రాజధానిలో టీడీపీ పెద్దల భూములపై పరిశీలనకు బృందాలు
రాజధాని ఎక్కడ వస్తుందన్నది ముందే తెలుసుకుని టీడీపీ పెద్దలు సాగించిన ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు హెరిటేజ్ కంపెనీకి, బాలకృష్ణ చిన్నల్లుడి కంపెనీకి, సుజనాచౌదరికి చెందిన వందల ఎకరాల గుట్టు బయటపడింది. ఇంకా అనేక మంది వందల ఎకరాలను ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో కొన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నారాయణ ఏకంగా 3000 ఎకరాలు కొన్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని పరిధిలోని భూములను స్కాన్ చేస్తోంది ప్రభుత్వం. రాజధాని ప్రకటనకు ముందు సీఆర్ డీఏ […]
రాజధాని ఎక్కడ వస్తుందన్నది ముందే తెలుసుకుని టీడీపీ పెద్దలు సాగించిన ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఇప్పటికే చంద్రబాబు హెరిటేజ్ కంపెనీకి, బాలకృష్ణ చిన్నల్లుడి కంపెనీకి, సుజనాచౌదరికి చెందిన వందల ఎకరాల గుట్టు బయటపడింది. ఇంకా అనేక మంది వందల ఎకరాలను ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో కొన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నారాయణ ఏకంగా 3000 ఎకరాలు కొన్నట్టు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో రాజధాని పరిధిలోని భూములను స్కాన్ చేస్తోంది ప్రభుత్వం. రాజధాని ప్రకటనకు ముందు సీఆర్ డీఏ ప్రాంతంలో జరిగిన లావాదేవీలపై ఆరా తీస్తోంది.
ఇందుకోసం అధికార బృందాలు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నాయి. పలు గ్రామాలకు వెళ్లి భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగానే కంచికచర్ల మండలంలోని చెవిటికల్లు, మోగులూరు, మున్నలూరు, బత్తినపాడు తదితర గ్రామాల పరిధిలో అధికారులు పర్యటించారు. రైతులతో మాట్లాడి పలు వివరాలను సేకరించారు.
కంచికచర్ల మండలంలో ఎంపీ సుజనాచౌదరి వందల ఎకరాలు కొనుగోలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ మండలంలోనే అధికార బృందాలు పర్యటించడం బట్టి సుజనాచౌదరి గుట్టును మొత్తం వెలికి తీస్తున్నారని భావిస్తున్నారు.
సుజనాచౌదరి ఎవరి నుంచి ఆ భూములను కొన్నారు? కొనే సమయంలో ఏం చెప్పి కొన్నారు? ఈ భూముల క్రయవిక్రయాల్లో పాత్ర పోషించిన బ్రోకర్లు ఎవరు? వంటి అంశాలను కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.
అయితే ఇలా భూములను పరిశీలించేందుకు వచ్చిన అధికారులు స్థానికులు కాదు. ప్రత్యేకంగా ఇతర ప్రాంతాల నుంచి బృందాలు వచ్చాయని… వారికి స్థానిక సిబ్బంది సహకరిస్తున్నారని కంచికచర్ల తహసీల్దార్ చెప్పారు. ప్రభుత్వ బృందాలు ఇలా రాజధాని ప్రాంతంలోని భూముల వివరాలను వెలికితీసేందుకు పర్యటిస్తున్నాయన్న వార్త టీడీపీ నేతలకు ఆందోళన కలిగిస్తోంది.