బొగ్గు తవ్వకాల్లో పూర్తి విదేశీ పెట్టుబడి
బొగ్గు తవ్వకాలు, అమ్మకాలలో నూటికి నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2015నాటి బొగ్గు గనుల (ప్రత్యేక అంశాల) చట్టం, 1957నాటి గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టాలకు అనుగుణంగా బొగ్గును శుద్ధి చేయడానికి సంబంధించిన ఇతర ప్రక్రియల్లో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అనుమతించడానికి ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఇంతకు ముందున్న విధానం ప్రకారం ఇంధన ఉత్పత్తికి బొగ్గును వినియోగించేంత మేరకే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అనుమతించే వారు. […]
బొగ్గు తవ్వకాలు, అమ్మకాలలో నూటికి నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2015నాటి బొగ్గు గనుల (ప్రత్యేక అంశాల) చట్టం, 1957నాటి గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టాలకు అనుగుణంగా బొగ్గును శుద్ధి చేయడానికి సంబంధించిన ఇతర ప్రక్రియల్లో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అనుమతించడానికి ప్రభుత్వం మార్గం సుగమం చేసింది.
ఇంతకు ముందున్న విధానం ప్రకారం ఇంధన ఉత్పత్తికి బొగ్గును వినియోగించేంత మేరకే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అనుమతించే వారు. ప్రధానంగా విద్యుదుత్పాదన, సిమెంటు పరిశ్రమల సొంత వినియోగానికి మాత్రమే 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే వారు. దీనికి తోడు బొగ్గు నుంచి బూడిద తొలగించే ప్రక్రియలో కూడా నూటికి నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అనుమతించే వారు.
అయితే ఇలా బూడిదను తొలగించిన బొగ్గును ఈ పరిశ్రమలు ముడి బొగ్గును సరఫరా చేయడానికి మాత్రమే వినియోగించాలి తప్ప బహిరంగ మార్కెట్ లో విక్రయించ కూడదు. ఈ ప్రభుత్వం ఆమోదించిన కొత్త విధానం ప్రకారం బొగ్గును వాణిజ్య ప్రయోజనాల కోసం బహిరంగ మార్కెట్లోనూ అమ్మొచ్చు. అనుబంధ మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా విక్రయించవచ్చు.
నూతన విధానం అనేక కారణాలవల్ల చాలా విశిష్టమైంది. మొదటిది బొగ్గు నిలవలు భారత్ లో అపారంగా ఉన్నాయి. 286 బిలియన్ టన్నుల బొగ్గు నిలవలు ఉన్నట్టు అంచనా. బొగ్గు తవ్వకాలలో మన దేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. బొగ్గు నుంచే అపారమైన విద్యుదుత్పాదన జరుగుతోంది. బొగ్గు కీలకమైన ముడి సరుకు అయినందువల్ల విద్యుదుత్పాదనా కేంద్రాలు, లోహ పరిశ్రమలు, సిమెంటు పరిశ్రమలు ఎక్కువగా వినియోగించుకుంటాయి. అందువల్ల బొగ్గు పరిశ్రమ దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఇంధన అవసరాలు ఎక్కువగా ఉన్నందువల్ల మనం బొగ్గును దిగుమతి కూడా చేసుకుంటున్నాం. కోల్ ఇండియా లిమిటెడ్ అవసరమైనంత బొగ్గు సరఫరా చేయలేక పోవడంతో పాటు తవ్వకాల లక్ష్యాలను చేరుకోలేక పోతోంది. బొగ్గు కొరత కారణంగా విద్యుదుత్పాదనా సంస్థలు తమ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోలేక పోతున్నాయి. అందువల్ల బొగ్గు దిగుమతి అనివార్యమవుతోంది.
అయితే దిగుమతి చేసుకునే బొగ్గు ధర మనం ఉత్పత్తి చేసే బొగ్గు ధరకన్నా ఎక్కువ. 2018-19లో భారత్ 235 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతి చేసుకుంది. కోస్తా తీరంలో లేని థర్మల్ విద్యుత్ కేంద్రాల కోసం కాకుండా ఇతర అవసరాలకు 8 బిలియన్ డాలర్లు వెచ్చించి 125 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతి చేసుకున్నాం.
పెరుగుతున్న ఎగుమతులు, అధిక ధరలు కరెంట్ అకౌంట్ లోటును పెంచేస్తున్నాయి. ఉదారవాద విధానాలు అనుసరించడం మొదలు పెట్టినప్పటి నుంచి విదేశీ బొగ్గు తవ్వకాల కంపెనీలు మన దేశంలోకి రావడం మొదలైంది. దీనివల్ల స్వదేశీ బొగ్గు ఉత్పత్తి పెరుగుతుందనుకుంటునారు. బొగ్గు తవ్వకాలకు కొత్త సాంకేతిక పరిజ్ఞానం కూడా అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నారు. అంతర్జాతీయ గనుల తవ్వకం దార్లు వినియోగించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందనుకుంటున్నారు. ఇది భూగర్భంలోంచి బొగ్గు వెలికి తీయడానికి ఉపకరిస్తుంది. దీనివల్ల ధరలూ తగ్గవచ్చు.
నూతన ప్రభుత్వ విధానంవల్ల మరో ప్రయోజనం ఏమిటంటే ఈ పరిశ్రమల్లో పోటీ తత్వం పెరుగుతుంది. ఇంతవరకు ఈ రంగంలో కోల్ ఇండియా లిమిటెడ్ గుత్తాధిపత్యమే కొనసాగుతోంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ. బొగ్గు తవ్వడానికి, అమ్మకానికి ఈ ఒక్క సంస్థకే అవకాశం ఉంది. ఆ తరవాత కోల్ ఇండియాతో పాటు సొంత గనులున్న ప్రభుత్వ రంగ, ప్రైవేటు రంగ కంపెనీలకు కూడా బొగ్గు తవ్వడానికి అవకాశం కల్పించారు.
ఈ కంపెనీల తవ్వకాలలో 25 శాతం బహిరంగ మార్కెట్ లో విక్రయించవచ్చు. బొగ్గు తవ్వకాలలో 70.96 శాతం వాటా ఉన్న ప్రభుత్వ రంగం 2018-19లో మొత్తం ఉత్పత్తిలో 83 శాతం ఉత్పత్తి చేసింది. దీనిలో 81 శాతం కేవలం విద్యుదుత్పాదనా కంపెనీలకే విక్రయించవలసి వచ్చింది. కోల్ ఇండియా లిమిటెడ్ తక్కువ ఉత్పత్తి లాంటి సమస్యలతో కొట్టు మిట్టాడుతోంది. పోటీలో నిలబడాలంటే ఈ సంస్థ తన నిర్వహణా వ్యయాన్ని తగ్గిచుకోవాలి.
నూతన విధానంవల్ల బొగ్గు క్షేత్రాలు కేటాయించడం, పర్యావరణం, అడవులు నరకడం, భూమి కేటాయింపు మొదలైన రంగాలలో సంబంధిత విధానాలు అమలు చేయడానికి కూడా ఉపయోగపడవచ్చు. ఎందుకంటే మారిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మాత్రమే లక్ష్యాల సాధనకు ఉపయోగపడకపోవచ్చు. కొత్త కంపెనీలు ఈ రంగంలో ప్రవేశిస్తాయి కనక నిర్ణీత వ్యవధిలో అనుమతులు మంజూరు చేసే విధానాలు కూడా రూపొందాలి. ఉత్పత్తిలో ఇబ్బందులు ఉండకుండా చూడాలి. నియంత్రణలో ముప్పు ఉందనుకునే రంగాలలోకి ప్రవేశించడానికి విదేశీ కంపెనీలు సాధారణంగా ఇష్టపడవు. ముఖ్యంగా సహజ వనరుల విషయంలో ఆ కంపెనీలు జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. భూ సేకరణ, ఇతర అనుమతుల విషయంలో ఇబ్బందులు ఎదురైతే వెదేశీ కంపెనీలు ముందుకు రావు.
ఉత్పత్తిలో ఇబ్బందులు ఉండడంవల్ల బొగ్గు గనుల విషయంలో ప్రైవేటు పెట్టుబడులు తక్కువే ఉన్నాయి. ఈ రంగంలోకి కొత్తగా ప్రవేశించే కంపెనీలు వాటిని స్వాధీనం చేసుకుని కొత్త గనులను అభివృద్ధి చేయవలసి వస్తుంది. దీనికి కొంత సమయం పడుతుంది. అప్పుడు కాని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి సాధ్యం కాదు. దీనికి పెట్టుబడులూ భారీగానే అవసరం. దీనికి తోడు వేలంలో పాల్గొనడం, పర్యావరణ అనుమతులు సంపాదించడం, మౌలిక సదుపాయాలు కావలసినంత లేకపోవడం, భూమి అందుబాటులో ఉండడం మొదలైన వాటికి సమయం పడ్తుంది కనక 100 శాతం విదేశీ పెట్టుబడులు సమకూరడం వెంటనే జరగదు. లాభాల మీద నియంత్రణ ఉండడం కూడా విదేశీ కంపెనీలకు పెట్టుబడులకు ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చు.
ఐతే సహజ వనరుల రంగంలో నిలకడగా ఉండే అభివృద్ధి సాధించాలంటే విచ్చలవిడి తవ్వకాలవల్ల పర్యావరణానికి, జీవావరణానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. 2006నాటి షెడ్యూల్డ్ జాతులు, ఇతర అటవీ వాసుల (అటవీ సంపదపై సమకూరిన హక్కు)చట్టానికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించే అవకాశం ఉందా అన్న అంశాన్ని కూడా ఆలోచించాలి. దీనివల్ల ఆదివాసులు నిర్వాసితులై ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వేటలో మనం అట్టడుగుకు చేరిపోయే ప్రమాదం ఉందేమో కూడా ఆలోచించాలి.
ఇలాంటి భయాందోళనలను నివారించి లక్ష్యాలు సాధించాలంటే నియంత్రణలు, భద్రతా చర్యలు కచ్చితంగా అమలు చేయాల్సిందే. పర్యావరణ చట్టాలకు కట్టుబడి ఉండేట్టు చూడాలి. అలాగే గని కార్మికుల ఆరోగ్యానికి, జీవితానికీ పూచీ పడాలి.
(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)