గురువును ఏ విద్యార్ధీ మరచిపోడు... దానికి వైఎస్సే సాక్షి
“వంద శాతం అక్షరాస్యత సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. అందరూ విద్యావంతులైన రోజున రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం సుసాధ్యం అవుతుంది. సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం. వాళ్ళు అందించే విద్య వల్లే ఏ సమాజం అయినా అభివృద్ధి పథంలో పయనిస్తుంది” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన వేడుకలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ […]
“వంద శాతం అక్షరాస్యత సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. అందరూ విద్యావంతులైన రోజున రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం సుసాధ్యం అవుతుంది. సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం. వాళ్ళు అందించే విద్య వల్లే ఏ సమాజం అయినా అభివృద్ధి పథంలో పయనిస్తుంది” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు.
గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన వేడుకలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ముఖ్యమంత్రి అవార్డులతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న అయిదేళ్లలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. “సంపూర్ణ అక్షరాస్యత సాధించడంలో భాగంగా అమ్మ ఒడి, ఫీజు రియంబర్స్ మెంట్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. పాఠశాలలను బలోపేతం చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాం” అని స్పష్టం చేశారు.
తాను పాదయాత్ర చేసిన సందర్భంగా అనేక మంది ఉపాధ్యాయులు తమ సమస్యలను తనకు విన్నవించారనీ, అలా తన వద్దకు వచ్చిన ఉపాధ్యాయులను గత తెలుగుదేశం ప్రభుత్వం సస్పెండ్ చేసిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
“నాకు చదువు చెప్పిన ప్రతి గురువుకు పాదాభివందనం చేస్తున్నాను. విద్య లేని సమాజం ఎక్కడా అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు. అందుకే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాను. విద్యారంగంలో నేను తీసుకు వస్తున్నమార్పులకు ఉపాధ్యాయుల నుంచి పూర్తి సహాయ, సహకారాలు అందుతాయని నేను నమ్ముతున్నాను” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
2011 సంవత్సరం లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో నిరక్షరాస్యత శాతం జాతీయ స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉందని, వచ్చే ఐదేళ్లలో ఇది పూర్తిగా మారిపోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. “జాతీయ స్థాయిలో నిరక్షరాస్యత 27 శాతం ఉంటే ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం అది 33 శాతం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి పూర్తిగా మారిపోవాలి” అని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
తనకు చదువు నేర్పిన గురువును ఏ విద్యార్ధి మరచిపోరని…. అందుకు తన తండ్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సాక్షి అని ముఖ్యమంత్రి తెలిపారు. “నా తండ్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి తనకు విద్యాబుద్ధులు నేర్పిన బీసీ కులానికి చెందిన ఉపాధ్యాయుడు వెంకటప్పయ్య పేరిట ఓ స్కూల్ ప్రారంభించారు. ఆ పాఠశాల వైయస్సార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేటికీ అద్భుతంగా పని చేస్తోంది” అని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రితో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.