సీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కొత్త హెల్త్ యూనివర్శిటీ
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించే దిశగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరోగ్య శాఖలో తీసుకురావాల్సిన సంస్కరణల అధ్యయనానికి ఏర్పాటు చేసిన సుజాతారావు కమిటీ బుధవారం నివేదిక సమర్పించింది. 100కు పైగా సిఫార్సులతో కూడిన ఈ నివేదికపై మూడు గంటల పాటు జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టిస్‌ను రద్దు చేయాలని కమిటీ సూచించింది. ఇప్పటికే పలురాష్ట్రాల్లో ఈ నిబంధన అమలులో ఉన్న […]
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించే దిశగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరోగ్య శాఖలో తీసుకురావాల్సిన సంస్కరణల అధ్యయనానికి ఏర్పాటు చేసిన సుజాతారావు కమిటీ బుధవారం నివేదిక సమర్పించింది. 100కు పైగా సిఫార్సులతో కూడిన ఈ నివేదికపై మూడు గంటల పాటు జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టిస్‌ను రద్దు చేయాలని కమిటీ సూచించింది. ఇప్పటికే పలురాష్ట్రాల్లో ఈ నిబంధన అమలులో ఉన్న విషయాన్ని కమిటీ గుర్తు చేసింది. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టిస్ రద్దు చేసి అదే సమయంలో ప్రభుత్వ వైద్యులకు సంతృప్తికర స్థాయిలో జీతాలను పెంచాలని కమిటీ సూచించింది. ప్రభుత్వ వైద్యులకు ఎంత మేరకు వేతనాలు పెంచాలో అధికారులు నివేదిక ఇస్తే, దాని ప్రకారం పెంచి, ప్రైవేట్ ప్రాక్టీసును రద్దు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఇప్పటికే పాడేరు, గురజాల, విజయనగరంలో కొత్తగా మెడికల్ కాలేజీలకు అంగీకారం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం… వీటితో పాటు పులివెందుల, మార్కాపురం, మచిలీపట్నంలలో కొత్తగా మెడికల్ కాలేజీలను నిర్మించాలని నిర్ణయించింది.
కేంద్ర కొత్తగా దేశవ్యాప్తంగా మంజూరు చేసిన 75 మెడికల్ కాలేజీల్లో… ఏపీకి కేటాయించే అవకాశాలపై అధికారులు అనుమానం వ్యక్తం చేయగా… ‘ఎందుకు ఇవ్వరు.. మనం వెళ్లి ప్రధాన మంత్రిని కలిసి కళాశాలలు ఇవ్వాలని కోరదాం.. కచ్చితంగా ఇస్తారన్న నమ్మకముంది’ అని సీఎం వ్యాఖ్యానించారు.
ఇప్పటి వరకు ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ మాత్రమే ఉంది. ఇకపై స్విమ్స్ ఆస్పత్రి కేంద్రంగా కొత్త హెల్త్ యూనివర్శిటీని ఏర్పాటు చేసి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల మెడికల్ కాలేజీలను స్విమ్స్ వర్శిటీ పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ దిశగా వీలైనంత త్వరగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
రెండు వర్శిటీలు ఉండడం వల్ల పరిపాలన మరింత సులువు అవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇటీవల తాను రాజమండ్రికి వెళ్లినప్పుడు ఆస్పత్రి బూజుపట్టి ఉందని… చాలా పాతగా ఉందని… అలా ఉంటే ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డ ముఖ్యమంత్రి…. అలాంటి ఆస్పత్రుల రూపురేఖలు మార్చాలని ఆదేశించారు.
ఆరోగ్యశ్రీపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్. నవంబర్ 1వ తేదీ నుంచి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉన్న 150 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింతగా విస్తరిస్తామని చెప్పారు.
2020 జనవరి 1వ తేదీ నుంచి కొత్త ప్రతిపాదనలతో కూడిన ఆరోగ్యశ్రీని పైలెట్ ప్రాజెక్టు కింద పశ్చిమగోదావరి జిల్లాలో అమలు చేస్తామని… కొత్తగా అమలయ్యే ఆరోగ్యశ్రీ పథకంలో 2 వేల వ్యాధులకు వైద్యం అందిస్తామని, వెయ్యి రూపాయల బిల్లు దాటితే ఈ పథకం వర్తిస్తుందన్నారు.
అనంతరం లోటుపాట్లను సమీక్షించి 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లో దశల వారీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అప్పటి వరకు 1200 జబ్బులకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందుతుందని, ఆ తర్వాత 2 వేల జబ్బులను ఈ పథకం పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో ఈ ఏడాది డిసెంబర్ 21వ తేదీ నుంచి కొత్త కార్డులు జారీ చేస్తామని సీఎం వెల్లడించారు.
ప్రస్తుతం కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న వారికి నెలకు రూ.10 వేలు పెన్షన్ ఇస్తున్నామని, ఇకపై మరికొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికీ నెలకు రూ.5 వేలు పింఛన్ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. తలసేమియా, కుష్టు, పోలియో, బోధకాలు, పక్షవాతం…. బాధితులకు నెలకు రూ.5 వేలు పింఛన్ ఇచ్చేందుకు తగిన మార్గదర్శకాలు తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.