పవన్ వెంట తెలుగు తమ్ముళ్లు... రాజధాని వాసుల్లో అయోమయం
“ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే..” ఇది జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోని ఓ రీమేక్ పాట. ఇప్పుడు ఈ పాటని రాజధాని వాసులు, జనసేన కార్యకర్తలు “పవన్ కళ్యాణ్ మాటలకు అర్థాలు వేరులే” అని పాడుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటనుకుంటున్నారా..? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జనసేన పార్టీ అధ్యక్షుడి హోదాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ వెంట ఉన్న వారందరూ తెలుగుదేశం పార్టీ నాయకులే కావడం విశేషం. రాజధానిలో భూములు కావాలని రైతులను ఇబ్బంది […]
“ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే..” ఇది జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోని ఓ రీమేక్ పాట. ఇప్పుడు ఈ పాటని రాజధాని వాసులు, జనసేన కార్యకర్తలు “పవన్ కళ్యాణ్ మాటలకు అర్థాలు వేరులే” అని పాడుకుంటున్నారు.
ఇంతకీ విషయం ఏమిటనుకుంటున్నారా..? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జనసేన పార్టీ అధ్యక్షుడి హోదాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ వెంట ఉన్న వారందరూ తెలుగుదేశం పార్టీ నాయకులే కావడం విశేషం.
రాజధానిలో భూములు కావాలని రైతులను ఇబ్బంది పెట్టవద్దు అంటూ తాను గతంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని హెచ్చరించాను అంటూ ప్రకటనలు చేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఆ పార్టీ నాయకులనే తన వెంట పెట్టుకుని రాజధానిలో పర్యటించడం అందరినీ ఆశ్చర్యానికి, అయోమయానికి గురి చేస్తోంది.
రాజధాని లో పర్యటించిన పవన్ కళ్యాణ్ వెంట తాడేపల్లి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు జంగాల సాంబశివరావు, మంగళగిరి మాజీ జెడ్పిటీసీ ఆకుల జయసూర్యతో పాటు మరి కొందరు తెలుగుదేశం నాయకులు ఉన్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు తమను నిలువునా ముంచిన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కూడా ఈ పర్యటనలో ఉండడం రాజధాని ప్రాంత రైతులు, కార్మికులకు ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం కూడా తెప్పించింది.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆదేశాలతోనే స్థానిక తెలుగుదేశం నాయకులు పవన్ కళ్యాణ్ తో పాటు పర్యటించారని రాజధాని వాసులు మండిపడుతున్నారు.
“ఇదేమి రాజకీయం. ఇదేమి ప్రజా పోరాటం. మాకు అన్యాయం చేసిన వాళ్లతో కలిసి వచ్చి మాకు న్యాయం చేస్తాం అంటూ ప్రకటనలు చేయడం ఏమిటి. ఈ పర్యటనతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక్కటేనని మరోసారి బహిర్గతమైంది” అని రాజధాని వాసులు మండిపడుతున్నారు.
చంద్రబాబు నాయుడుని నమ్మి నిట్టనిలువునా మోసపోయినా… పవన్ కళ్యాణ్ వైఖరిలో ఏమాత్రం మార్పు రాకపోవడం ఆయన రాజకీయ పరిణితిని తెలియజేస్తోంది అంటున్నారు.
తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెంట తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు రావడాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
“మేము జనసేన పార్టీలో ఉన్నామా…? లేక తెలుగుదేశం పార్టీలో ఉన్నామా…? అనే అనుమానాలు వస్తున్నాయి” అని రాజధాని ప్రాంతానికి చెందిన జనసేన సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.