అనధికారిక కుల బహిష్కరణే కోడెల ప్రాణం తీసిందా?
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన కులం బాగు కోసం బాగానే ఆలోచించే వారు. స్పీకర్ హోదాలో కూడా ఆయన కమ్మ కులస్తులు బాగుండాలని ఆకాంక్షించారు. కమ్మ కులస్తులు నిర్వహించిన ఒక సమావేశంలో ”కమ్మవారు కష్టపడి తెచ్చుకున్న అధికారంలో సుధీర్ఘకాలం ఉండేలా చూసుకోవాల”ని స్పీకర్ హోదాలోనే పిలుపునిచ్చారు. అది కొన్ని పత్రికల్లో యథాతథంగా వచ్చింది. అయినా ఆయనేమి తన కులస్తుల కోసం వెనక్కు తగ్గలేదు. కోడెల అమెరికాకు వెళ్లినప్పుడు అక్కడి కమ్మవారు తమ కుల పెద్ద వచ్చినంతగా […]
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన కులం బాగు కోసం బాగానే ఆలోచించే వారు. స్పీకర్ హోదాలో కూడా ఆయన కమ్మ కులస్తులు బాగుండాలని ఆకాంక్షించారు. కమ్మ కులస్తులు నిర్వహించిన ఒక సమావేశంలో ”కమ్మవారు కష్టపడి తెచ్చుకున్న అధికారంలో సుధీర్ఘకాలం ఉండేలా చూసుకోవాల”ని స్పీకర్ హోదాలోనే పిలుపునిచ్చారు. అది కొన్ని పత్రికల్లో యథాతథంగా వచ్చింది.
అయినా ఆయనేమి తన కులస్తుల కోసం వెనక్కు తగ్గలేదు. కోడెల అమెరికాకు వెళ్లినప్పుడు అక్కడి కమ్మవారు తమ కుల పెద్ద వచ్చినంతగా సంబరపడ్డారు. ఇదంతా జరిగింది కోడెల స్పీకర్‌గా ఉంటూ చేయకూడని పనులు చేస్తున్న సమయంలోనే. సత్తెనపల్లి, నరసరావుపేటలో ‘కే ట్యాక్స్’లు వసూలవుతున్న పీడ కాలంలోనే. కానీ అప్పుడు కమ్మ సమాజం కోడెలను తమను ఉద్దరించే ప్రక్రియలో కీలక పాత్రధారిగానే వీక్షించింది.
ఇలా చంద్రబాబు చెప్పిన ప్రతి పనీ చేసినా… కమ్మ సమాజం కోసం కోడెల తపించినా… ఎన్నికల తర్వాత మాత్రం ఆయన్ను అందరూ దూరం పెడుతూ వచ్చారు. కోడెల స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు ‘కే ట్యాక్స్’ వసూలవుతోందని తెలిసినా ఏనాడు తప్పు పట్టని, కంట్రోల్ చేయని వారు… అధికారం పోయాక మాత్రం స్వార్థంతో ఆలోచించారు. చంద్రబాబు కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. తనకంటూ ఎవరు మిగిలారు అని కోడెల వెతికి చూడాల్సిన పరిస్థితి వచ్చింది.
ఏ కులం కోసమైతే కోడెల తపించారో ఆ కులం వారే ఆయన్ను దాదాపు బహిష్కరించేంత పనిచేశారు. మనం గొప్పోళ్లం అని… తమకు తాము నూరిపోసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న మీడియా విభాగాలు కూడా కోడెలను మానసికంగా ఇబ్బందిపెట్టాయి. చంద్రబాబు కనుసన్నల్లో నడిచే కమ్మవైభవం అనే మేగజైన్… ఏకంగా ”ఇక మనకేల ఈ కోడెల” అంటూ కులం నుంచి అనధికారికంగా బహిష్కరించండి అంటూ తోటి కులస్తులకు పిలుపునిచ్చింది.
ఒకప్పుడు కోడెలను తమ కుల బ్రాండ్ గా చెప్పుకున్న వారు… ఇప్పుడు కుల బహిష్కరణకు పిలుపునివ్వడం కోడెల హృదయాన్ని కంపింప చేసి ఉండే ఉంటుంది. ఈ మేగజైన్‌లో కోడెలపై అనేక తీవ్ర వ్యాఖ్యలున్నాయి. అదే సమయంలో కోడెల చేత చేయకూడని అప్రజాస్వామిక పనులు చేయించిన చంద్రబాబును మాత్రం ఈ మేగజైన్ కీర్తించింది.
రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు పనిచేసుకుపోతూ కోడెల కుటుంబం చేసిన తప్పులను గమనించలేకపోయారంటూ సర్టిఫై చేశారు. కానీ 23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను కళ్ల ముందు తిరుగుతుంటే కోడెల వేటు వేయలేదంటే ఆ పాపంలో చంద్రబాబుకు సింహభాగం దక్కదా?. కోడెల కుటుంబం కే ట్యాక్స్ వసూలు చేస్తున్న అంశం చిన్న పిల్లాడి నుంచి… జాతీయ మీడియా వరకు అందరికీ తెలిసినా చంద్రబాబుకు మాత్రం బిజీగా ఉండడం వల్ల తెలియలేదంటే నమ్మాలా?.
తనకున్న బలమైన మీడియా మూకను అడ్డుపెట్టుకుని చంద్రబాబు అండ్ టీం ఈరోజు జగన్ ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల చనిపోయారని ప్రచారం చేస్తుండవచ్చు కానీ… ఒకప్పుడు టీడీపీలో పెద్దమనిషిగా ప్రచారం చేయబడ్డ కోడెల చనిపోవడానికి ముందు చంద్రబాబు, ఆయన సామాజికవర్గం ఎలా వ్యవహరించిందో పరిశీలన చేస్తే ఆయనకు ఉరితాడును సిద్ధం చేసింది అప్పటి వరకు తనను కీర్తించిన సొంత మనుషులే అన్నది స్పష్టంగా అర్థమవుతుంది.