Telugu Global
National

శివుని సిగలో గంగలా.... మేఘా సిగలో ఉప్పొంగిన గోదావరి

మేఘా ఇంజనీరింగ్ భూగర్భంలో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. నదిలో వరదను మరిపించేలాగ గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రం నుంచి నీరు ఉవ్వెత్తున పైకి ఎగసిపడి కాలువలోకి ఉరకలు వేస్తూ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదలు వచ్చినప్పుడు నది సుడులు తిరిగినట్లుగా భూమిలోనుంచి పైకి కాళేశ్వరం నీటిని ఎగచిమ్ముతోంది. ఆ దృశ్యం కళ్ళకు కనువిందు చేస్తోంది. గుండెను ఆహ్లాదంగా తడిమి పులకరింపజేస్తోంది. ఎండిన చేనుకు తడితగలగానే విత్తనం మొక్కగా పైకి చీల్చుకువచ్చినట్లు భూమి పొరల్లోంచి నీరు తన్నుకు వస్తోంది. సముద్రపు […]

శివుని సిగలో గంగలా.... మేఘా సిగలో ఉప్పొంగిన గోదావరి
X

మేఘా ఇంజనీరింగ్ భూగర్భంలో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది.

నదిలో వరదను మరిపించేలాగ గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రం నుంచి నీరు ఉవ్వెత్తున పైకి ఎగసిపడి కాలువలోకి ఉరకలు వేస్తూ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదలు వచ్చినప్పుడు నది సుడులు తిరిగినట్లుగా భూమిలోనుంచి పైకి కాళేశ్వరం నీటిని ఎగచిమ్ముతోంది. ఆ దృశ్యం కళ్ళకు కనువిందు చేస్తోంది. గుండెను ఆహ్లాదంగా తడిమి పులకరింపజేస్తోంది. ఎండిన చేనుకు తడితగలగానే విత్తనం మొక్కగా పైకి చీల్చుకువచ్చినట్లు భూమి పొరల్లోంచి నీరు తన్నుకు వస్తోంది. సముద్రపు అలల్ని తలపించేలాగా, నిండు కుండను మరిపించేలాగ గోదారమ్మ మానేరులో గాయత్రి పంపింగ్‌ తో కళకళలాడుతోంది. గోదావరి నీరు ఉవ్విళ్ళూరుతూ వడివడిగా మిడ్మానేరు వైపు పరుగులు పెడుతోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద నీటి పంపింగ్ కేంద్రాన్ని ఆగస్టు 11న ప్రారంభించి ఇప్పటి వరకు నిరంతరాయంగా పంపింగ్ కొనసాగిస్తూ క్రమంగా మిషన్ల వినియోగాన్ని పెంచుతోంది. మొదటి దశలో రోజుకు 2 టిఎంసీల నీటిని పంపింగ్ చేసే విధంగా 5 మిషన్లను ఏర్పాటు చేయగా ఇప్పటికి నాలుగు మిషన్లు (మూడవ మిషన్ మినహా) వినియోగంలోకి తెచ్చింది. వీటి ద్వారా సరాసరిన 15 వేల క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తోంది.

22 రోజుల్లో 3 మిషన్లతో 11 టిఎంసిల పంపింగ్

ప్రపంచంలో అతిపెద్ద పంపింగ్ కేంద్రం గాయత్రి (లక్ష్మీపూర్) భూగర్భ పంపింగ్ కేంద్రం. ఇప్పటి దాకా, అంటే 22 రోజుల్లో 3 మిషన్ల ద్వారా 11.40 టిఎంసీల నీటిని పంపింగ్ చేసి మిడ్ మానేరుకు చేర్చింది. అందులో 5వ మిషన్ మొదట ప్రారంభించగా 380 గంటల పాటు నిరంతరాయంగా పనిచేసింది (16 రోజులపాటు). 2వ మిషన్ (క్రమ సంఖ్య 4) అదే రోజుల్లో 378 గంటలపాటు పనిచేసింది. ఈ రెండు మిషన్లు సరాసరిన ఒక్కొక్కటి 4.30 టిఎంసీల చొప్పున నీటిని పంప్ చేశాయి. మూడవ మిషన్ (క్రమసంఖ్య 1) 10 రోజులపాటు (అంటే ఆలస్యంగా ప్రారంభించారు) 248 గంటలు పనిచేసి 2.80 టిఎంసిల నీటిని పంప్ చేసింది.

470 అడుగుల లోతునుంచి పంపింగ్‌

ఈ పంపింగ్ కేంద్రం భూమికి దిగువన 470 అడుగుల నుంచి నీటిని పైకి వెదజిమ్ముతోంది. భూగర్భంలో ఈ ‘మెగా’మహాద్భుతాన్ని ఆవిష్కరించి 22 రోజులు కావస్తుండగా నీటి పంపింగ్ తీరు చూపరులను ఆకట్టుకుంటోంది. 327 మీటర్ల పొడవున నిర్మించిన ప్రపంచంలోనే పెద్దదయిన ఈ నిర్మాణంలో ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్ధ్యంతో 5 మిషన్లు (మోటారు, పంపు కలిపి ఒక్కో మిషన్) ఏర్పాటయ్యాయి. 2వ దశ కింద మరో రెండు మిషన్లు సిద్ధమవుతున్నాయి. వాటిలో ఒకటి డ్రైరన్ కూడా పూర్తయింది.

గోదావరికి గాయత్రి కొత్త నడక

బీడువారిన చేలకు నీరు అందించేందుకు, రైతుల్లో ఆశలు చిగురింపచేస్తూ గోదావరి పరవళ్లకు వ్యతిరేక దిశలో నీటికి కొత్త నడకలు నేర్పుతూ నీటిని ఎగువకు పంపింగ్ చేయడంలో భూగర్భ గాయత్రి పంపింగ్ కేంద్రం గుండెకాయ వంటి పాత్రను పోషిస్తోంది. జులైలోనే లింక్-1లోని లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ల) నుంచి నీటిని పంపింగ్ చేస్తున్న మేఘా తన రికార్డును తానే అధిగమించింది.

ఇంత పెద్ద స్థాయిలో నిర్మించిన పంపింగ్ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు అనివార్యమంటూ సన్నాయి నొక్కులు నొక్కినవారి ముక్కున వేలేసుకునే విధంగా మేఘా పంపింగ్ కేంద్రాలు నీటిని ఎగువకు ఎగజిమ్ముతూ ఇంజనీరింగ్ అద్భుతాలను సృష్టిస్తున్నాయి. ఇప్పటి దాకా అతిపెద్ద పంపింగ్ కేంద్రాలుగా హంద్రీనీవా మొదటిదశలోని 12 కేంద్రాలు ప్రసిద్ధి చెందాయి. ఇదే పధకంలోని 2వ దశలో 18 కేంద్రాలు పనిచేస్తున్నాయి. అలాగే ప్రాముఖ్యత సంతరించుకున్న పట్టిసీమ, పురుషోత్తపట్నం, ముచ్చుమర్రి ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో ఏ పంపింగ్ కేంద్రం చూసినా మేఘా ఇంజనీరింగ్ నిర్మించినవే.

చిన్నబుచ్చుకున్న పట్టిసీమ

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నీటి పంపింగ్ కేంద్రాలు పనితీరును పరిశీలిస్తే తన రికార్డును తానే మేఘా ఇంజనీరింగ్ బద్దలుకొట్టింది. రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకోవడంతో పాటు గోదావరి-కృష్ణ నదులను అనుసంధానం చేసిన పట్టిసీమలో 24 మిషన్లు వున్నాయి.

ఈ పథకాన్ని గడువులోగా నిర్మించి, మేఘా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులకెక్కింది. గత ఐదేళ్లుగా విజయవంతంగా నీటిని పంపుచేస్తున్న ఈ పథకం 2015 నుంచి ఇప్పటి దాకా (ఆగస్టు 31వరకు) 289.8 టిఎంసీల నీటిని పంపు చేసింది. 2018లో 76,068 గంటలు పంపు చేసి 96.94 టిఎంసిల కృష్ణలోకి చేర్చింది. ఈ ఏడాది (2019) ఇప్పటి (ఆగస్టు 31) వరకు 21,356 గంటలు పనిచేసి, 27.22 టిఎంసిల నీటిని అనుసంధానంలో భాగంగా గోదావరి నుంచి కృష్ణకు తరలించింది.

ఎగసిపడుతున్న ‘మేఘా’పంపింగ్

ఈ పథకంతో పోల్చితే గాయత్రి (లక్ష్మీపూర్) భూగర్భ పంపింగ్ కేంద్రం భూమికి దిగువన 470 అడుగుల లోతులో వుంది. అయినప్పటికీ 22 రోజుల్లో 1006 గంటలు పనిచేసి 11.40 టిఎంసిల నీటిని మిడ్ మానేరుకు చేర్చింది. మిడ్ మానేరు సామర్ధ్యం 25 టిఎంసిలు కాగా, అందులో అంత మొత్తం నీటిని 22 రోజుల్లో మూడు మిషన్ల ద్వారా చేర్చిందంటే ఈ మేఘా మిషన్ల విశిష్టత ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిజంగానే పట్టిసీమ లాగ 21,356 గంటలు పనిచేస్తే ఎంత నీరు చేరుతుందో ఊహించుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంచుమించు 230 టిఎంసిల నీరు మిడ్ మానేరుకు చేరుతుంది. ఆ జలాశయం సామర్ధ్యం 25.60 టిఎంసిలు (పదో వంతు మాత్రమే). దీన్ని బట్టి చూస్తే ఈ పంపింగ్ కేంద్రం గొప్పతనం అర్ధమవుతుంది.

ప్రాణహిత నీటిని ఎగువకు మళ్ళిస్తున్న లక్ష్మి

లింక్-1 లోని లక్ష్మీ (మేడిగడ్డ) పంపింగ్ కేంద్రం జూన్ 21న ముఖ్యమంత్రులు, నాటి గవర్నర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే! ప్రాణహిత నీటిని ఒడిసిపట్టి ఎగువకు మళ్లించడంలో ఈ పంపింగ్ కేంద్రం కీలకమైనది. ఇందులో ఆరు మిషన్లు పనిచేస్తుండగా 36 రోజుల్లో 1593 గంటలు (అన్ని మిషన్లు కలిపి) నీటిని 12.20 టిఎంసిలు పంపు చేశాయి. ముఖ్యమంత్రులు ప్రారంభించిన ఆరవ మిషన్ అత్యధికంగా 22 రోజుల్లో 367 గంటల పాటు 2.80 టిఎంసిల నీటిని పంపు చేసింది. దాదాపు అదే విధంగా 4, 3, 1, 5 మిషన్లు కూడా పనిచేశాయి. ఆలస్యంగా ప్రారంభమైన 2వ మిషన్ ఇప్పటి దాకా (ఆగస్టు 31) 0.7 టిఎంసిల నీటిని అందించింది.

5 టీఎంసీలను పంప్‌ చేసిన సరస్వతి

సరస్వతి (అన్నారం) పంపింగ్ కేంద్రం ఇప్పటి దాకా 6 మిషన్లను 16 రోజుల్లో 461 గంటల పాటు పనిచేయించి 4.86 టిఎంసిల నీటిని పంపు చేసింది. అందులో ప్రధానంగా 1వ మిషన్ 8 రోజుల్లో 161 గంటలు పనిచేసి 1.70 టిఎంసిల నీటిని సుందిళ్లకు అందించింది. ఇక ఎల్లంపల్లికి నీటిని చేర్చి లింక్-1, లింక్-2 మధ్య అనుసంధానంగా వుండే పార్వతి (సుందిళ్ల) పంపింగ్ కేంద్రం 11 రోజుల్లో 23.67 గంటలపాటు ఆరు మిషన్లను పనిచేయించింది. అయితే గోదవరికి వరద వచ్చి ఎల్లంపల్లి నిండటంతో ఈ పంపింగ్ కేంద్రం వినియోగం ద్వారా నీటి తరలింపు అంతంత మాత్రంగానే వుంది.

హంద్రీనీవాను మించిన లక్ష్మి

పంపింగ్ కేంద్రాల నిర్మాణంలో విశిష్టత చాటుకున్న మేఘా ఇంజనీరింగ్ దేశంలో నిర్మించిన అతిపెద్ద పంపింగ్ కేంద్రాలతో పోల్చితే ఈ ప్రాజెక్టులోని లింక్-1లోని మూడు కేంద్రాలు లింక్-2లోని గాయత్రి పంపింగ్ కేంద్రం ఎంత పెద్దదో ఇట్టే అర్ధమవుతుంది. అతి పెద్దది, ముఖ్యంగా అతి పొడవైనదిగా ఎక్కువ పంపింగ్ కేంద్రాలతో హంద్రీనీవా ప్రసిద్ధి చెందింది.

ఇందులో మొదటిదశలో 12 కేంద్రాలు, 2వ దశలో 18 కేంద్రాలు వున్నాయి. మొదటి దశలోని మొదటి పంపింగ్ కేంద్రం కృష్ణ నదివద్ద శ్రీశైలం ఎగువ భాగంలో మాల్యాల దగ్గర నిర్మించారు. ఈ పంపింగ్ కేంద్రంలో 12 మిషన్లు వున్నాయి. ఒక్కొక్క మిషన్ ద్వారా 9.56 క్యూమెక్కుల నీటిని 5 మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మించారు. సరాసరి నీటి పంపింగ్ ఎత్తు 38 మీటర్లు.

మళ్లీ మనం కాళేశ్వరంలోకి వస్తే లింక్-1లో ఒక్కొక్క మిషన్ సామర్ధ్యం 40 మెగావాట్లు. ఒక్క లక్ష్మీకేంద్రంలోనే 17 మిషన్లు వున్నాయి. వీటి మొత్తం సామర్ధ్యం 680 మెగావాట్లు. హంద్రీనీవా మాల్యాల పంపింగ్ కేంద్రం మొత్తం సామర్ధ్యం 60 మెగావాట్లు. అంటే దాని కన్నా లక్ష్మీ (కాళేశ్వరంలో) పంపింగ్ కేంద్రం ఎంత పెద్దదో ఇట్టే అర్ధమైపోతుంది.

లక్ష్మిని మించిన గాయత్రి

ఈ లక్ష్మి కేంద్రంతో పోల్చితే గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రం మరింత పెద్దది. ఇందులో ఒక్కొక్కటి 139 మెగావాట్ల చొప్పున 7 మిషన్లు 973 మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మించింది. అందులోనూ భూగర్భంలో 470 అడుగుల దిగువన నిర్మించినది. అంటే ఏ పంపింగ్ కేంద్రాలతోనూ గాయత్రి కేంద్రానికి అసలు పోలికే లేదు.

హంద్రీనీవా అతిపెద్ద పంపింగ్ పధకం అయినప్పటికీ అందులో మరింత పెద్దదిగా పరిగణించేది మాల్యాలలోనిది (అంటే మొదటి కేంద్రం). ఇక్కడ 2012 నుంచి పంపింగ్ జరుగుతుండగా ఇప్పటి దాకా 8 ఏళ్లలో 1242 రోజులపాటు పంపింగ్ జరిగి 163.4 టిఎంసిల నీటిని ఎత్తిపోశారు. అదే సమయంలో పట్టిసీమ నుంచి ఐదేళ్ల కాలంలో 289 టిఎంసిల నీటిని అందించారు. ఈ పంపింగ్ కేంద్రాలు పనిచేసిన విధంగా లింక్-1, లింక్-2లోని నాలుగు మెగా పంపింగ్ కేంద్రాలు పనిచేస్తే ఎంత నీరు తెలంగాణ బీడు భూములకు చేరుతుందో అంచనా వేయొచ్చు.

కాళేశ్వరం లక్ష్యం నెరవేర్చడంలో మేఘా తన ఇంజనీరింగ్ ప్రావీణ్యాన్ని, ప్రత్యేకతను అద్భుత పంపింగ్ ద్వారా చాటుకుంటోంది. ప్రారంభంలోనే అంత భారీ స్థాయిలో నీటిని అందిస్తుంటే భవిష్యత్తులో హంద్రీనీవా, పట్టిసీమ పథకాల తరహాలో వేల గంటలు పనిచేస్తే తెలంగాణలో ఇక నీటికి కరువే లేదు.

First Published:  4 Sept 2019 5:31 AM IST
Next Story