సీఎం జగన్ పాలన భేష్.... నీతి అయోగ్ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాలన అద్భుతంగా ఉందని, ఆయనకున్న విజన్ చాలా గొప్పగా ఉందని నీతి అయోగ్ కితాబునిచ్చింది. “ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాలన, దూరదృష్టి నన్ను ఎంతోగానో ఆకట్టుకున్నాయి. కేవలం మూడు నెలలలోనే జగన్ పాలనలో తనదైన ముద్ర వేశారు” అని నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రశంసించారు. వివిధ కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు రాష్ట్ర్ర ప్రభుత్వ అధికారులతో పలు అంశాలపై చర్చించేందుకు రాజధాని అమరావతికి వచ్చిన నీతి అయోగ్ […]
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాలన అద్భుతంగా ఉందని, ఆయనకున్న విజన్ చాలా గొప్పగా ఉందని నీతి అయోగ్ కితాబునిచ్చింది.
“ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాలన, దూరదృష్టి నన్ను ఎంతోగానో ఆకట్టుకున్నాయి. కేవలం మూడు నెలలలోనే జగన్ పాలనలో తనదైన ముద్ర వేశారు” అని నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రశంసించారు.
వివిధ కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు రాష్ట్ర్ర ప్రభుత్వ అధికారులతో పలు అంశాలపై చర్చించేందుకు రాజధాని అమరావతికి వచ్చిన నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రితో పాటు ఉన్నతాధికారులో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన రాజీవ్ కుమార్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి విజన్, అంకితభావం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు.
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత సాయం చేయాలో అంతా చేస్తాం. రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్లేలా మేం సహాయం చేస్తాం” అని రాజీవ్ కుమార్ అన్నారు.
రాష్ట్రంలో నిరక్షరాస్యత చాలా ఎక్కువగా ఉందని, ఇది జాతీయ స్ధాయి కంటే ఎక్కువగా ఉండడం తమను ఆందోళనకు గురి చేస్తోందని అన్నారు.
“ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న వెంటనే జగన్ విద్యాశాఖ ప్రక్షాళనపై చర్యలు తీసుకుంటున్నారు. అక్షరాస్యత పెంచడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది నన్ను వ్యక్తిగతంగా కూడా ఆకట్టుకుంది” అని రాజీవ్ కుమార్ ప్రశంసించారు.
ఇదేవిధంగా పారిశ్రామికంగా కూడా ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉందని, దీనిని మార్చాలని అభిప్రాయపడ్డారు. అలాగే జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ను తాను ఎంతో ఇష్టపడతానని, దీన్ని తాము ప్రోత్సహిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఉన్నట్లు తాము గుర్తించామని…. బడ్జెట్ కాకుండా చేస్తున్న ఖర్చులు గతంలో చాలా ఎక్కువగా ఉండేవని, వాటిని తగ్గించుకోవాలని నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ సూచించారు. “పెట్టుబడులు ఆకర్షించడంలోను, పబ్లిక్ రుణాలు వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది” అని రాజీవ్ కుమార్ తెలిపారు.
రాష్ట్ర్రంలోని మహిళల ఆరోగ్య పరిస్థితి కాసింత ఆందోళనకరంగా ఉందని, మహిళల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఇందుకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని, బియ్యం, వంటనూనెల్లో ఖనిజ లవణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాజీవ్ కుమార్ సూచించారు.