Telugu Global
NEWS

కరకట్ట బాబుకు కట్టప్పేనా?

చంద్రబాబుకు ఇబ్బంది వస్తే లోకేష్ అయినా కదులుతారో లేదో కానీ పవన్‌ కల్యాణ్‌ మాత్రం పరుగుపరుగున వచ్చేస్తారు అన్నది విమర్శ. పార్టనర్‌ అంటే పవన్‌ కల్యాణ్ కున్న కమిట్ మెంట్ లాంటిదని కొందరంటుంటారు. 2014లో తన భుజాలపై ఎత్తుకుని చంద్రబాబును గెలిపించారు. కానీ ఆ తర్వాత చంద్రబాబు విధానాలతో నేరుగా సపోర్ట్ చేయలేని పరిస్థితి 2019 ఎన్నికల నాటికి పవన్‌ కల్యాణ్‌కు వచ్చింది. అయినా సరే ఎన్నికల ప్రచారంలో మాత్రం టార్గెట్ జగన్‌గానే పవన్‌ కల్యాణ్ ప్రసంగాలు […]

కరకట్ట బాబుకు కట్టప్పేనా?
X

చంద్రబాబుకు ఇబ్బంది వస్తే లోకేష్ అయినా కదులుతారో లేదో కానీ పవన్‌ కల్యాణ్‌ మాత్రం పరుగుపరుగున వచ్చేస్తారు అన్నది విమర్శ. పార్టనర్‌ అంటే పవన్‌ కల్యాణ్ కున్న కమిట్ మెంట్ లాంటిదని కొందరంటుంటారు.

2014లో తన భుజాలపై ఎత్తుకుని చంద్రబాబును గెలిపించారు. కానీ ఆ తర్వాత చంద్రబాబు విధానాలతో నేరుగా సపోర్ట్ చేయలేని పరిస్థితి 2019 ఎన్నికల నాటికి పవన్‌ కల్యాణ్‌కు వచ్చింది.

అయినా సరే ఎన్నికల ప్రచారంలో మాత్రం టార్గెట్ జగన్‌గానే పవన్‌ కల్యాణ్ ప్రసంగాలు సాగాయి. చంద్రబాబు మళ్లీ గెలిచినా పర్వాలేదు గానీ… జగన్‌కి మాత్రం చాన్స్ ఇవ్వకూడదు అన్నట్టుగా పవన్ వ్యవహరించారు. అయితే పవన్‌ ఎన్నికల్లో అట్టర్‌ ప్లాప్‌ అయ్యారు. రెండు చోట్లా పోటి చేసి రెండు చోట్లా ఓడిపోయి… అసెంబ్లీ గేటు వద్దకు కూడా రాలేకపోయాడు.

ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండడంతో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అన్న లైన్‌లో తిరిగి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ కలిసిపోయేందుకు సిద్ధమవుతున్నట్టుగా ఉంది. కరకట్టపై అక్రమంగా నిర్మించిన ఇంట్లో ఎలా ఉన్నావు… ఖాళీ చేయవచ్చు కదా అని చంద్రబాబును ప్రశ్నించని పవన్‌ కల్యాణ్… వరద పరిశీలన కోసం డ్రోన్‌ ఎగరవేయగానే చంద్రబాబు ఇంటి చుట్టూ డ్రోన్ ఎగరవేయడం తప్ప మరో పని లేదా అని మంత్రులను పవన్ విమర్శించాడు.

ఇక అమరావతిలో టీడీపీ నేతల వేల ఎకరాల ఇన్‌సైడర్ ట్రేడింగ్ వివరాలు బయటకు వస్తుండడం, అమరావతి ముంపు అంశం తెరపైకి రావడంతో తక్షణం పవన్ కల్యాణ్ రంగ ప్రవేశం చేశారు.

గతంలో అమరావతి ఒక కులం కోసం కడుతున్న రాజధాని…. తన మనసంతా కర్నూలు రాజధానిగా ఉండాలనే ఉంది అంటూ కోతలు కోసిన పవన్ ఇప్పుడు మాత్రం అమరావతిని కదిలిస్తే ప్రధానికి చెబుతా అని స్కూల్‌ పిల్లాడిలా మాట్లాడుతున్నాడు.

అమరావతి విషయంలో ప్రభుత్వ విధానాన్ని పవన్ విమర్శిస్తున్నారే గానీ… వేల ఎకరాల ఇన్‌సైడర్ ట్రేడింగ్ గురించి మాత్రం మాట్లాడడం లేదు. బాలకృష్ణ చిన్నల్లుడికి చంద్రబాబు కట్టబెట్టిన 498 ఎకరాల గురించి గానీ, సుజనాచౌదరికి చెందిన 623 ఎకరాల గురించి కానీ… నారాయణకు చెందిన 3వేల ఎకరాలకు పైగా రాజధాని భూముల గురించి మాత్రం ఒక్క మాట కూడా పవన్ మాట్లాడలేదు.

ఈ ధోరణి చూసిన తర్వాతే చాలా మంది పవన్‌ కల్యాణ్… కరకట్ట బాబుకు కట్టప్పలాంటి వాడు అని ఓపెన్‌గానే విమర్శిస్తున్నారు. ఇలా తమ కోసం మాటలు పడుతూ నిలబడ్డ పవన్‌ కల్యాణ్ పట్ల చంద్రబాబు, లోకేష్ ప్రదర్శిస్తున్న ప్రతి విశ్వాసం కూడా ఆసక్తిగానే ఉంది.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తన సొంత అన్న చిరంజీవికి ఆడియో ఫంక్షన్ వేదికకు అనుమతి ఇవ్వకపోయినా… లేపాక్షి ఉత్సవాలకు మెగా హీరోలను ఆహ్వానిస్తారా అని అడిగితే తమ నుంచి ఆహ్వానం అందుకునేందుకు ఒక స్థాయి ఉండాలంటూ స్పెషల్ బ్రీడ్ బాలయ్య హేళన చేసినా అవేవి మనసులో పెట్టుకోకుండా తిరిగి రాజధాని భూముల విషయంలో తమకు అండగా నిలుస్తున్న పవన్‌ కల్యాణ్‌ను ఆయన పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు, లోకేష్ ఆకాశానికెత్తారు.

పవన్‌ కల్యాణ్‌లో…. లోకేష్‌కు ఉన్నత భావాలు కనిపించాయి. ఉన్నతమైన భావాలతో ప్రజాక్షేత్రంలో ప్రయాణిస్తున్న పవన్ కు ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందించాలని లోకేష్ కోరుకున్నారు.

పవన్‌ కల్యాణ్ విశిష్ట వ్యక్తిత్వంతో, ప్రజల పక్షాన నిలిచి సేవలందిస్తున్నారని… శతాయుష్కులై, సంపూర్ణ ఆనందారోగ్యాలతో వర్ధిల్లాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఇటీవల ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్ ఒంటరి దుకాణం వల్ల సాధించేది ఏమీ లేదని తేలిన నేపథ్యంలో… ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకోకతప్పదన్న భావనకు రెండు పార్టీల పెద్దలు వచ్చినట్టున్నారు.

First Published:  3 Sept 2019 5:08 AM IST
Next Story