ఉత్తమ్ భార్యే హుజూర్ నగర్ అభ్యర్థి... మరి గులాబీ అభ్యర్థి ఎవరు ?
తెలంగాణలో మరో ఉప ఎన్నికకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. హుజూర్‌నగర్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఎంపీగా విజయం సాధించారు. దీంతో ఆయన హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసి దాదాపు మూడు నెలలు దాటింది. మరో మూడు నెలల్లో హుజూర్ నగర్‌కు ఉప ఎన్నిక రాబోతుంది. ఉత్తమ్ సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్. కాంగ్రెస్ […]
తెలంగాణలో మరో ఉప ఎన్నికకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. హుజూర్‌నగర్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఎంపీగా విజయం సాధించారు. దీంతో ఆయన హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసి దాదాపు మూడు నెలలు దాటింది. మరో మూడు నెలల్లో హుజూర్ నగర్‌కు ఉప ఎన్నిక రాబోతుంది.
ఉత్తమ్ సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్. కాంగ్రెస్ నుంచి ఇక్కడ ఎవరు పోటీ చేస్తారని మొదటి దాకా సస్పెన్స్ ఉండేది. జానారెడ్డి లేదా ఇతరులు కూడా ఇక్కడి నుంచి బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి… అయితే వీటికి ఇప్పుడు ఉత్తమ్ పుల్‌స్టాప్ పెట్టారు. రాబోయే ఉప ఎన్నికల్లో తన భార్య పద్మావతి రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు.
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నక్కగూడెంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఉత్తమ్ ఈ విషయం చెప్పారు. ఉప ఎన్నిక ప్రచారానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వస్తారని…కార్యకర్తలు కలిసి పనిచేయాలని ఉత్తమ్ కోరారు.
ఉత్తమ్ భార్య పద్మావతి రెడ్డి 2014లో కోదాడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 డిసెంబర్ ఎన్నికల్లో ఓడిపోయారు. నల్గొండ ఎంపీ బరిలో ఈమె పోటీ చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఉత్తమ్ పోటీ చేయాల్సి వచ్చింది.
ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. ఇక టీఆర్ఎస్ క్యాండేట్ ఎవరూ అనేది తేలాల్సి ఉంది. ఇక్కడి నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం ఉండేది. కానీ ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. మండలి చైర్మన్ సీట్లో కూర్చొన్నారు. దీంతో ఇప్పుడు గత ఎన్నికల్లో ఉత్తమ్‌కు గట్టి పోటీ ఇచ్చిన ఎన్ఆర్ ఐ సైదిరెడ్డి మరోసారి పోటీ చేసే అవకాశం కన్పిస్తోంది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్ రెడ్డికి 92,996 ఓట్లు వస్తే…. సైదిరెడ్డికి 85,530 ఓట్లు వచ్చాయి. ఏడు వేలకు పైగా చిలుకు ఓట్ల తేడాతో ఉత్తమ్ గెలిచారు. దీంతో ఈ సీటు గెలిచేందుకు ఈ సారి గులాబీసేన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.
ఇక్కడి నుంచి బీజేపీ నుంచి మైక్ టీవీ సీఈవో, ఎన్ఆర్ ఐ అప్పిరెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. ఈయన గత ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. దీంతో ఈసారి బీజేపీ నుంచి పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈయన పోటీ చేస్తే ఎవరి ఓట్లు చీలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.