Telugu Global
NEWS

విరాట్ కొహ్లీ... స్టీవ్ స్మిత్... ఎవరు గొప్ప?

టెస్ట్ క్రికెట్ ప్రపంచ నంబర్ వన్ స్టీవ్ స్మిత్ మూడుఫార్మాట్ల మొనగాడు విరాట్ కొహ్లీ సమకాలీన క్రికెట్లో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ, ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అత్యంత నిలకడగా రాణిస్తూ తమకుతామే సాటిగా నిలుస్తున్నారు. టెస్ట్ , వన్డే, టీ-20 ఫార్మాట్లలో విరాట్ కొహ్లీ, టెస్ట్ క్రికెట్లోస్టీవ్ స్మిత్ ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లుగా తమ ప్రత్యేకతను చాటుకొంటున్నారు. దూసుకొచ్చిన స్టీవ్ స్మిత్.. బాల్ టాంపరింగ్ ఆరోపణలతో గత ఏడాది కాలం శిక్ష […]

విరాట్ కొహ్లీ... స్టీవ్ స్మిత్... ఎవరు గొప్ప?
X
  • టెస్ట్ క్రికెట్ ప్రపంచ నంబర్ వన్ స్టీవ్ స్మిత్
  • మూడుఫార్మాట్ల మొనగాడు విరాట్ కొహ్లీ

సమకాలీన క్రికెట్లో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ, ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అత్యంత నిలకడగా రాణిస్తూ తమకుతామే సాటిగా నిలుస్తున్నారు.

టెస్ట్ , వన్డే, టీ-20 ఫార్మాట్లలో విరాట్ కొహ్లీ, టెస్ట్ క్రికెట్లోస్టీవ్ స్మిత్ ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లుగా తమ ప్రత్యేకతను చాటుకొంటున్నారు.

దూసుకొచ్చిన స్టీవ్ స్మిత్..

బాల్ టాంపరింగ్ ఆరోపణలతో గత ఏడాది కాలం శిక్ష అనుభవించడం ద్వారా స్టీవ్ స్మిత్ క్రికెట్ కు దూరమయ్యాడు. దీంతో టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంక్ నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. మరోవైపు భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ తారాజువ్వలా దూసుకొచ్చి టాప్ ర్యాంకర్ గా నిలిచాడు. అంతేకాదు గత ఏడాది కాలంగా నంబర్ వన్ ర్యాంక్ ను కొహ్లీ నిలుపుకొంటూ వచ్చాడు.

నిషేధ కాలం ముగియడంతో…ఇంగ్లండ్ తో యాషెస్ సిరీస్ ద్వారా స్టీవ్ స్మిత్ పడిలేచిన కెరటంలా దూసుకొచ్చాడు. సిరీస్ లో భాగంగా ఆడిన నాలుగు టెస్టుల్లోనే స్మిత్ విశ్వరూపం ప్రదర్శించాడు.

మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు, ఓ డబుల్ సెంచరీతో సహా 774 పరుగులు సాధించి..ప్లేయర్ అఫ్ ది సిరీస్ అందుకొన్నాడు. అంతేకాదు… భారత కెప్టెన్ విరాట్ కొహ్లీని రెండో ర్యాంక్ కు నెట్టి..తిరిగి నంబర్ వన్ ర్యాంక్ కైవసం చేసుకోగలిగాడు.

రెండుస్తంభాలాట…

ఐసీసీ టెస్ట్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం..స్టీవ్ స్మిత్ 937 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. విరాట్ కొహ్లీ కంటే 34 పాయింట్లతో ముందున్నాడు. యాషెస్ సిరీస్ కు ముందు 857 పాయింట్లతో నాలుగోర్యాంకర్ గా ఉన్న స్మిత్…సిరీస్ తర్వాత 937 పాయింట్లతో టాప్ ర్యాంక్ అందుకోడం విశేషం.

టెస్ట్ క్రికెట్లో 26 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు సాధించిన ఘనత స్మిత్ కు ఉంది. ముప్పైఏళ్ల స్టీవ్ స్మిత్ కు కేవలం 68 టెస్టుల్లోనే 26 టెస్టులు, 27 హాఫ్ సెంచరీలు సాధించిన ఘనత ఉంది.

త్రీ-ఇన్- వన్ విరాట్ కొహ్లీ…

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీకి మూడుఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తున్న టాప్ ర్యాంక్ క్రికెటర్ గా పేరుంది. 30 సంవత్సరాల విరాట్ కొహ్లీకి ఇప్పటి వరకూ ఆడిన 79 టెస్టుల్లో 25సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలతో 6749 పరుగులు సాధించిన రికార్డు ఉంది.

అంతేకాదు..వన్డే క్రికెట్లో 239 మ్యాచ్ లు ఆడి 43 శతకాలు, 54 అర్థశతకాలు సాధించాడు. టీ-20లో 70 మ్యాచ్ లు ఆడి 21 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

పోలికే లేదు- సౌరవ్

విరాట్ కొహ్లీతో స్టీవ్ స్మిత్ ను పోల్చడం తగదని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అంటున్నాడు. ఎవరి గొప్ప వారిదేనని, ఈ ఇద్దరి రికార్డులు చూస్తేనే తెలుస్తుందని చెప్పాడు.

విరాట్ కొహ్లీ క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తుంటే…స్మిత్ టెస్ట్ క్రికెట్లో పరుగుల మోత మోగిస్తున్నాడని తెలిపాడు.
మరోవైపు..ఆస్ట్ర్రేలియా మీడియా మాత్రం…కొహ్లీ కంటే స్టీవ్ స్మిత్ అత్యుత్తమ ఆటగాడంటూ ఆకాశానికి ఎత్తేస్తోంది.

ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా…ఆధునిక క్రికెట్ కు కొహ్లీ, స్మిత్ రెండు కళ్లు లాంటివారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  17 Sept 2019 8:03 AM IST
Next Story