Telugu Global
NEWS

భారత క్రికెట్ కోచ్ లకు వద్దంటే డబ్బు

రవి శాస్త్రికి 20 శాతం పెరగనున్న జీతం భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడు రవిశాస్త్రి, ఇతర శిక్షకులతో పాటు సహాయ సిబ్బందికి 10నుంచి 20 శాతం మేరకు జీతాలు పెంచాలని బీసీసీఐ పాలకమండలి నిర్ణయించింది. 2017 సీజన్ నుంచి భారత క్రికెట్ చీఫ్ కోచ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ ల కాంట్రాక్టు ను వచ్చే టీ-20 ప్రపంచకప్ వరకూ కొనసాగించాలని నిర్ణయించడంతో వార్షిక కాంట్రాక్టు వేతనం మొత్తాన్ని సైతం […]

భారత క్రికెట్ కోచ్ లకు వద్దంటే డబ్బు
X
  • రవి శాస్త్రికి 20 శాతం పెరగనున్న జీతం

భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడు రవిశాస్త్రి, ఇతర శిక్షకులతో పాటు సహాయ సిబ్బందికి 10నుంచి 20 శాతం మేరకు జీతాలు పెంచాలని బీసీసీఐ పాలకమండలి నిర్ణయించింది.

2017 సీజన్ నుంచి భారత క్రికెట్ చీఫ్ కోచ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ ల కాంట్రాక్టు ను వచ్చే టీ-20 ప్రపంచకప్ వరకూ కొనసాగించాలని నిర్ణయించడంతో వార్షిక కాంట్రాక్టు వేతనం మొత్తాన్ని సైతం పెంచాలని పాలకమండలి భావిస్తోంది.

రవి శాస్త్రికి ఇక 10 కోట్ల వేతనం…

గత రెండు సంవత్సరాలుగా ఏడాదికి 8 కోట్ల రూపాయల వేతనం అందుకొంటూ వస్తున్న 57 సంవత్సరాల రవిశాస్త్రికి 20 శాతం మేర జీతం పెరిగే అవకాశం ఉంది. 9 కోట్ల 50 లక్షల నుంచి 10 కోట్ల రూపాయల వరకూ వార్షిక వేతనం అందుకోనున్నాడు.

రవిశాస్త్రి శిక్షణలో భారతజట్టు ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ ర్యాంక్ సాధించడంతో పాటు.. ఆస్ట్ర్రేలియాను ఆస్ట్ర్రేలియా గడ్డపై ఓడించడం ద్వారా టెస్ట్ సిరీస్ విజయం సాధించింది.

ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ లో సైతం ఆడిన తొమ్మిది మ్యాచ్ ల్లో ఎనిమిది విజయాలు సాధించగలిగింది. 2021లో జరిగే టీ-20 ప్రపంచకప్ వరకూ భారతజట్టు చీఫ్ కోచ్ గా రవిశాస్త్రి సేవలు అందించనున్నాడు.

2015 ప్రపంచకప్ లో భారతజట్టుకు టీమ్ డైరెక్టర్ గా పనిచేసిన రవిశాస్త్రి.. 2007 బంగ్లాదేశ్ టూర్, 2014-16 సీజన్లో టీమ్ డైరెక్టర్ గా ఉన్నాడు. 2017 నుంచి జట్టు ప్రధాన శిక్షకుడుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లకూ భారీగా వేతనాలు

భారత జట్టుకు ఫీల్డింగ్, బౌలింగ్ కోచ్ లుగా వ్యవహరిస్తున్న ఆర్.శ్రీధర్, భరత్ అరుణ్ లకు సైతం వేతనం పెరగనుంది. ఈ ఇద్దరూ 3 కోట్ల నుంచి 3 కోట్ల 50 లక్షల రూపాయల వరకూ వేతనం అందుకోనున్నారు.

బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన విక్రమ్ రాథోడ్ కు 2 కోట్ల 50 లక్షల నుంచి 3 కోట్ల వరకూ వార్షిక వేతనం ఇవ్వనున్నారు.

బీసీసీఐ సరికొత్త కాంట్రాక్టు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానుంది.

First Published:  10 Sept 2019 5:08 AM IST
Next Story