలకు సంబంధం ఏమిటీ అనుకుంటున్నారా..! ఉంది. ఈ రెంటికి సంబంధం ఉందంటున్నారు హైదరాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ డీ.ఎస్.లోకేష్ కుమార్. ఇంకా ఆయన ఏమంటారంటే… రాత్రి వేళల్లో ఇంట్లో వారంతా సీరియళ్లు చూడడంలో లీనమైపోతున్నారని, దీంతో దోమలు కుట్టినా వారు పట్టించుకోవడం […]
వివిధ చానెళ్లలో వచ్చే సీరియళ్లు…. ప్రజలను కుట్టి వారిని రోగాల పాలు చేసే దోమలు మంచి స్నేహితులట. ఈ ఇద్దరి స్నేహం కారణంగా నగరాల్లో నివసిస్తున్న ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారట.
అదేమిటీ సీరియళ్లకు… దోమలకు సంబంధం ఏమిటీ అనుకుంటున్నారా..! ఉంది. ఈ రెంటికి సంబంధం ఉందంటున్నారు హైదరాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ డీ.ఎస్.లోకేష్ కుమార్. ఇంకా ఆయన ఏమంటారంటే… రాత్రి వేళల్లో ఇంట్లో వారంతా సీరియళ్లు చూడడంలో లీనమైపోతున్నారని, దీంతో దోమలు కుట్టినా వారు పట్టించుకోవడం లేదని అన్నారు.
“సీరియళ్లు చూసే ఆనందంలో దోమలు కుట్టినా పట్టించుకోవడం లేదు. దోమలు కూడా సీరియళ్ల సమయానికే ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్పాయి” అని కమిషనర్ లోకేష్ కుమార్ విలేకరులతో అన్నారు. సాయంత్రం కాగానే ఇళ్ల తలుపులు మూసేనుకోవాలని, దోమలు రాకుండా ఇంట్లో చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
అంతే కాదు… సాధ్యమైనంత వరకూ సీరియళ్లు చూడకుండా ఉండాలని… లేదూ సీరియళ్లు చూసినా మధ్యలో దోమల గురించి కూడా పట్టించుకోవాలని ఆయన నగర వాసులకు సూచనలు చేశారు. దోమలను నియంత్రించేందుకు జర్మనీ నుంచి యంత్రాన్ని తీసుకువస్తున్నామని, అది వచ్చిన తర్వాత వాటిని నివారించడం సాధ్యమవుతుందని కమిషనర్ చెప్పారు.
మరోవైపు దోమలు కుట్టి ఎవరైనా డెంగీ వ్యాధితో మరణిస్తే ఆ మరణాలను వెలుగులోకి తీసుకురావద్దంటూ ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ ఆసుపత్రులకు హుకుం జారీ చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వ అధికారులు హుకుం జారీ చేసినట్లుగా మీడియాలో వచ్చిన కథనాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఆర్.ఎస్. చౌహాన్, జస్టీస్ ఎ. అభిషేక్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.
” ప్రైవేట్ ఆసుపత్రులపై ఇలాంటి ఒత్తిళ్లు తీసుకువస్తే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుంది” అని ధర్మాసనం ధర్మాగ్రహం వ్యక్తం చేసింది. పత్రికల్లో వచ్చే కథనాలన్నింటిని విశ్వసించలేమని అడ్వకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్ కోర్టుకు తెలిపారు.
అయితే, ధర్మాసనం మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మీడియాలో వచ్చే కథనాల్లో కొన్ని అర్ధసత్యాలు ఉండవచ్చునని, వాటిని పరిగణలోకి తీసుకుని ప్రజాహిత వ్యాజ్యాలన్నీ వ్యతిరేకమైనవిగా పరిగణించలేమని తన అభిప్రాయం వ్యక్తం చేసింది. డెంగీ వ్యాధిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో ఈ నెల 25 లోగా కోర్టుకు తెలియజేయాలని హైకోర్టు ధర్మాసనం హుకుం జారీ చేసింది.