ఇక దేశమంతా జాతీయ పౌర రిజిస్టర్....
రోజుకో సంచలన ప్రకటన చేస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తాజాగా మరో ప్రకటనతో దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నారు. రెండు రోజుల క్రితం దేశమంతా హిందీ భాషే ఉండాలంటూ దక్షిణాది ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకున్న కేంద్ర హోం మంత్రి ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు. అదే జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ)ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. “భారతదేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను ఇక్కడి నుంచి వెళ్లగొడతాం” […]
రోజుకో సంచలన ప్రకటన చేస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తాజాగా మరో ప్రకటనతో దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నారు.
రెండు రోజుల క్రితం దేశమంతా హిందీ భాషే ఉండాలంటూ దక్షిణాది ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకున్న కేంద్ర హోం మంత్రి ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు. అదే జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ)ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.
“భారతదేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను ఇక్కడి నుంచి వెళ్లగొడతాం” అని ఆయన జార్ఖండ్ లోని రాంచీలో ప్రకటించారు. ఇటీవల అసోంలో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ)ని అమలు చేసి కేంద్రం వివాదాల పాలయ్యింది.
ఈ సందర్భంగా అసోంలో 19 లక్షల మందిని విదేశీయులుగా కేంద్రం ప్రకటించింది. అయితే ఇప్పుడు తాము కేవలం అసోంలే కాదు దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేస్తామని ప్రకటించారు.
“2019 ఎన్నికల్లో మేం ఎన్నార్సీని అమలు చేస్తామని మా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నాం. ప్రజలు మాకు అధికారాన్ని కట్టబెట్టి మాకు అక్రమ వలస దారులను దేశం నుంచి తరిమికొట్టమన్నారు” అని ఆయన అన్నారు. తాను పాల్గొన్న అన్ని ఎన్నికల ప్రచార సభలలోను ఎన్నార్సీని ప్రస్తావించానని, అది విన్న వారంతా తమకు మద్దతుగా ఓటు వేసి అధికారాన్ని అందించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.
ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇలా వెళ్లి అలా స్థిరపడిపోవడం సాధ్యం కాదని, ఇది ఒక్క భారతదేశంలోనే సాధ్యమవుతుందని అన్నారు.
“మీరు అమెరికా, రష్యా, నెదర్లాండ్స్, ఇంగ్లాండ్.. ఇలా ఎక్కడికైనా వెళ్లి స్థిరపడిపోగలరా…. చెప్పండి ” అని రాంచీలో ఆయన పాల్గొన్న సభకు వచ్చిన వారిని ప్రశ్నించారు అమిత్ షా. “దేశంలో ఇక ప్రజల కోసం జాతీయ పౌర రిజిస్టర్ అమలు చేసే సమయం వచ్చింది” అని ఆయన అన్నారు.
ఎన్నార్సీలో పేర్లు లేని నిరుపేదలు అప్పీలు చేసుకుందుకు వీలుగా తాము న్యాయసాయం కూడా అందిస్తామని అన్నారు. జాతీయ స్ధాయిలో హిందీ భాషను తాము ఎవరిపైనా బలవంతంగా రుద్దడం లేదని అమిత్ షా అన్నారు.
హిందీ భాషాదినోత్సవం సందర్భంగా హిందీపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో అమిత్ షా వాటికి వివరణ ఇచ్చారు. “మేం హిందీని బలవంతంగా రుద్దడం లేదు. మీ మాతృభాష తర్వాత హిందీని రెండో భాషగా చేర్చుకోవాలి” అని ఆయన అన్నారు.