Telugu Global
Others

రాజకీయాల్లో ఆలోచనా రాహిత్యం

కేంద్రంలో అధికార పీఠంపై సుస్థితంగా ఉన్న భారతీయ జనతా పార్టీ దేశంలోని రాజకీయాలలో, ప్రజా జీవనంలో కీలకమైన కొన్ని రంగాలకు సంబంధించి ప్రధానమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రతిపక్షాలు నిర్ణయాత్మకంగా వ్యవహరించకపోవడంవల్ల కూడా ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటూ ఉండవచ్చు. ఎన్నికలు ముగిసిన తరవాత జరిగే పరిణామాలపై మీడియాలో వచ్చే వ్యాఖ్యానాలు కొన్ని అంశాలకే పరిమితం కావడంతో పాటు పూత మెరుగుల్లాగే ఉంటాయి. ఆ వ్యాఖ్యానాలు చాలా వరకు తాత్కాలికమైనవిగా ఉంటాయి తప్ప పరిణామాత్మకంగా ఉండవు. అవి అంతర్భూతంగా […]

రాజకీయాల్లో ఆలోచనా రాహిత్యం
X

కేంద్రంలో అధికార పీఠంపై సుస్థితంగా ఉన్న భారతీయ జనతా పార్టీ దేశంలోని రాజకీయాలలో, ప్రజా జీవనంలో కీలకమైన కొన్ని రంగాలకు సంబంధించి ప్రధానమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రతిపక్షాలు నిర్ణయాత్మకంగా వ్యవహరించకపోవడంవల్ల కూడా ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటూ ఉండవచ్చు.

ఎన్నికలు ముగిసిన తరవాత జరిగే పరిణామాలపై మీడియాలో వచ్చే వ్యాఖ్యానాలు కొన్ని అంశాలకే పరిమితం కావడంతో పాటు పూత మెరుగుల్లాగే ఉంటాయి. ఆ వ్యాఖ్యానాలు చాలా వరకు తాత్కాలికమైనవిగా ఉంటాయి తప్ప పరిణామాత్మకంగా ఉండవు. అవి అంతర్భూతంగా ఉండొచ్చు కానీ సర్వోత్కృష్టమైనవి కాకపోవచ్చు. అయితే సమకాలీన పరిస్థితులను బట్టి చూస్తే రాజకీయాల గురించి ఆలోచించినప్పుడు లోతైన సమస్యలు కనిపిస్తాయి.

ఎన్నికల తరవాతి పరిస్థితి చూస్తే మననశీలమైన ఆలోచనల కన్నా స్వలాభేపక్షతో చేసే ఆలోచనలే ఎక్కువ. ఇది విచారకరం. అధికారంలో ఉన్న పార్టీ స్వలాభేపక్షతో ఆలోచించడం సహజం. ప్రతిపక్షాలు సైతం అలాగే వ్యవహరించడం ఆశ్చర్యంగా ఉంది. అధికార పక్షం గత అయిదేళ్ల పైబడి ఇలా స్వలాభేపక్షతోనే నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ పని చేసేటప్పుడు అధికార పక్షం “సామాన్య మానవుల”ను ముడి సరుకుగా మాత్రమే చూస్తుంది. వీరిని ఎన్నికల ప్రయోజనాల కోసం వినియోగించుకోవచ్చునని భావిస్తుంది. ఆ తరవాత సామాన్య ప్రజలను రాజకీయ, సామాజిక భ్రమల్లో పడేస్తుంది. అధికారంలో కొనసాగాలనుకునే వారికి ఇదే ఆలోచన ఉంటుంది. అధికార పక్షం మననశీల రాజకీయ ఆలోచనకు అవకాశం ఇవ్వకపోవచ్చు.

అయితే ప్రతిపక్షాల ఆలోచనా ధోరణి కూడా దీనికి భిన్నంగా ఉండకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆలస్యంగానైనా ఆలోచించింది. అయితే ఆ పార్టీ ఆలోచన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎవరుండాలి అన్న అంశం చుట్టే తిరిగింది. సామాన్య మానవుల విషయంలో కాంగ్రెస్ ఆలోచించి ఉండాల్సింది అని భావిస్తాం. సామాన్యుడి దృష్టిలో తన స్థానం ఏమిటో ఆలోచించాలనుకుంటాం. అంతర్గత వ్యవహారాల గురించి ఆలోచించడంలోనే కాంగ్రెస్ చాలా కాలయాపన చేసింది. కాస్త ఆగి ఆలోచించేటట్టయితే కేవలం ఆచరణాత్మక రాజకీయ ఆలోచనలకు పరిమితం అయ్యేది కాదు.

అధికార పక్షంలా కాకుండా ప్రతిపక్షం కాస్త సమయం తీసుకున్నా అంతర్గత విషయాలపై ఆలోచించి ఉండొచ్చు. జాప్యం ఉన్నా ఆలోచిస్తే ప్రజాస్వామ్యానికి మేలు కలుగుతుంది. కాని ఆ జాప్యం మరీ ఎక్కువైతే అసలు విషయాలను పట్టించుకోని స్థితికి చేరవచ్చు. అలా జరగనప్పుడు ప్రజాస్వామ్యం అవసరం ఉన్న వారు వాట్స్ ఆప్ లో జరిగే రాజకీయ నాయకుల ప్రచారంతో సంతృప్తి పడవలసి వస్తుంది. అసలు మౌలికమైన ప్రశ్న ఏమిటంటే మనకు రాజకీయ నాయకుల అవసరం ఏమిటి?

ప్రజా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో రాజకీయంగా చొరవ చూపాల్సింది ఎప్పుడూ కొద్ది మందే. అందరూ ఆ పని చేయరు. అందరూ పరిపాలించకపోవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో పాలకులు ఏం చేయాలో చెప్పాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. రాజకీయాధికారం వంశ పారంపర్యమైంది కాదు. ఒక పార్టీ లేదా కొందరు నాయకులు చేసే పని మీద అధికారం ఆధారపడి ఉంటుంది. కానీ అధికారంలో ఉన్న వారు సామాన్యులను పరిపాలించే అధికారం తమకే ఉందనుకుంటారు. సామాన్యులు మిన్నకుండి అధికార పక్షాన్ని విమర్శనాత్మక దృష్టితో చూడకపోతే అధికార పార్టీ తమ అధికారాన్ని పొడిగించుకోవాలనే అనుకుంటుంది. అయితే ప్రజలకు విమర్శనాత్మకంగా చూసే అవకాశం ఉందా అన్నదే ప్రశ్న.

లోతుగా ఆలోచించాలంటే నింపాదిగా విషయాన్ని గ్రహించగలగాలి. మననశీలమైన ఆలోచన తాజా వార్తలంత వేగంగా ఉండదు. ఇలా నింపాదిగా ఆలోచించే అవకాశం సామాన్యులకు ఉండకపోవచ్చు. సామాజిక మాధ్యమాలను వేగవంతంగా ఉపయోగించుకునే వారు తమ నైతిక శక్తి ద్వారా కాకుండా తమ సిద్ధాంత బలిమి మీద ఆధారపడతారు.

వాట్స్ ఆప్ లాంటి విషయ ప్రసార మాధ్యమాలు సమాచార స్రవంతుల్లాగో, విజ్ఞాన నిధుల్లాగో కనిపించవచ్చు. అయితే ఈ మాధ్యమాలు ఏవీ లోతైన ఆలోచనకు అవకాశం ఇవ్వవు. లోతులకు వెళ్లి ఆలోచించడం నైతిక బాధ్యత. ఎందుకంటే ఏ సమస్యకూ సులభమైన పరిష్కారాలు ఉండవు. ఇలాంటి విషయ ప్రసార మాధ్యమాలు ఉపయోగపడనూ వచ్చు. సంకెళ్లుగా మారనూ వచ్చు. ఎన్నికల తరుణంలో ఇవి అత్యంత వేగంతో పని చేస్తాయి. కానీ లోతైన ఆలోచనకు అవకాశం ఇవ్వవు. వాట్స్ ఆప్ తాత్కాలికంగానైనా రాజకీయాల దిశను నిర్దేశిస్తాయి. అది తాత్కాలికమే కావచ్చు. కానీ ఆలోచించే సామర్థ్యం ఉన్న ప్రజల జ్ఞానాన్ని ఇవి అడ్డుకోలేవు.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  10 Sept 2019 12:40 AM IST
Next Story