Telugu Global
Others

నిరర్థకమైన పునరాలోచన

మొదటిసారి పైపైన చూసి నిర్ణయాలు తీసుకుంటే అందులో పక్షపాతం, దురభిప్రాయాలు ఉండవచ్చు. ఇవి హేతుబద్ధంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు కాకపోవచ్చు. కశ్మీర్ కు వర్తించే 370వ అధికరణాన్ని రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించినప్పుడు జనతా దళ్ (యు) లాంటి చిన్న పార్టీలు మరో సారి ఆలోచించిన తరవాత ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించాయి. కొంత మంది కాంగ్రెస్ నాయకులు కూడా పునరాలోచన తరవాత ప్రభుత్వాన్ని సమర్థించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి తాము వ్యతిరేకం అంటున్న ఆం ఆద్మీ పార్టీ, […]

నిరర్థకమైన పునరాలోచన
X

మొదటిసారి పైపైన చూసి నిర్ణయాలు తీసుకుంటే అందులో పక్షపాతం, దురభిప్రాయాలు ఉండవచ్చు. ఇవి హేతుబద్ధంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు కాకపోవచ్చు. కశ్మీర్ కు వర్తించే 370వ అధికరణాన్ని రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించినప్పుడు జనతా దళ్ (యు) లాంటి చిన్న పార్టీలు మరో సారి ఆలోచించిన తరవాత ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించాయి. కొంత మంది కాంగ్రెస్ నాయకులు కూడా పునరాలోచన తరవాత ప్రభుత్వాన్ని సమర్థించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి తాము వ్యతిరేకం అంటున్న ఆం ఆద్మీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ కూడా పునరాలోచించిన తరవాత కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయాలన్న నిర్ణయాన్ని సమర్థించాయి.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన ఈ పక్షాలు మొదట కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి ఉండి తీరాల్సిందే అనుకున్నా ఆ తరవాత పునరాలోచించి మనసు మార్చుకున్నాయి. కొత్తగా ప్రభుత్వానికి మద్దతిచ్చిన వారు మొదట సంశయంలో ఉండి ఉండొచ్చు. ఆ తరవాత నిర్ణయం మార్చుకుని ఉండవచ్చు. వారిలో పునరాలోచన వచ్చింది. పునరాలోచించి తీసుకున్న నిర్ణయం లోపరహితమైంది అని కూడా వారు అనుకోవచ్చు. 370వ అధికరణం రద్దును సమర్థించాల్సిందే అని భావించి ఉండొచ్చు.

అయితే కొత్తగా ప్రభుత్వ సమర్థకులుగా మారిన వారందరికీ ఓ సామ్యం ఉంది. జె.డి.(యు), కాంగ్రెస్ లోని కొందరు కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దును సమర్థించడం పొరపాటు అని ముందు అనుకుని ఉండవచ్చు. అది సమస్య అవుతుందని కూడా భావించి ఉండవచ్చు. పునరాలోచించినప్పుడు తమ వైఖరిని మార్చుకుని ఉండవచ్చు. పునరాలోచించి తీసుకున్న నిర్ణయం నిర్దుష్టమైంది, రాజకీయంగా సరైందని భావించారేమో. అయితే 370వ అధికరణం రద్దును సమర్థించడంలో కచ్చితంగా పొరపాటు లేదని చెప్పగలరా అన్నది ప్రశ్న. తమ తప్పు సరిదిద్దుకున్నామనుకునే వీరికి ఉన్న నైతిక ప్రమాణం ఏమిటి?

కొత్తగా మద్దతిచ్చిన వారి గురించి కూడా పునరాలోచించాల్సిందే. కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడంవల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని, ముఖ్యంగా పర్యాటకుల మీద, అమర్ నాథ్ యాత్రికుల మీద తీవ్రపరిణామాలు ఉంటాయని, మొత్తం కశ్మీర్ మీదే తీవ్ర ప్రభావం ఉంటుందని వీరు ఆలోచించారా అని కూడా వివేచించాలి.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన వారికి వారి కారణాలు వారికి ఉండవచ్చు. అయినా దీనివల్ల దుష్పరిణామాలు తప్పవని ప్రభుత్వానికి చెప్పవలసిన అవసరం వీరికి ఉంటుంది. ఇలా సమర్థించిన వారు తమ రాజకీయ కార్యాచరణలో నిలకడైన నైతిక ప్రమాణాలు పాటించాలి కదా! 370వ అధికరణాన్ని రద్దు చేసే ముందు ప్రజల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.

సమస్యల్లో చిక్కుకున్న వారి విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న పరిస్థితి ప్రస్తుత ఆచరణే ప్రధానమైన రాజకీయాల్లో కనిపించడం లేదు. సమస్యేమిటంటే ఈ రాజకీయ పక్షాలు తమ వైఖరిని నిరంతరం పరిశీలించుకోవడం లేదు. కశ్మీరీలకు ఉన్న రాజ్యాంగ రక్షణను పరిరక్షించాలని భావిస్తున్నట్టు లేదు. అక్కడి ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలను పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. సమకాలీన రాజకీయాల్లో సమస్యల్లో కూరుకుపోయిన వారిని పట్టించుకోవలన్న ధోరణి కనిపించడం లేదు. ఇది దేశవ్యాప్తంగా సమస్యల్లో కూరుకుపోయిన వారి మీద కూడా దుష్ప్రభావం కలుగ చేస్తుంది.

వైపరీత్యం ఏమిటంటే ఇలాంటి పార్టీలన్నీ సామాజికంగా అణగారిన పక్షాల తరఫున పని చేస్తామని చెప్పుకుంటాయి. కానీ విస్తృతమైన చర్చ, సంప్రదింపులు జరపకుండా “వివేకవంతమైన” నిర్ణయం ఏ ప్రభుత్వమూ తీసుకోలేదని ఈ పక్షాలు గ్రహించడం లేదు. పటిష్ఠమైన ప్రభుత్వం అనుకునేది అణగారిన వర్గాల ఆకాంక్షలను అణగదొక్కుతుందన్న వాస్తవాన్ని గుర్తించడం లేదు. ఆ ప్రభుత్వం పటిష్ఠంగా ఉండడానికి ఈ పక్షాలూ కారణమే.

సవ్యమైన పునరాలోచన అంటే తమ రాజకీయ నిర్ణయాలను తైపారు వేసుకుని చూడడం. అప్పుడే వివిధ పక్షాలు ప్రభుత్వం జావాబుదారీగా ఉండేట్టు చూడగలుగుతాయి. ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుచుకునేట్టు చేయగలుగుతాయి. పునరాలోచనకు ఎప్పుడూ మొదటి ఆలోచన నుంచి సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. పటిష్ఠమైనవి అనుకునే ప్రభుత్వాలు తమ సిద్ధాంత బలిమివల్ల తాము “తప్పు” చేయం అనుకుంటాయి. సరైన పునరాలోచనకు తావివ్వవు. అసమగ్రమైన రాజకీయ నిర్ణయాలే తీసుకుంటాయి. పునరాలోచన ఎప్పుడూ సామాజిక రాజకీయ పరిస్థితులు మెరుగు పడడానికి, ప్రజాస్వామ్య బద్ధమైన రాజ్యాంగం ప్రకారం పాలన కొనసాగడానికి దోహదం చేయాలి.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  6 Sept 2019 7:02 PM GMT
Next Story