కూలుతున్న బాబా రాందేవ్ వ్యాపార సామ్రాజ్యం... తగ్గిన పతంజలి సేల్స్ !
బాబా రాందేవ్ పతంజలి మార్కెట్ రోజురోజుకు పడిపోతోంది. ఆయుర్వేద ఉత్పత్తుల సేల్స్ తగ్గిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే పట్టణ మార్కెట్‌లో పతంజలి ఉత్పత్తులు గణనీయంగా తగ్గాయి. ఇదే విషయాన్ని ప్రపంచ వినియోగదారుల అధ్యయన సంస్థ కంటార్ వాల్డ్ ప్యానెల్ తన నివేదికలో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో మూడో స్థానానికి పడిపోయిందని తెలిపింది. 2009లో పతంజలి ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేశారు. నిత్యావసర వస్తువుల కేటగిరిలో స్వదేశీ బ్రాండ్‌తో పతంజలి అడుగుపెట్టింది. ఐదేళ్లలోనే రెండో స్థానానికి చేరింది. […]
బాబా రాందేవ్ పతంజలి మార్కెట్ రోజురోజుకు పడిపోతోంది. ఆయుర్వేద ఉత్పత్తుల సేల్స్ తగ్గిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే పట్టణ మార్కెట్‌లో పతంజలి ఉత్పత్తులు గణనీయంగా తగ్గాయి. ఇదే విషయాన్ని ప్రపంచ వినియోగదారుల అధ్యయన సంస్థ కంటార్ వాల్డ్ ప్యానెల్ తన నివేదికలో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో మూడో స్థానానికి పడిపోయిందని తెలిపింది.
2009లో పతంజలి ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేశారు. నిత్యావసర వస్తువుల కేటగిరిలో స్వదేశీ బ్రాండ్‌తో పతంజలి అడుగుపెట్టింది. ఐదేళ్లలోనే రెండో స్థానానికి చేరింది. నిత్యావసర వస్తువల కేటగిరిలో హిందూస్తాన్ లీవర్ మొదటి ప్లేస్‌లో ఉంటే…పతంజలి రెండో ప్లేస్‌ను ఆక్రమించింది.
2016-17 సంవత్సరంలో పతంజలి ఆదాయం పదివేల కోట్లు . ఆ తర్వాత ఏడాది 20 వేల కోట్లకు ఆదాయం చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అయితే 2017-18లో కేవలం 8100 కోట్ల ఆదాయాన్ని మాత్రమే పతంజలి ఆర్జించింది. 2018-19లో తొమ్మిది నెలల ఆదాయం 4700 కోట్లకు పడిపోయింది. ఇక మూడు నెలలు మాత్రమే మిగిలింది. దీంతో గత ఏడాది కంటే పతంజలి ఆదాయం భారీగా తగ్గిందని తెలుస్తోంది.
వాణిజ్య ప్రకటనల విభాగంలో కూడా పతంజలి హవా మొన్నటివరకూ నడిచింది. యాడ్ ఎక్స్ ఇండియా నివేదిక ప్రకారం 2016లో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, రేడియోకు యాడ్స్ ఇచ్చిన కంపెనీల్లో పతంజలి మూడో స్థానంలో నిలిచింది. 2018లో 11 వ ప్లేస్, 2019లో 40వ ర్యాంకుకు పడిపోయింది.
మరోవైపు గత తొమ్మిది నెలల కాలంలో పతంజలి నుంచి ఒక్క కొత్త ప్రొడక్ట్ కూడా రాలేదు. గతంలో హైప్ క్రియేట్ చేసిన బేబి ప్రొడక్ట్స్ అమ్మకాలు కూడా నిలిచిపోయాయి. ఢిల్లీ మార్కెట్‌లో బేబి ప్రొడక్ట్స్ కనిపించడం లేదు. మూడు నెలల నుంచి ఆన్‌లైన్‌లో కూడా ఈ ఉత్పత్తులు కనిపించడం లేదు.
పతంజలి రిటైల్ షాపు ఓనర్లు కూడా ఒక్కొక్కరు షాపులు మూసివేస్తున్నారు. హైదరాబాద్ లోని ఒక పతంజలి షాపు ఓనర్ 2015లో రిటైల్ షాప్ తెరిచారు. కొత్తలో నెలకు 15వేల దాకా ప్రొడక్ట్స్ అమ్ముడుపోయేదని…ఇప్పుడు 4 వేల నుంచి 5 వేల వరకు మాత్రమే అమ్మకాలు సాగుతున్నాయని ఆయన వాపోయారు. షాప్ రెంట్ కూడా ఇప్పుడు రావడం లేదని ఆయన అన్నారు.
ప్రణాళిక లేకుండా విస్తరణ చేపట్టడం, అమ్మకాలకు సరైన పద్ధతి లేకపోవడం, పటిష్టమైన సప్లయ్ వ్యవస్థ లేకపోవడం, ప్రొడక్ట్‌లో నాణ్యత మెయిన్ టెయిన్ చేయలేకపోవడం, రాంగ్ బిజినెస్ మోడల్ ఫాలో అవడం పతంజలి ఉత్పత్తుల గిరాకీ తగ్గడానికి కారణమని నిపుణులు అంటున్నారు.
అయితే 2021 నాటికి తిరిగి పతంజలి పూర్వ వైభవం చూస్తారని ఆ కంపెనీ అధికారులు చెబుతున్నారు. మాంద్యంతో పాటు ఇతర పరిస్థితులను అధిగమిస్తామని ధీమాగా చెబుతున్నారు.